RBI repo rate hike: వడ్డీ రేట్లు 0.5 శాతం పెంపు.. కోవిడ్ పూర్వస్తాయి కంటే అధికం-rbi monetary policy hikes repo rate above pre pandemic levels ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rbi Monetary Policy Hikes Repo Rate Above Pre-pandemic Levels

RBI repo rate hike: వడ్డీ రేట్లు 0.5 శాతం పెంపు.. కోవిడ్ పూర్వస్తాయి కంటే అధికం

HT Telugu Desk HT Telugu
Aug 05, 2022 11:35 AM IST

RBI Monetary Policy: ఆర్థిక నిపుణులు ఊహించిన దానికట్టే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచింది. మే నుంచి రెపో రేటు పెంచడం మూడోసారి. ఇక బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను మరో అర శాతం పెంచనున్నాయి.

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశ నిర్ణయాలను వెల్లడిస్తున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశ నిర్ణయాలను వెల్లడిస్తున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (PTI)

RBI repo rate hike: అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.40 శాతంగా నిర్దేశించాలని రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తాజా పెంపుతో కోవిడ్ పూర్వపు స్థాయి రెపో రేటు 5.15 శాతం కంటే ఎక్కువగా ఉంది.

తొలుత మే నెలలో ఆకస్మిక సమావేశంలో 40 బేసిస్ పాయింట్లు, జూన్ నెల సమావేశంలో 50 పాయింట్లు, తాజాగా మరో 50 పాయింట్ల మేర రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ పెంచింది.

వడ్డీ రేట్లను పెంచడం వల్ల డిమాండ్‌ తగ్గి తద్వారా ద్రవ్యోల్బణం తగ్గడానికి సహాయపడుతుంది. మూడు రోజుల పాటు జరిగే ద్రవ్య విధాన కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది.

ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే ప్రపంచ ధోరణికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు కీలకమైన రెపో రేట్లను 140 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వర్తించే వడ్డీ రేటు. రెపో రేటు పెరగడంతో ఇక కమర్షియల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచేస్తాయి.

జూన్ 2022లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశం నుండి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య విధానం కఠినతరం కావడం, ఐరోపాలో కొనసాగుతున్న యుద్ధం మాంద్యం ప్రమాదాలను పెంచడం వంటి కారణాల వల్ల ప్రపంచ ఆర్థిక వాతావరణం క్షీణించిందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది.

‘జులైలో యూఎస్ డాలర్ ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి ఎగబాకింది. అధునాతన ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థల కరెన్సీ బలహీనపడడం మనం చూశాం..’ అని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.

ముఖ్యంగా భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో వరుసగా ఆరవ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పర్ టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా ఉంది.

జూన్‌లో టోకు (హోల్‌సేల్) ద్రవ్యోల్బణం 15.18 శాతంగా ఉంది. అంతకు ముందు నెలలో నమోదైన 15.88 శాతం కంటే స్వల్పంగా తక్కువ. టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఇప్పుడు వరుసగా 15 నెలలుగా రెండంకెల స్థాయిలో ఉంది.

2022-23లో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 7.2 శాతంతో ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విధాన సమావేశ ఫలితాలను ప్రకటిస్తూ చెప్పారు.

2022-23 మొదటి మూడు త్రైమాసికాల వరకు రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువ టాలరెన్స్ స్థాయి కంటే ఎక్కువగానే ఉంటుందని మానిటరీ పాలసీ కమిటీ పునరుద్ఘాటించింది.

2022-23లో ద్రవ్యోల్బణం అంచనాలు 6.7 శాతంగా ఉన్నాయని దాస్ చెప్పారు.

ఆహార ద్రవ్యోల్బణం కొంత మితంగా నమోదైందని, ముఖ్యంగా వంటనూనెల ధరలను తగ్గించడం, పప్పులు, గుడ్లపై ద్రవ్యోల్బణం తిరోగమనంలో ఉండడం ఇందుకు కారణమని తెలిపారు.

‘ప్రధానంగా ఎల్‌పిజి, కిరోసిన్ ధరల పెరుగుదల కారణంగా జూన్‌లో ఇంధన ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకుంది. ఎక్సైజ్ సుంకాల కోత పూర్తి ప్రత్యక్ష ప్రభావం కారణంగా మే-జూన్‌లో ప్రధాన ద్రవ్యోల్బణం (అంటే ఆహారం, ఇంధనం మినహాయించి) నియంత్రణలోకి వచ్చింది.. ’ అని వివరించారు.

తాజా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంమినిట్స్ ఆగష్టు 19న ప్రచురిస్తారు. కమిటీ తదుపరి సమావేశం సెప్టెంబర్ 28-30 మధ్య షెడ్యూల్ చేస్తారు.

IPL_Entry_Point

టాపిక్