Union Budget 2022-23: ఇన్‌కమ్ టాక్స్ శ్లాబుల్లో మార్పులు ఉండబోతున్నాయా?-expectations on changes in income tax slabs and rates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Union Budget 2022-23: ఇన్‌కమ్ టాక్స్ శ్లాబుల్లో మార్పులు ఉండబోతున్నాయా?

Union Budget 2022-23: ఇన్‌కమ్ టాక్స్ శ్లాబుల్లో మార్పులు ఉండబోతున్నాయా?

HT Telugu Desk HT Telugu
Jan 30, 2022 01:08 PM IST

ప్రతి ఏటా యూనియన్ బడ్జెట్ అనగానే వేతన జీవులను ఊరించేది ఇన్‌కమ్ టాక్స్ శ్లాబుల్లో మార్పులు. ప్రతి ఏటా ఈ శ్లాబులపై సమీక్ష జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న శ్లాబులు 2014 నుంచి ఉన్నవే. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు ఈసారి ఏమైనా ఊరట కలిగించనున్నారా?

భారత పార్లమెంటు
భారత పార్లమెంటు (ANI)

న్యూఢిల్లీ: ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపుల్లో బేసిక్ మినహాయింపు 2014 నుంచి మారనేలేదు. 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బేసిక్ మినహాయింపును రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్లయితే ఈ మినహాయింపు రూ. 3 లక్షలుగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో వేతన జీవులకు కాస్త ఊరట కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

ప్రధానంగా బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్‌ను రూ. 2.5 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంచే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్లకు రూ. 3.5 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. బేసిక్ ఎగ్జెంప్షన్ అంటే.. ఈ మొత్తం ఆదాయానికి ఎలాంటి పన్నూ ఉండదు. అలాగే పన్ను శ్లాబుల్లో గరిష్ట ఆదాయంగా ఉన్న శ్లాబును కూడా సమీక్షించే అవకాశం ఉంది.

ప్రి-బడ్జెట్ సర్వే నిర్వహించిన కేపీఎంజీ సంస్థ ప్రకారం సర్వేలో 64 శాతం మంది బేసిక్ ఎగ్జెంప్షన్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు బేసిక్ టాక్స్ ఎగ్జెంప్షన్‌ను రూ. 2.5 లక్షల నుంచి పెంచాలని ప్రి బడ్జెట్ సర్వేలో కోరుకున్నారు. అలాగే గరిష్ట శ్లాబును పెంచాలని కోరుకున్నారు..’ అని కేపీఎంజీ ఇండియా సంస్థ పన్ను విభాగం నేషనల్ హెడ్ రాజీవ్ దిమ్రీ పేర్కొన్నారు.

నిర్మలాసీతారామన్ పన్ను శ్లాబుల్లో మార్పులు తేలేదు కానీ 2020 బడ్జెట్‌లో కొత్త తరహా పన్ను విధానాన్ని తెచ్చారు. పన్ను మినహాయింపులు చూపలేని వారికి ఈ కొత్త తరహా విధానం ఎంచుకునేలా ప్రవేశపెట్టారు. ఇది కేవలం ఆప్షన్ మాత్రమే. పన్ను చెల్లింపుదారులు రెండింటిలో ఒకటి ఎంచుకోవచ్చు.

ప్రస్తుత పన్ను శ్లాబులు ఇలా..

ప్రస్తుతం రూ. 2.5 లక్షల వరకు పన్ను ఏమీ లేదు. రెండు విధానాల్లోనూ బేసిక్ ఎగ్జెంప్షన్ ఒకే రీతిలో ఉంటుంది. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుంది. అయితే పాత విధానంలో రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల మధ్య పన్ను 20 శాతంగా ఉంటుంది. కొత్త విధానంలో ఇది 10 శాతమే. ఇక రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య పాత విధానంలో 20 శాతం పన్ను ఉండగా, కొత్త విధానంలో అది 15 శాతంగా ఉంటుంది.

పాత విధానంలో రూ. 10 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో పది లక్షలకు పైబడి మూడు శ్లాబులు ఉన్నాయి. రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల మధ్య 20 శాతం, 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య 25 శాతం, రూ. 15 లక్షలకు పైబడితే 30 శాతం పన్ను కోత ఉంటుంది.

సెస్, ఛార్జీలతో తడిసిమోపెడు..

సెస్, సర్ ఛార్జీలతో పన్ను మరింత భారమవుతుంది. వ్యక్తిగత ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే సెక్షన్ 87ఏ పరిధిలో రూ. 12,500 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది కొత్త విధానంలో కూడా వర్తిస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉంటే పన్ను పడదు.

ఇక సెక్షన్ 80సీ పరిధిలో డిడక్షన్స్‌లో కూడా 2014 నుంచి మార్పు లేదు. రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు. అలాగే గృహ రుణంపై చెల్లించే వడ్డీ ని మినహాయింపుగా చూపే మొత్తాన్ని రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. ఇవన్నీ 2014 నుంచి మారలేదు. అయితే 2015లో కేంద్రం నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేసే సేవింగ్స్‌కు సెక్షన్ 80 సీసీడీ ద్వారా అదనంగా రూ. 50 వేల మినహాయింపును ఇచ్చింది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై మినహాయింపును రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచింది.

ఈసారి పన్నుల శ్లాబుల్లో మరింత హేతుబద్ధత ఉండే అవకాశం ఉంది. 2020-21 బడ్జెట్ సమయంలో సుమారు 70 మినహాయింపులను తొలగించారు. మిగిలిన మినహాయింపులను సమీక్షించే హేతుబద్ధత ఉండేలా చేస్తామని అప్పుడు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మరింత సరళంగా చేస్తామని కూడా చెప్పారు. అయితే 2021-22లో ఈ దిశగా మార్పులేవీ కనిపించలేదు.

IPL_Entry_Point