Russia-Ukraine Crisis | ఉక్రెయిన్‌పై దాడి చేశారో..: పుతిన్‌కు బైడెన్‌ వార్నింగ్‌-russia attack on ukraine still possible says us president joe biden ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Russia Attack On Ukraine Still Possible Says Us President Joe Biden

Russia-Ukraine Crisis | ఉక్రెయిన్‌పై దాడి చేశారో..: పుతిన్‌కు బైడెన్‌ వార్నింగ్‌

Hari Prasad S HT Telugu
Feb 16, 2022 07:15 AM IST

ఉక్రెయిన్‌ సరిహద్దు నుంచి కొన్ని రష్యా బలగాలు వెనక్కి వెళ్లాయన్న వార్తలు వస్తున్నా.. దాడికి ఇంకా ఛాన్స్‌ ఉందని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. అదే జరిగితే కఠిన చర్యలు తప్పవని పుతిన్‌కు బైడెన్‌ వార్నింగ్ ఇచ్చారు.

రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (REUTERS)

వాషింగ్టన్‌: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. మంగళవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రష్యాకు చెందిన లక్షా 50 వేల బలగాలు ఉక్రెయిన్‌ను చుట్టుముట్టాయని, ముందుగా అనుకున్న లక్ష బలగాల కంటే ఇది ఎక్కువని బైడెన్‌ అన్నారు. 

ట్రెండింగ్ వార్తలు

ఉక్రెయిన్‌ సరిహద్దు నుంచి కొన్ని రష్యా బలగాలు వెనక్కి వెళ్తున్నాయన్న వార్తలు వచ్చినా.. వీటిని ఇంకా ధృవీకరించుకోలేదని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒకవేళ అదే జరిగితే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి దౌత్యమే మార్గమని ఆయన సూచించారు. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే మాత్రం అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాను ఒంటరిని చేస్తాయని, ఆర్థికంగా బలంగా దెబ్బకొడతాయని బైడెన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఏం జరిగినా అందుకు అమెరికా సిద్ధంగా ఉన్నదని ఆయన తేల్చి చెప్పారు.

రష్యా ప్రజలకు సందేశం

ఈ సందర్భంగా రష్యా ప్రజలకు ఆయన నేరుగా ఓ సందేశం పంపించారు. "మీరు మా శత్రువులు కాదు. రక్తపాతం, వినాశనానికి కారణమయ్యే ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని మీరు కోరుకోవడం లేదని నేను విశ్వసిస్తున్నాను" అని బైడెన్‌ అన్నారు. ఇక అమెరికాగానీ, నాటోగానీ రష్యాకు ముప్పు కాదని కూడా ఈ సందర్భంగా బైడెన్‌ స్పష్టం చేశారు. 

"అమెరికా, నాటో.. రష్యాకు ముప్పు కాదు. ఉక్రెయిన్‌ కూడా రష్యాను బెదిరించడం లేదు. అమెరికావిగానీ, నాటోవిగానీ మిస్సైళ్లు ఉక్రెయిన్‌లో లేవు. వాటిని అక్కడ ఉంచాలన్న ఆలోచన కూడా మాకు లేదు. మేము రష్యా ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం లేదు. రష్యాను అస్థిరపరచాలని అనుకోవడం లేదు" అని బైడెన్‌ స్పష్టం చేశారు. ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే అయ్యే ఖర్చు చాలా భారీగా ఉంటుందని అన్నారు. 

రష్యా అనవసర రక్తపాతం, వినాశనాన్ని కోరుకున్నదని ప్రపంచం ఎన్నటికీ మరచిపోదని కూడా ఈ సందర్భంగా బైడెన్‌ తేల్చి చెప్పారు. రష్యాతో అమెరికా వైరాన్ని కోరుకోవడం లేదని అన్నారు. అమెరికా సైనికులు ఉక్రెయిన్‌లో లేరని చెప్పారు. అయితే ఉక్రెయిన్‌లో అమెరికన్లపై రష్యా దాడి చేస్తే మాత్రం తాము దీటుగా స్పందిస్తామని హెచ్చరించారు. అటు ఉక్రెయిన్‌పై సైబర్‌ దాడులకు కూడా దిగొద్దని రష్యాకు సూచించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం