Maharashtra political crisis : రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట.. రిప్లైకి 12 వరకు గడువు-maharashtra political crisis supreme court hearing live updates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Political Crisis : రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట.. రిప్లైకి 12 వరకు గడువు

Maharashtra political crisis : రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట.. రిప్లైకి 12 వరకు గడువు

HT Telugu Desk HT Telugu
Jun 27, 2022 03:08 PM IST

Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయ వివాదంపై దాఖలైన పిటిషన్లు సుప్రీం కోర్టులో మధ్యాహ్నం 1.30 సమయంలో విచారణకు వచ్చాయి. రెండు గంటల పాటు వాదనల అనంతరం ధర్మాసనం డిప్యూటీ స్పీకర్‌కు, కేంద్రానికి, శివసేన లెజిస్లేచర్ పార్టీకి నోటీసులు జారీచేసింది. 5 రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. డిప్యూటీ స్పీకర్ జారీచేసిన అనర్హత నోటీసులపై ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చేందుకు జూలై 12 వరకు గడువు ఇచ్చింది. అంటే అప్పటివరకు అనర్హత వేటు లేకుండా ఏక్‌నాథ్ షిండే ఊపిరి పీల్చుకున్నట్టయింది.

సుప్రీం కోర్టు ముందు మీడియా కెమెరాలు (ఫైల్ ఫోటో)
సుప్రీం కోర్టు ముందు మీడియా కెమెరాలు (ఫైల్ ఫోటో) (PTI)

Maharashtra political crisis : మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమకు అనర్హత నోటీసులు ఇవ్వడం, శివసేన శాసనసభా పక్ష నేతగా చౌదరిని ఎన్నుకోవడం తదితర అంశాలను సవాలు చేస్తూ శివసేన తిరుగుబాటు నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. సోమవారం మధ్యాహ్నం ఈ పిటిషన్లు వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చాయి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్థీవాలాతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది.

పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించారు. డిప్యూటీ స్పీకర్‌ను తొలగించాలన్న తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు ఆయన డిస్‌క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ చేపట్టలేరని వాదించారు. నబం రేబియా కేసులో సుప్రీం కోర్టు తీర్పును ఈ సమయంలో ఆయన ప్రస్తావించారు.

ఈ సమయంలో జస్టిస్ సూర్య కాంత్ కల్పించుకుని మీరు హైకోర్టును ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. దీనికి నీరజ్ కిషన్ కౌల్ సమాధానం ఇస్తూ ఆర్టికల్ 32ను అమలు చేసేందుకు ఆర్టికల్ 226 అడ్డురాదని, అలాగే సభాపరీక్ష, అనర్హతలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆర్టికల్ 32 ప్రకారం అనుమతించారని పేర్కొన్నారు.

సంఖ్యాపరంగా మైనారిటీలో ఉన్న పార్టీ రాష్ట్ర యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తోందని, తమ ఇళ్లపై దాడులకు పాల్పడుతోందని, మా శవాలు వస్తాయని వ్యాఖ్యలు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ముంబైలో తమ హక్కులకు రక్షణ లేని వాతావరణం నెలకొందని నివేదించారు.

తన పదవి ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు ఉపసభాపతి ఏవిధంగా ప్రొసీడింగ్స్ జారీ చేస్తారని నివేదించారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా.. అత్యంత తొందరగా ఆయన అనర్హత వేటుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అనుసరించారని నివేదించారు.

ఈ సందర్భంలో జస్టిస్ కాంత్ జోక్యం చేసుకుంటూ ‘ఉప సభాపతికి అర్హత లేదని మీరు భావించినప్పుడు.. ఇదే ప్రశ్నను డిప్యూటీ స్పీకర్ ముందు మీరు ఎందుకు లేవనెత్తరు?’ అని ప్రశ్నించారు.

అయితే తాము డిప్యూటీ స్పీకర్‌కు ఈ విషయం నివేదించామని, సుప్రీం కోర్టు దీనిపై ఇదివరకే స్పష్టత ఇచ్చిందని కౌల్ ధర్మాసనానికి నివేదించారు.

ఈ సమయంలో ధర్మాసనం రెండు నిమిషాల పాటు విరామం తీసుకుంది. న్యాయమూర్తులు తిరిగి రాగానే వాదనలు ప్రారంభమయ్యాయి. నబం రెబియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయవాది ప్రస్తావించారు.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేవని, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ముందుగా కేబినెట్ కోరినప్పుడు అసెంబ్లీ సమావేశం అవుతుందని, అవేవీ లేకుండా డిప్యూటీ స్పీకర్ నోటీసులు ఇచ్చారని కౌల్ నివేదించారు.

సభాపతిని తొలగించాలన్న నోటీసుపై ముందుగా చర్చ జరగాలని నివేదించారు.

ఈ సందర్భంలో ధర్మాసనం ప్రతివాదుల అభిప్రాయం ఏంటని ప్రశ్నించగా సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి లేచారు. ఆయన శివసేన లెజిస్లేచర్ పార్టీ నేత, శివసేన చీఫ్ విప్‌ తరపున వాదనలు వినిపించారు.

పిటిషనర్లు హైకోర్టును సంప్రదించకుండా సుప్రీం కోర్టును అప్రోచ్ అయ్యారని సింఘ్వీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘ఈ పిటిషన్లను సుప్రీం కోర్టు హైకోర్టుకు పంపించకూడదనడానికి ఒక్క కారణం కూడా పిటిషనర్ల తరపు న్యాయవాది నివేదించలేదు..’ అని విన్నవించారు.

స్పీకర్ వద్ద ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉన్నప్పుడు ఏ కోర్టు కూడా జోక్యం చేసుకోలేదని సింఘ్వీ విన్నవించారు.

కిహొటో కేసులో సుప్రీం కోర్టు తీర్పులోని పేరాలు 109, 110 ని ఉదాహరిస్తూ స్పీకర్ వద్ద నిర్ణయం పెండింగ్‌లో ఉన్నప్పుడు ఏ కోర్టూ చర్య తీసుకోలేదని నివేదించారు.

స్పీకర్ తుది నిర్ణయం తీసుకునేందుకు మాత్రమే కోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇవ్వగలదని విన్నవించారు.

ఈ సమయంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ ఆర్టికల్ 179(సీ) పరిధిలో స్పీకర్ తొలగింపు పెండింగ్‌లో ఉండగా, పదో షెడ్యూలు(ఫిరాయింపులు) పై నిర్ణయం తీసుకోగలరా? ఈ అంశం ఏ కేసులోనైనా పరిగణనలోకి వచ్చిందా?’ అని ప్రశ్నించారు.

దీనికి సమాధానం ఇస్తూ లెజిస్లేటివ్ ప్రొసీజర్‌లో జోక్యం చేసుకోవడాన్ని ఆర్టికల్ 212 అనుమతించడం లేదని విన్నవించారు.

అయితే దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ మన ముందున్న అంశాలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌కు సంబంధించినవేనా? అని ప్రశ్నించారు.

దీనికి సింఘ్వీ బదులిస్తూ ధర్మాసనం నోటీసు ఇవ్వని ప్రశ్నలను విచారిస్తోందని, వీటికి 2 రోజుల నోటీసు కూడా సరిపోదని అన్నారు.

కిహోటో హోలోహాన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా 109ని సింఘ్వీ ప్రస్తావిస్తూ స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నా కూడా సుప్రీం కోర్టు స్క్రుటినీ పరిధి పరిమితమైందని గుర్తు చేశారు.

అయితే జస్టిస్ కాంత్ జోక్యం చేసుకుంటూ కిహోటో కేసులో స్పీకర్ అధికారాన్ని సవాలు చేయలేదని, ప్రస్తుతం స్పీకర్ కొనసాగింపు సవాలులో ఉందని పేర్కొన్నారు.

అలాగే స్పీకర్‌ను తొలగించాలని నోటీసు వస్తే సదరు స్పీకరే దానిపై నిర్ణయం తీసుకుంటారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

డిప్యూటీ స్పీకర్‌కు ఒక ధ్రువీకరించని మెయిల్ నుంచి లెటర్ వచ్చిందని, దానిని తిరస్కరించారని సింఘ్వీ నివేదించారు. ఆ లేఖను సభాపతి 14 రోజుల్లోగా సభా సమక్షంలో ఉంచాలని, అయితే ఆ నోటీసు ధ్రువీకరణకు నోచుకోనందున సభాపతి దానిని తిరస్కరించారని సభాపతి తరపున సీనియర్ న్యాయవాది ధవన్ వాదనలు వినిపించారు.

రిజిస్టర్డ్ మెయిల్ నుంచి గానీ, లెజిస్లేటివ్ ఆఫీస్ నుంచి గానీ ఆ మెయిల్ రాలేదని, డిప్యూటీ స్పీకర్ జ్యుడీషియల్ కెపాసిటీలో పనిచేస్తారని గుర్తు చేశారు.

అయితే స్పీకర్ ఆయా సభ్యులను ప్రశ్నించారా ? అని ధర్మాసనం ప్రశ్నించగా దానిపై అఫిడవిట్ దాఖలు చేస్తామని ధవన్ సమాధానం ఇచ్చారు.

నోటీసులు జారీ చేసిన ధర్మాసనం

చివరకు ధర్మాసనం ఏక్‌నాథ్ షిండే పిటిషన్‌పై సమాధానం చెప్పాలంటూ డిప్యూటీ స్పీకర్‌కు, శివసేన లెజిస్లేచర్ పార్టీకి, కేంద్రానికి నోటీసులు జారీచేసింది.

5 రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తదుపరి మూడు రోజుల్లో కౌంటర్ అఫిడవిట్లకు ప్రతిస్పందన తెలుపొచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. జూలై 11కు విచారణ వాయిదా వేసింది.

అప్పటి వరకు డిస్‌క్వాలిఫికేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోరని ధవన్ డిప్యూటీ స్పీకర్ తరపున చెప్పారు. అయితే స్పీకర్ తరపున కోర్టులు స్టేట్‌మెంట్ రికార్డు చేయబోవని, జుడిషియరీ, లెజిస్లేచర్ మధ్య ఉన్న అధికార రేఖను అది ఉల్లంఘించినట్టవుతుందని సింఘ్వీ వ్యాఖ్యానించారు.

అనంతరం జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంలో స్పందిస్తూ పిటిషన్ ఇన్‌ఫ్రక్చువస్‌గా మిగిలిపోరాదని కోరుకుంటున్నామని, స్టేటస్ కో ఉండాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.

అఫిడవిట్లు ఫైల్ అయ్యాక అన్ని అంశాలపై నిర్దేశిస్తామని పేర్కొన్నారు.

జూలై 11కు విచారణ వాయిదా వేస్తున్నామని, అయితే ఈలోపు మధ్యంతర చర్యగా డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేల (తిరుగుబాటు)కు నేటి సాయంత్రం వరకు ఇచ్చిన గడువును జూలై 12 వరకు పొడిగిస్తున్నట్టు జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.

పిటిషనర్లు, ఇతర ఎమ్మెల్యేలకు ఈ రిట్ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలతో సంబంధం లేకుండా వారు స్వేచ్ఛగా తమ జవాబు సమర్పించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

ఆ 39 మంది ఎమ్మెల్యేలకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

IPL_Entry_Point