RSS chief comments on population policy: మతపరమైన జనాభా అసమతౌల్యత సీరియస్ విషయమని, ఈ ముఖ్యమైన అంశాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు.
జనాభా విధానం రూపకల్పనపై అప్రమత్తత అవసరమని భాగవత్ వ్యాఖ్యానించారు. అన్ని కోణాలపై సునిశితంగా పరిశీలన, పరిశోధన జరిపి, లోతుగా చర్చించిన తరువాతనే సమగ్రమైన జనాభా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. అన్ని మతాలకు సమానంగా వర్తించేలా, జనాభా విషయంలో సమతౌల్యత సాధించే విధంగా నూతన సమగ్ర జాతీయ విధానం ఉండాలన్నారు.
మతపరమైన జనాభా అసమతౌల్యత చాలా ముఖ్యమైన విషయమని ఆయన హెచ్చరించారు. జనాభా అసమతౌల్యత వల్ల భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు చోటు చేసుకునే ప్రమాదముందన్నారు. నాగపూర్ లోని రేషింబాఘ్ లో జరిగిన ఆరెస్సెస్ దసరా ర్యాలీ నుద్దేశించి ఆయన ప్రసంగించారు. ’జనన రేటులో తేడాతో పాటు, బలవంతపు మత మార్పిళ్లు, చొరబాట్లు కూడా జనాభా అసమతౌల్యతలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు.
ప్రతీ ఒక్కరు మాతృ భాషను నేర్చుకోవాలని, జీవితంలో బాగా సెటిల్ కావాలంటే కచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆలోచన తప్పన్నారు. మాతృ భాషలో సంతకం చేయడం, అవకాశమున్న ప్రతీ చోట మాతృ భాషను ఉపయోగించడం చేయాలని సూచించారు. అలాగే, యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్నారు.