నార్త్ కొరియాలో క‌రోనా.. నేష‌న‌ల్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన అధ్యక్షుడు కిమ్-north korea confirms 1st covid outbreak kim orders lockdown ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  నార్త్ కొరియాలో క‌రోనా.. నేష‌న‌ల్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన అధ్యక్షుడు కిమ్

నార్త్ కొరియాలో క‌రోనా.. నేష‌న‌ల్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన అధ్యక్షుడు కిమ్

HT Telugu Desk HT Telugu
May 12, 2022 03:23 PM IST

రెండేళ్లు ప్ర‌పంచాన్ని వ‌ణికించిన మ‌హ‌మ్మారి క‌రోనా.. తాజాగా ఉత్తర కొరియాలో అడుగుపెట్టింది. క‌రోనా కేసులు ప్రారంభ‌మైనట్లు ఉత్త‌ర కొరియా అధికారికంగా ప్ర‌క‌టించింది. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురువారం నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

మాస్క్ ధ‌రించి ఒక స‌మావేశంలో పాల్గొన్న ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్
మాస్క్ ధ‌రించి ఒక స‌మావేశంలో పాల్గొన్న ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ (AP)

ప్ర‌పంచంలోని దాదాపు ప్ర‌తీ మూల‌కు చేరుకున్న క‌రోనా ఉత్త‌ర కొరియాలోనూ విల‌యం సృష్టించింద‌ని, అయితే, ఆ వివరాల‌ను ఆ దేశం ర‌హ‌స్యంగా ఉంచింద‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే, దాదాపు రెండేళ్ల త‌రువాత‌, త‌మ దేశంలోనూ క‌రోనా కేసులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని ఉత్త‌ర కొరియా ప్ర‌క‌టించింది. దాంతో పాటు క‌ఠిన ఆంక్ష‌ల‌ను విధించింది. అయితే, క‌రోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉంద‌నే విష‌యం ఉ. కొరియా వెల్ల‌డించ‌లేదు. కానీ, అధ్య‌క్షుడు కిమ్ కూడా మాస్క్ ధ‌రించి బ‌య‌ట‌కు రావ‌డంతో దేశంలో క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గానే ఉంద‌ని భావిస్తున్నారు.

మెజారిటీ ప్ర‌జ‌లు టీకా తీసుకోలేదు

ఒక‌వేళ‌, కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న ప‌రిస్థితి నెల‌కొంటే, దాన్నిక‌ట్డడి చేయ‌డం ఉత్త‌ర కొరియాకు చాలా క‌ష్ట‌మ‌వుతుంది. ఆ దేశంలో వైద్య స‌దుపాయాలు చాలా త‌క్కువ‌. అక్క‌డి పాల‌కుల‌కు ఆయుధాల పై ఉన్న శ్ర‌ద్ధ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చ‌డంలో లేదు. అంతేకాకుండా, ఆ దేశంలోని 2.6 కోట్ల మంది జ‌నాభాలో మెజారిటీ ప్ర‌జ‌లు వ్యాక్సీన్ తీసుకోలేదు.

ప‌రిస్థితి చేయి దాటిందా?

ఇన్నాళ్లు దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై నోరు మెద‌ప‌ని ఉత్త‌ర కొరియా, ఇప్పుడు అక‌స్మాత్తుగా ఆ విష‌యం ప్ర‌క‌టించ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డ ప‌రిస్థితి చేయి దాటింద‌ని, ప్ర‌పంచ దేశాల సాయం త‌ప్ప‌ని స‌రి కావ‌డంతో ఇప్పుడు ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని ప‌లువురు భావిస్తున్నారు. అయితే, నార్త్ కొరియా వైద్యులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. అక్క‌డ విస్త‌రిస్తుంది ఒమిక్రాన్ వేరియంట్ అని తెలుస్తోంది. అదే నిజ‌మైతే, ఆ వేరియంట్‌ ప్రాణాంత‌క వైర‌స్ కాదు క‌నుక ఉత్త‌ర కొరియా ఊపిరి పీల్చుకోవ‌చ్చు.

దేశ‌వ్యాప్తంగా ఆంక్ష‌లు

క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో అధ్య‌క్షుడు కిమ్ అధికార పార్టీ పాలిట్ బ్యూరొ స‌మావేశం నిర్వ‌హించారు. అన్నిన‌గ‌రాలు, కౌంటీల్లో లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణ‌యించారు. వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అవ‌స‌ర‌మైన ఔష‌ధాల‌ను సిద్ధం చేసుకోవాల‌న‌ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ ఇన్ఫెక్ష‌న్‌ను నియంత్రించాల‌ని కిమ్ ఆదేశించారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని పౌరుల‌ను కోరారు. మ‌రోవైపు, వైద్యం, వ్య‌వ‌సాయం స‌హా ప‌లు అత్య‌వ‌స‌ర విధుల‌ను లాక్‌డౌన్ నుంచి మిన‌హాయించిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మైన కార్యాల‌యాల్లోనూ భౌతిక దూరం పాటించే నిబంధ‌న‌ల‌ను అమ‌లుచేస్తున్నార‌ని స‌మాచారం.

మాస్క్ ధ‌రించిన కిమ్‌

దేశాధ్య‌క్షుడు కిమ్ మాస్క్ ధ‌రించి ఒక స‌మావేశంలో పాల్గొన్న దృశ్యాల‌ను అధికార టీవీ ప్ర‌సారం చేసింది. ఆ స‌మావేశంలో పాల్గొన్న ఇత‌ర అధికారులు కూడా మాస్క్ ధ‌రించి ఉన్నారు. నిజానికి రెండేళ్ల క్రితం తొలిసారి క‌రోనా వ్యాప్తి ప్రారంభ‌మైన నాటి నుంచే ఉత్త‌ర కొరియా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. విమానాశ్ర‌యాల్లో, స‌రిహ‌ద్దుల్లో పూర్తి స్థాయిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తూ వ‌చ్చింది. ఆర్థికంగా న‌ష్ట‌పోకుండా, లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను వైర‌స్ వ్యాప్తికి ఎక్కువ అవ‌కాశ‌మున్న కొన్ని రంగాలకే ప‌రిమితం చేశార‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే, నార్త్ కొరియా నుంచి ఈ విష‌య‌మై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

చైనా నుంచేనా..?

గ‌తంలో, ఐక్య‌రాజ్య స‌మితి పంపిస్తామ‌న్న `కోవాక్స్` టీకాల‌ను తీసుకోవడానికి ఉత్త‌ర కొరియా నిరాక‌రించింది. అవ‌స‌ర‌మైతే వైద్య స‌హాయం అందించ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు ద‌క్షిణ కొరియా కూడా ప్ర‌క‌టించింది. ఇప్పుడు, విదేశాలు, అంత‌ర్జాతీయ సంస్థ‌ల నుంచి పెద్ద సంఖ్య‌లో టీకాలు, ఔష‌ధాలు, ఇత‌ర సాయాన్ని స్వీక‌రించ‌డానికి ఉత్త‌ర కొరియా సిద్దంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని ద‌క్షిణ కొరియాలోని సియోల్ లో ఉన్న యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ కిమ్‌సిన్ గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. అన్ని ర‌కాల ఆధునిక‌ వైద్య స‌దుపాయాలు ఉన్న చైనానే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి తీవ్రంగా కృషి చేస్తోంది. అలాంటిది, వైద్య స‌దుపాయాల విష‌యంలో అట్ట‌డుగున ఉండే నార్త్ కొరియా ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వాణిజ్య లావాదేవీలు ఎక్కువ‌గా ఉండే చైనా నుంచే ఈ వైర‌స్ ఉత్త‌ర కొరియాలోకి వ‌చ్చిందే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

IPL_Entry_Point

టాపిక్