Sunny Leone | ఆ గ్రామంలో సన్నీ లియోన్ బర్త్ డే అంటే పండగ.. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు
బాలీవుడ్ అందాల తార సన్నీలియోన్ పుట్టిన రోజు మే 13న జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆమె అభిమానులు.. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు.
ఇటీవలే బాలీవుడ్ స్టాన్ నటి సన్నీ లియోన్ 41వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఆమె అభిమానులు సైతం.. సన్నీ బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. మే 13న రక్తదానాలు, అన్నదానాలు చేశారు. కేక్ కట్ చేసి.. తమ అభిమాన నటి మీద ప్రేమను చాటుకున్నారు.

కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని కొమ్మెనహళ్లి గ్రామంలో యువకులు సన్నీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. మే 13న సన్నీ లియోన్ పుట్టినరోజును పురస్కరించుకుని.. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కొమ్మెనహళ్లి గ్రామస్థులంతా.. వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె చేస్తున్న మంచి పనులను.. ఈ సందర్భంగా యువకులు తలుచుకున్నారు. గ్రామంలో సన్నీ పెద్ద కటౌట్లను ఏర్పాటు చేసి, కేక్ కట్ చేసి, క్రాకర్లు పేల్చారు. అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.
జీవధారే ట్రస్ట్ ఏర్పాటు చేసి.. సన్నీ లియోన్ పేరు మీద సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ట్రస్టు అధ్యక్షుడు నటరాజు మాట్లాడుతూ.. సన్నీలియోన్ జన్మదిన వేడుకలకు గ్రామంలోని యువకులు రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. తాము లియోన్‌కు అభిమానులమని, ఆమె పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించే సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అనాథ పిల్లలకు సహాయం చేస్తున్న లియోన్‌ను గౌరవించాలని నిర్వాహకులు అన్నారు.
'సన్నీ లియోన్ చేస్తున్న సేవ కార్యక్రమాల ద్వారా మేం చాలా ఆకర్షితులమయ్యాం. ప్రేరణ పొందాం. మా గ్రామంలో సన్నీలియోన్ అభిమానుల సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఆమె పేరు మీద స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. మా అభిమాన తార పుట్టినరోజు జరుపుకోవడం ఇది రెండోసారి.' అని కొమ్మెనహళ్లి గ్రామస్థుడు శ్రీధర్ అన్నారు. గ్రామపంచాయతీ అధ్యక్షుడు మను మాట్లాడుతూ గ్రామమంతా వేడుకల్లో పాలుపంచుకున్నట్లు తెలిపారు. ఆమె మంచి పనులను చేయడం స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు.
మండ్య నగరంలోని డీకే చికెన్ సెంటర్ ఓనర్ మల్లికా ప్రసాద్ ప్రజలకు బిర్యానీ పంచి సన్నీ పుట్టినరోజును ప్రత్యేకంగా జరిపారు. అదేవిధంగా సన్నీలియోన్ అభిమానులకు 10 శాతం తగ్గింపుతో చికెన్‌ను అందిస్తున్నట్టుగా తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్