Musk wants Twitter again: ట్విటర్ పిట్ట మీద మళ్లీ మనసు పడ్డ మస్క్-musk says he wants twitter again and will pay 44b price ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Musk Says He Wants Twitter Again And Will Pay $44b Price

Musk wants Twitter again: ట్విటర్ పిట్ట మీద మళ్లీ మనసు పడ్డ మస్క్

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 10:05 AM IST

Musk wants Twitter again: ట్విటర్ కొనుగోలు చేసేందుకు ఇలాన్ మస్క్ మరో ఆఫర్ ఇచ్చారు.

ట్విటర్ కొనుగోలుకు మరో ఆఫర్ చేసిన మస్క్
ట్విటర్ కొనుగోలుకు మరో ఆఫర్ చేసిన మస్క్ (REUTERS)

ట్విటర్ పిట్ట మీద ఇలాన్ మస్క్ మరోసారి మనసు పడ్డారు. టెస్లా సీఈవో మస్క్ ట్విటర్ కంపెనీని కొనుగోలుకు 44 బిలియన్ డాలర్లను చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. మొత్తానికి నెలల తరబడి గందరగోళంగా సాగిన ఈ వ్యవహారానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు.

అయితే ఈసారి మస్క్ ఈ వివరాలను ట్విటర్‌లో వెల్లడించలేదు. ఏదైనా ట్విటర్ ద్వారా వెల్లడించడం ఆయన ప్రత్యేకత. అయితే తాను ట్విటర్‌కు ఒక లేఖ రాశారు. ఆ కంపెనీ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు ఆ లేఖను సమర్పించింది.

ఒప్పందం నుంచి వైదొలగడంపై ఇరు పక్షాల మధ్య డెలావర్‌లో విచారణ ప్రారంభానికి రెండు వారాల ముందే ఈ పరిణామం చోటు చేసుకుంది. మస్క్ లేఖకు స్పందనగా ట్విటర్ ఈ లావాదేవీని షేరుకు 54.20 డాలర్ల చొప్పున క్లోజ్ చేయాలని యోచిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇలాన్ మస్క్‌పై దాఖలు చేసిన లా సూట్ ఉపసంహరించుకోవడంపై స్పష్టత ఇవ్వలేదు. ఇరుపక్షాల మధ్య పరస్పర నమ్మకం లేకపోవడాన్ని ఇది సూచిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

‘మస్క్ మాటలను నమ్మి ట్విటర్ తన పిటిషన్ ఉపసంహరించుకుంటుందని అనుకోను. డీల్ క్లోజింగ్‌పై మరింత స్పష్టత రావాల్సి ఉంటుంది..’ అని బ్రూక్లిన్ లా స్కూల్ ప్రొఫెసర్ ఆండ్రూ జెన్నింగ్స్ అభిప్రాయపడ్డారు. ఇలాన్ మస్క్ ప్రతిపాదన విచారణలో జాప్యం జరిగేందుకు చేసిన ప్రయత్నంగా ట్విటర్ భావించవచ్చని కూడా అభిప్రాయపడ్డారు. ట్రయల్‌ను పోస్ట్‌పోన్ చేసేందుకు మస్క్ రెండుసార్లు విఫలయత్నం చేశారు.

తాజా పరిణామాల కారణంగా మంగళవారం ట్విటర్ షేరు ధర 22 శాతం పెరిగి 52 డాలర్లకు చేరుకుంది.

ట్విటర్‌లో ఫేక్ ఖాతాల సంఖ్యలో కచ్చితత్వం లేదంటూ ఇలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు ఒప్పందం అమలు చేయడాన్ని నిలిపివేశారు. స్పామ్ బాట్ ఖాతాల వల్ల అడ్వర్టయిజర్లకు ఎలాంటి ఉపయోగం లేదని ట్విటర్ వాదిస్తూ వచ్చారు.

IPL_Entry_Point

టాపిక్