Mulayam Singh Yadav: ములాయం సింగ్.. అభిమానులకు నేతాజీ..-in success or failure mulayam singh yadav always netaji to his supporters ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  In Success Or Failure Mulayam Singh Yadav Always Netaji To His Supporters

Mulayam Singh Yadav: ములాయం సింగ్.. అభిమానులకు నేతాజీ..

HT Telugu Desk HT Telugu
Oct 10, 2022 11:08 AM IST

Mulayam Singh Yadav: గెలుపులోనైనా, ఓటమిలోనైనా ములాయం సింగ్ యాదవ్ తన మద్దతుదారులకు ఎల్లప్పుడూ నేతాజీయే.

గత ఏడాది ములాయంను సత్కరిస్తున్న కుమారుడు అఖిలేష్ యాదవ్
గత ఏడాది ములాయంను సత్కరిస్తున్న కుమారుడు అఖిలేష్ యాదవ్ (PTI)

లక్నో, అక్టోబర్ 10: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ తన యుక్తవయస్సులో రెజ్లర్‌గా శిక్షణ పొందారు. అయితే తన చివరి బౌట్‌లో ఓడిపోయారు. తన 83వ పుట్టినరోజుకు ఆరు వారాల దూరంలో గురుగ్రామ్ ఆసుపత్రిలో మరణించారు.

నవంబర్ 22, 1939 న ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలోని సైఫాయ్‌లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన యాదవ్.. రాష్ట్రంలోని అత్యంత ప్రముఖ రాజకీయ నేతగా ఎదిగారు.

అతను 10 సార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఎక్కువగా మెయిన్‌పురి, అజంగఢ్ నుండి ఎన్నికయ్యారు. అతను రక్షణ మంత్రి (1996-98)గా, మూడుసార్లు (1989-91, 1993-95, 2003-07) ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన ఎంపీగా ఉన్నారు. ప్రధాన మంత్రి పదవికి కూడా అతడి పేరు వినిపించింది.

దశాబ్దాలుగా అతను జాతీయ నాయకుడి స్థాయిని అనుభవించారు. యూపీలో సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియాచే ప్రభావితమైన యువకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ ఆయనను నేతాజీగా గౌరవిస్తారు. అతను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా లేనప్పుడు కూడా కార్యకర్తలు అభిమానంతో నేతాజీ అని పిలుచుకునేవారు. యాదవులంతా ఒక్కతాటిపై నడిచేందుకు ములాయం సింగ్ యాదవ్ ప్రేరణగా నిలిచారు. కాగా 2017లో తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు పార్టీ అధ్యక్ష పీఠం దక్కింది.

సోషలిస్ట్ అయిన యాదవ్ రాజకీయాల్లో అనేక అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. లోహియా యొక్క సంయుక్త్ సోషలిస్ట్ పార్టీ, చరణ్ సింగ్ యొక్క భారతీయ క్రాంతి దళ్, భారతీయ లోక్ దళ్, సమాజ్ వాదీ జనతా పార్టీ ఇలా అనేక పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నారు. చివరకు 1992లో సొంతంగా సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు.

ఉత్తరప్రదేశ్‌లో తన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లేదా రక్షించడానికి అవసరమైనప్పుడల్లా యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లతో పొత్తు పెట్టుకున్నారు.

2019లో ములాయం సింగ్ యాదవ్ పార్లమెంటులో నరేంద్ర మోడీని ప్రశంసించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే ఎన్నికల తర్వాత మోడీ తిరిగి ప్రధానమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ఒకవైపు యూపీలో తన ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా.. ఎస్పీ నేత ఈ వ్యాఖ్య చేయడం విశ్లేషకులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

రేపిస్టులకు మరణశిక్షను వ్యతిరేకిస్తూ "అబ్బాయిలు తప్పులు చేస్తారు" అని 2014లో ఒక ర్యాలీలో మాట్లాడినప్పుడు ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సమాఖ్యను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ఆయన సమర్థించారు.

విద్యార్థి సంఘాల ఆందోళనల్లో పాల్గొని పొలిటికల్ సైన్స్ పట్టా పొందిన తర్వాత ఇంటర్ కాలేజీలో కొంతకాలం బోధించిన యాదవ్ 1967లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

జస్వంత్‌నగర్‌లోని సోషలిస్ట్ పార్టీ ఎమ్మెల్యే నాథూ సింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. కుస్తీ పోటీలో కలిసినప్పుడు ములాయంతో నాథూసింగ్ ముచ్చటించారు.

అదే నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు. యాదవ్‌ను అనేక మంది ప్రతిపక్ష నాయకుల మాదిరిగానే జైలుకు పంపారు.

1975-77 ఎమర్జెన్సీ తర్వాత మళ్లీ బరిలోకి దిగిన యాదవ్ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. పార్టీ చీలిపోయినప్పుడు అతను రాష్ట్ర యూనిట్‌లోని ఒక వర్గానికి నాయకత్వం వహించారు.

యాదవ్ 1989లో ముఖ్యమంత్రి కావడానికి ముందు యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తరువాత బీజేపీ అతడి జనతాదళ్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునిచ్చింది.

1990లో బాబ్రీ మసీదు-రామజన్మభూమి అంశం కారణంగా బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు, కాంగ్రెస్ ఆయన ప్రభుత్వాన్ని కొన్ని నెలలపాటు నిలబెట్టింది.

1990 నాటి అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేయాలని కోరుకున్న కరసేవకులపై పోలీసులు కాల్పులు జరిపిన ఎపిసోడ్‌ను బీజేపీ తరచుగా ప్రస్తావిస్తుంది.

16వ శతాబ్దపు ఆ మసీదును డిసెంబర్ 1992లో కరసేవకులు ధ్వంసం చేశారు. అదే సంవత్సరం యాదవ్ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. దీనిని ముస్లిం కమ్యూనిటీకి మిత్రపక్షంగా చూడడం ప్రారంభించారు. నవంబర్ 1993లో యాదవ్ మళ్లీ యూపీలో బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. అయితే కొద్దికాలానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది.

1996లో మెయిన్‌పురి నుంచి లోక్‌సభకు ఎన్నికై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టిపెట్టారు.

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీయేతర పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించిన దశలో యాదవ్ ప్రధాని పదవి కోసం పోటీలో ఉన్నట్లు కనిపించింది. చివరకు హెచ్.డి.దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా చేరారు. రష్యాతో సుఖోయ్ ఫైటర్ జెట్ ఒప్పందం అతని పదవీకాలంలో ఖరారైంది.

బీఎస్పీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పతనం తర్వాత యాదవ్ 2003లో మూడవసారి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు.

2012లో ఎస్పీ మళ్లీ యూపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. కానీ సీనియర్ యాదవ్ పక్కకు తప్పుకున్నారు. తద్వారా అతని కుమారుడు అఖిలేష్ 38 ఏళ్ల వయస్సులో రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన సీఎం అయ్యారు.

కానీ పార్టీలో, కుటుంబంలో గొడవలు 2017లో అఖిలేష్ యాదవ్‌ తిరుగుబాటు చేయడానికి కారణమయ్యాయి. అఖిలేష్ ములాయం మొదటి భార్య మాలతీ దేవి కుమారుడు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా, పార్టీ నేతగా కూడా ప్రజాదరణ పొందారు.

IPL_Entry_Point