Telugu News  /  National International  /  Rbi Cancels Licence Of Solapur-based Laxmi Co-op Bank
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

RBI cancels licence Laxmi Co-op bank| లక్ష్మి సహకార బ్యాంకు లైసెన్స్ రద్దు

22 September 2022, 22:09 ISTHT Telugu Desk
22 September 2022, 22:09 IST

లక్ష్మి సహకార బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది.

మహారాష్ట్రలోని ప్రముఖ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో లక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంక్ ఒకటి. అయితే, కొన్నాళ్లుగా మేనేజ్ మెంట్ వైఫల్యాల కారణంగా బ్యాంక్ నష్టాల్లో నడుస్తోంది. దాంతో, ఈ బ్యాంకులో డిపాజిట్లు చేసేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. మరోవైపు, తమ డిపాజిట్ల ను వెనక్కు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆర్బీఐ ప్రకటన

ఈ నేపథ్యంలో గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 22 నుంచి లక్ష్మి సహకార బ్యాంక్ లైసెన్స్ మనుగడలో ఉండదని, ఆ లైసెన్స్ ను రద్దు చేస్తున్నామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇకపై ఆ బ్యాంక్ ఎటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు చేయకూడదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేలా కనిపించడం లేదని, అలాగే, బ్యాంక్ వద్ద పెట్టుబడులు కూడా లేవని వివరించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా బ్యాంక్ కార్యకలాపాలు సాగించడం లేదని తెలిపింది. మహారాష్ట్రలోని షోలాపూర్ కేంద్రంగా ఈ బ్యాంక్ కార్యకలాపాలు సాగిస్తోంది.

డిపాజిటర్ల పరిస్థితి

ఇప్పటికే ఈ బ్యాంక్ లోని తమ డిపాజిట్లను వెనక్కు ఇవ్వాలని డిపాజిటర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ. 193.68 కోట్ల మేరకు ఇన్సూర్డ్ డిపాజిట్లను Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC) వెనక్కు ఇచ్చేసింది. మిగతా వారిలో కూడా 99 శాతం మందికి వారి ఇన్సూర్డ్ డిపాజిట్లను తిరిగిచ్చేస్తామని DICGC వెల్లడించింది. అంటే, రూ. 5 లక్షల లోపు ఇన్సూర్డ్ డిపాజిట్లను సాధ్యమైనంత త్వరగా తిరిగి ఇచ్చేస్తామని తెలిపింది. అలాగే, ఆర్బీఐ ఆదేశాల మేరకు కో ఆపరేటివ్ సొసైటీస్ ఒక లిక్విడేటర్ ను త్వరలో నియమిస్తుంది.