'భార్యలను కొట్టండి'.. భర్తలకు ఓ మహిళా డిప్యూటీ మంత్రి సలహా!
భార్యలను కొట్టండి అంటూ ఓ మహిళా మంత్రి బంపర్ సలహా ఇచ్చింది. దీంతో అక్కడుండే పెళ్లైన మగాళ్లు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఆడవాళ్లు మాత్రం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త చదవండి..
భార్యలను కొట్టండి అంటూ ఓ మహిళా మంత్రి బంపర్ సలహా ఇచ్చింది. దీంతో అక్కడుండే పెళ్లైన మగాళ్లు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఆడవాళ్లు మాత్రం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
నిజానికి చట్టాలకెవరూ చుట్టాలు కాదంటారు.. కానీ పెళ్లైన స్త్రీలు వారి భర్తలపై గృహ హింస కేసు పెడితే భర్తలు అడ్డంగా బుక్కవుతారు. మరోవైపు, భర్తలు వారి భార్యలపై అదే రకమైన కేసు పెడితే మాత్రం పెద్దగా ప్రభావం ఉండదు. ఆఖరుకు భార్యలచే హింసకు గురయ్యే భర్తలంతా కలిసి భార్యాబాధితుల సంఘంలో చేరినా ఈ సమాజం వారి బాధలను కామెడీ అనుకుని నవ్వుతుందే తప్ప అయ్యో అని ఎవరూ అనరు. ఇలాంటి సమాజంలో ఓ సాటి మనిషి.. అందులోనూ ఓ మహిళా మంత్రి ‘భర్తలూ.. కుమ్మేయండి మీ భార్యలని’ అని సలహా ఇస్తే భార్యాబాధితులకు అంతకంటే బంగారు మాట మరొకటి ఉంటుందా? ఇంతకీ ఇది ఎక్కడా అనుకుంటున్నారా? మనదేశంలో కాదులెండి..
అసలు వివరాల్లోకి వెళ్తే, మలేషియా దేశంలో మహిళా సంక్షేమ శాఖ ఉప మంత్రి అయిన సిటి జైలా మొహమ్మద్ యూసోఫ్ మాట్లాడుతూ.. సమాజంలో మొండిగా ప్రవర్తించే భార్యలను వారి భర్తలు ఒక దెబ్బ కొట్టైనా దారిలోకి తేవాలని సలహా ఇచ్చింది. ఆమె తన ఇన్ట్సాగ్రాంలో 'మదర్ టిప్స్' పేరుతో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె భార్యలను క్రమశిక్షణలో ఎలా ఉంచాలో చెప్పింది. 'భార్యలు మొండిగా ప్రవర్తిస్తే భర్తలు చెప్పిచూడాలి, మాట వినకపోతే ఒక మూడు రోజులు మీ భార్యలకు దూరంగా పడుకోండి. అప్పటికీ వినకపోతే సున్నితంగా మందలించండి, కొట్టండి.. కఠినంగా వ్యవహరించండి.. అప్పుడే ఆమెకు అర్థమవుతోంది' అని మంత్రి చెప్పింది.
అంతే... ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఒక మహిళ అయుండి.. అందులోనూ మహిళా సంక్షేమ మంత్రి అయుండి ఇదేనా మీరిచ్చే సలహా అంటూ ఆమెపై విమర్శలు మొదలయ్యాయి. ప్రపంచంలో ఎవరూ.. ఎవరినీ కొట్టే అర్హత లేదు, ముఖ్యంగా మహిళలను, చిన్నపిల్లలను, ఇతర మూగజీవాలను కొట్టే అర్హత లేదు.. అంటూ ఆమెకు సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. అంతేకాకుండా మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు మొత్తం మలేసియన్ మహిళా జాతికే అవమానం.. ఆమె మహిళా సంక్షేమ మంత్రిగా కొనసాగే అర్హత లేదు, వెంటనే రాజీనామా చేయాలంటూ అంటూ డిమాండ్లు వ్యక్తం అయ్యాయి.
దీంతో.. తాను లింగ సమానత్వం గురించి చెప్పే ప్రయత్నం చేస్తే తన మాటలను వక్రీకరిస్తున్నారు అంటూ ఆ మంత్రి ఇప్పుడు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం ఆమె మంత్రి పదవికి ఎసరు పెట్టింది.