AMARNATH YATHRA | అమ‌ర‌నాథ్ యాత్ర స్పెష‌ల్‌.. మ‌రో హెలీకాప్ట‌ర్ రూట్‌-pilgrims can directly fly to amarnath from srinagar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amarnath Yathra | అమ‌ర‌నాథ్ యాత్ర స్పెష‌ల్‌.. మ‌రో హెలీకాప్ట‌ర్ రూట్‌

AMARNATH YATHRA | అమ‌ర‌నాథ్ యాత్ర స్పెష‌ల్‌.. మ‌రో హెలీకాప్ట‌ర్ రూట్‌

HT Telugu Desk HT Telugu
Jun 08, 2022 10:24 PM IST

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు వెళ్లాల‌నుకునే భ‌క్తుల‌కు శుభ‌వార్త‌. హెలీకాప్టర్‌లో అమ‌ర్‌నాథ్ ఆల‌యానికి వెళ్లాల‌నుకునే భ‌క్తులు ఇక‌పై శ్రీన‌గ‌ర్‌ నుంచి కూడా చాప‌ర్ సేవ‌లు పొంద‌వ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు చాప‌ర్ సేవ‌లు రెండు ప్రాంతాల నుంచి మాత్ర‌మే అందుబాటులో ఉండ‌గా ఈ సంవ‌త్స‌రం నుంచి మ‌రో మార్గం కూడా జ‌త అయింది.

అమ‌ర‌నాథ్ ప‌విత్ర శివ‌లింగం
అమ‌ర‌నాథ్ ప‌విత్ర శివ‌లింగం

ప‌విత్ర అమ‌ర్‌నాథ్ యాత్ర ఎంద‌రో భ‌క్తుల‌కు ఒక క‌ల‌. న‌డిచి కానీ, ఇత‌ర మార్గాల ద్వారా కానీ అమ‌ర్‌నాథ్ యాత్ర చేయ‌లేని వారు సాధార‌ణంగా హెలీకాప్ట‌ర్‌లో అమ‌ర్‌నాథ్‌కు ఆరు కిలోమీట‌ర్ల దూరంలోని పంచ‌త‌ర‌ణి వ‌ర‌కు వెళ్ల‌గ‌లుగుతారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మార్గాలు

హెలీకాప్ట‌ర్‌లో అమ‌ర్‌నాథ్‌కు వెళ్లాల‌నుకునే వారు బాల్టాల్ నుంచి కానీ, పహ‌ల్‌గావ్ నుంచి కానీ ఈ సేవ‌లు పొందేవారు. ఈ రెండు కూడా శ్రీన‌గ‌ర్ నుంచి దాదాపు 90 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంటాయి. దేశంలోని వేరే ప్రాంతాల నుంచి శ్రీన‌గ‌ర్ వ‌ర‌కు విమానాల్లో వ‌చ్చేవారు మ‌ళ్లీ బాల్టాల్‌కు కానీ, ప‌హ‌ల్‌గావ్‌కు కానీ వెళ్ల‌డం క‌ష్టంగా ఉండేది. అందువ‌ల్ల‌ ఈ సంవ‌త్స‌రం శ్రీన‌గ‌ర్‌ నుంచి కూడా(శ్రీన‌గ‌ర్ విమానాశ్ర‌యానికి ద‌గ్గ‌ర‌లోని బుద్గాం నుంచి) హెలీకాప్ట‌ర్ సేవ‌లు అందించాల‌ని కేంద్రం ఆదేశించింది. దాంతో ఈ సంవ‌త్స‌రం నుంచి భ‌క్తులు శ్రీన‌గ‌ర్ నుంచి హెలీకాప్ట‌ర్‌లో అమ‌ర్‌నాథ్ ద‌గ్గ‌ర‌లోని పంచ‌త‌ర‌ణి వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు.

ఈ ఏడాది భారీ స్పంద‌న‌

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు ఈ సంవ‌త్స‌రం భారీగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు హెలీకాప్ట‌ర్ సేవ‌ల‌ను వినియోగించుకునే భ‌క్తుల సంఖ్య బాగా పెరిగింది. హెలీకాప్ట‌ర్‌లో ఆల‌యానికి ఆరు కిమీల దూరంలోని పంచ‌త‌ర‌ణి వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు. అక్క‌డి నుంచి కాలిన‌డ‌క‌న కానీ, డోలీలో కానీ వెళ్లి అమ‌ర్‌నాథుడిని ద‌ర్శించుకోవ‌చ్చు. అలాగే, అమ‌ర్‌నాథుడు కొలువై ఉన్న గుహ ద‌గ్గ‌ర‌లో హెలీకాప్ట‌ర్ల‌ను దించ‌డానికి వీల‌వుతుందా? అనే విష‌యాన్ని కూడా `శ్రీ అమ‌ర్‌నాథ్ ఆల‌య బోర్డు` ఈ సంవ‌త్స‌రం ప‌రిశీలించ‌నుంది. ఈ సంవ‌త్స‌రం జూన్ 30 అమ‌ర్‌నాథ్ యాత్ర ప్రారంభ‌మ‌వుతోంది. ఈ యాత్ర 43 రోజుల పాటు సాగుతుంది.

ఉగ్ర‌దాడుల భ‌యం

ఇటీవ‌లి కాలంలో క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు పెరిగిన నేప‌థ్యంలో.. అమ‌ర్‌నాథ్ యాత్ర ల‌క్ష్యంగా కూడా ఉగ్ర‌దాడులు జ‌రిగే ప్ర‌మాద‌ముంద‌ని నిఘా వ‌ర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా జైషే మొహ‌మ్మ‌ద్ ఉగ్ర‌సంస్థ నుంచి పుట్టుకొచ్చిన మ‌రో ఉగ్ర‌వాద సంస్థ `క‌శ్మీర్ ఫైట‌ర్‌` నుంచి అమ‌ర్‌నాథ్ యాత్ర‌పై దాడుల‌కు అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా వేస్తున్నాయి. దాంతో, యాత్ర‌కు పూర్తిస్థాయిలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నారు.

IPL_Entry_Point