Maharashtra politics | ముంబై చేరుకున్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శనివారం గోవా నుంచి ముంబై చేరుకున్నారు. శివసేనలోని అన్ని పదవుల నుంచి షిండేను పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తొలగించిన రోజే తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి షిండే ముంబై చేరుకోవడం విశేషం.
బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన షిండే ముందు ముఖ్యమైన రెండు బాధ్యతలున్నాయి. ఒకటి ఆదివారం జరిగే స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్థి రాహుల్ నవ్రేకర్‌ను గెలిపించుకోవడం కాగా, రెండవది తమ వర్గమే నిజమైన శివసేన అని నిరూపించుకోవడం. షిండే నాయకత్వంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు మొదట గుజరాత్‌లోని సూరత్‌లో, అక్కడి నుంచి అస్సాంలోని గువాహటిలో, ఆ తరువాత గోవాలో మకాం వేసిన విషయం తెలిసిందే. శనివారం గోవా నుంచి వారంతా ముంబై చేరుకున్నారు.
జులై 3, 4 తేదీల్లో అసెంబ్లీ
జులై 3, 4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. జులై 3న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. మహా వికాస్ అఘాడీ తరఫున స్పీకర్ పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నవ్రేకర్‌తో శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వి పోటీ పడుతున్నారు. జులై 4 వ తేదీన ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొంటారు. శివసేన నుంచి తనకు మద్దతిస్తున్న తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు, బీజేపీకి ఉన్న 106 మంది ఎమ్మెల్యేలతో కలిపి స్పష్టమైన మెజారిటీ షిండేకు ఉంది. అయితే, ఈ బలపరీక్షను ఉద్ధవ్ వర్గం అసెంబ్లీలో అడ్డుకునే అవకాశం ఉంది.
అప్పుడే ఒప్పుకుని ఉంటే..
ఈ నేపథ్యంలో శివసేనలోని అన్ని పదవుల నుంచి ఏక్‌నాథ్ షిండేను ఉద్ధవ్ ఠాక్రే తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ పార్టీ అధ్యక్ష హోదాలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉద్ధవ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో చేసుకున్న ఒప్పందాన్నిబీజేపీ గౌరవించి ఉంటే ఇప్పుడు సీఎంగా బీజేపీ వ్యక్తే ఉండేవాడని వ్యాఖ్యానించారు. ``2019 ఎన్నికల పొత్తు ఒప్పందం ప్రకారం మొదటి రెండున్నరేళ్లు శివసేన, తరువాత రెండున్నరేళ్లు బీజేపీ సీఎం పదవి చేపట్టాలి. కానీ ఆ ఒప్పందాన్ని అమిత్ షా గౌరవించలేదు. ఒకవేళ ఆయన ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే.. మహా వికాస్ అఘాడీ అనేదే ఉండేది కాదు. రెండున్నరేళ్లు గడిచాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ సీఎం ఉండేవాడు`` అని ఉద్ధవ్ వివరించారు.