Maha political crisis : రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్‌ షిండే సమాలోచనలు-maha political crisis shinde calls meeting of rebel mlas to discuss further strategy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maha Political Crisis : రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్‌ షిండే సమాలోచనలు

Maha political crisis : రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్‌ షిండే సమాలోచనలు

HT Telugu Desk HT Telugu
Jun 25, 2022 12:41 PM IST

భవిష్యత్‌ కార్యాచరణ కోసం శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. గువహటిలోని ర్యాడిసన్‌ బ్లూ హోటల్లో బస చేసిన ఎమ్మెల్యేలతో సమావేశంలో భవిష్యత్‌ వ్యూహాలను ఖరారు చేయనున్నారు. అటు ఉద్ధవ్‌ థాక్రే కూడా తన వర్గంతో సమావేశమయ్యారు.

గువహటిలో రెబల్‌ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు నాయకుడు షిండే
గువహటిలో రెబల్‌ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు నాయకుడు షిండే (PTI)

శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే తన మద్దతుదారులతో సమాలోచనలు జరుపుతున్నారు. గువహటిలో మకాం వేసిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే భవిష్యత్ కార్యాచరణ కోసం కసరత్తు చేస్తున్నారు. ర్యాడిసన్‌ బ్లూ హోటల్లో జరిగే భేటీలో శనివారం మధ్యాహ్నం తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ భవిష్యత్‌ ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

మహారాష్ట్రలోని మహావికాస్‌ అఘాడి కూటమిలో చీలిక రావడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలో శివసేన ఎమ్మెల్యేలు అస్సోంలో మకాం వేశారు. అస్సోం నుంచి మహారాష్ట్ర రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించాలని ఏక్‌నాథ్‌ వర్గం భావిస్తోంది. శనివారం చర్చలలో భవిష్యత్‌ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

మహారాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యే జూన్‌ 22 నుంచి అస్సోంలోని ర్యాడిసన్‌ బ్లూ హోటల్లో బస చేశారు. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే‌తో పాటు 38మంది శివసేన, స్వతంత్ర ఎమ్మెల్యేలు అసోంలో మకాం వేశారు.

మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే తన అనుచరులతో శనివారం సమావేశం కానున్నారు. పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నారు. శివసేన భవన్‌లో జరిగే సమావేశానికి థాక్రే వర్చువల్ పద్ధతిలో హాజరు కానున్నారు. శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన ఉద్దవ్‌, అస్సోం వెళ్లిన ఎమ్మెల్యేలు పార్టీని ముక్కలు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.

“నాకు అధికారంతో సంబంధం లేదని నేను ఇంతకుముందు కూడా చెప్పానని" శివసేనను విడిచిపెట్టడం కంటే చనిపోవడమే మేలని చెప్పిన వారు ఈ రోజు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఏక్‌నాథ్‌ షిండే వైఖరిని తాను ముందే అనుమానించానని, బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల ముందు ఈ అంశాన్ని లేవనెత్తారని చెప్పారు. అయితే తిరుగుబాటు ఆరోపణల్ని ఏక్‌నాథ్‌ తోసిపుచ్చారని చెప్పారు.

తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు పార్టీని విచ్ఛిన్నం చేయాలి అనుకుంటున్నారని, ముఖ్యమంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదని థాక్రే చెప్పారు. పార్టీని నడపడానికి పనికిరాని, అసమర్థుడిని అయితే చెప్పాలని, పార్టీ కోరితే తాను పార్టీ నుంచి నిష్క్రమిస్తానన్నారు. ఏక్‌నాథ్‌ షిండేపై పలు ఆరోపణలు ఉన్నాయని కోరుకున్న శాఖను అతనికి ఇచ్చానని ఉద్దవ్ చెప్పారు. షిండే కొడుకు ఎంపీగా ఉన్నా, తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

IPL_Entry_Point

టాపిక్