ఆర్యన్‌ఖాన్‌ వ్యవహారంలో అంతుచిక్కని ప్రశ్నలెన్నో…!-aryan khan gets cleanchit in drugs case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Aryan Khan Gets Cleanchit In Drugs Case

ఆర్యన్‌ఖాన్‌ వ్యవహారంలో అంతుచిక్కని ప్రశ్నలెన్నో…!

HT Telugu Desk HT Telugu
May 28, 2022 07:49 AM IST

సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల వ్యవహారంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్ చిట్ లభించింది. డ్రగ్స్‌ పట్టుబడిన వ్యవహారంలో రకరకాల మలుపులు తిరిగిన కేసులో ఆర్యన్‌ దగ్గర అవి దొరకలేదని స్పష్టమైంది. డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ దాఖలు చేసిన ఛార్జిషీటులో ఆర్యన్‌ఖాన్‌ ప్రమేయం లేదని తేల్చింది.

ఎన్సీబీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఆర్యన్ ఖాన్
ఎన్సీబీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఆర్యన్ ఖాన్ (HT_PRINT)

దాదాపు ఎనిమిది నెలలుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బాలీవుడ్ డ్రగ్స్‌ వ్యవహారంలో షారుఖ్ ఖాన్‌ కుమారుడికి క్లీన్ చిట్ లభించింది. బొంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసి డ్రగ్స్‌ పట్టుకున్న కేసులో షారుఖ్‌ ఖాన్ కుమారుడు ఆర్యన్ 26రోజుల పాటు ఎన్సీబీ కస్టడీలో ఉన్నాడు. శుక్రవారం ఆర్యన్‌తో పాటు మరో ఐదుగురికి ఎన్సీబీ  క్లీన్‌చిట్ ఇచ్చింది. ఎన్సీబీ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 6వేల పేజీల ఛార్జిసీటు దాఖలు చేసింది. ఈ కేసులో 14మందిని నిందితులుగా పేర్కొన్నట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ఎన్సీబీ ఏర్పాటు చేసిన సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత నిష్పాక్షికంగా ఛార్జిషీటు దాఖలు చేసినట్లు ప్రకటించారు. సాక్ష్యాధారాలు, సహేతుకమైన సందేహాల ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగించినట్లు చెప్పారు.

మరోవైపు ఆర్యన్ ఖాన్‌ వ్యవహారంలో ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై సస్పెన్షన్ పడింది. కార్డెలియా క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ దాడి చేసి ఆర్యన్‌ ఖాన్‌ను పట్టుకున్న సమయంలో వాంఖడే నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది అక్టోబరులో క్రూయిజ్‌షిప్‌పై ఎన్సీబీ దాడి తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. షారూఖ్‌ కుమారుడితో పాటు 19మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కీలకంగా వ్యవహరించారు. ముంబై తీరంలో ఉన్న క్రూయిజ్ షిప్‌పై దాడి చేసి ఆర్యన్‌ఖాన్‌ను అరెస్ట్ చేయడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. అరెస్టుల వెనుక డబ్బు వసూళ్లు, కొందరిని ఇరికించే ప్రయత్నాలు ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, ఎన్సీబీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఓ దశలో నవాబ్‌ మాలిక్‌కు, వాంఖడేకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కూడా నడిచింది. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే సాక్ష్యులుగా ఉన్న వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం, వాంఖడే వ్యవహార శైలి వెలుగు చూడటంతో ఎన్సీబీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎనిమిది నెలల విచారణ తర్వాత డ్రగ్స్‌ వ్యవహారంలో ఆర్యన్ పాత్ర లేదని ఎన్సీబీ తేల్చింది. తాజా పరిణామాలపై స్పందించడానికి వాంఖడే నిరాకరించారు. సిట్ దర్యాప్తు, ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ప్రస్తుతం తాను ఎన్సీబీలో లేనని, దర్యాప్తుపై మాట్లాడలేనని వాంఖడే ప్రకటించారు. తన పరిధిలో లేని దర్యాప్తుపై మాట్లాడటానికి వాంఖడే నిరాకరించారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కార్యాలయం తాజా పరిణామాలపై హర్షం వ్యక్తం చేసింది. ఆర్యన్‌ ఖాన్‌ మరో ఐదుగురికి క్లీన్ చిట్ లభించింది. సమీర్ వాంఖడే, ఆయన ప్రైవేట్ ఆర్మీపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఎన్సీబీని అడ్డుపెట్టుకుని వాంఖడే ప్రముఖులను బెదిరించి భారీగా డబ్బు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

IPL_Entry_Point

టాపిక్