Fight between IndiGo crew, passenger: ఫ్లైట్ లో సర్వ్ చేస్తున్న ఫుడ్ కు సంబంధించి ఈ వివాదం ప్రారంభమైంది. తాను కోరిన సాండ్ విచ్ ను సర్వ్ చేయకపోవడంపై, ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్ లో మండిపడ్డారు. దానికి అంతే తీవ్రంగా ఆ ఎయిర్ హోస్టెస్ కూడా జవాబిచ్చారు. సహ ప్రయాణీకుడు ఒకరు ఈ ఘర్షణను వీడియో తీసి ట్విటర్ లో పోస్ట్ చేశారు.
ఇండిగో ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్, ప్యాసెంజర్ మధ్య చోటు చేసుకున్న తీవ్రస్థాయి వివాదాన్ని గుర్ ప్రీత్ సింగ్ అనే ప్రయాణీకుడు వీడియో తీసి, ట్విటర్ లో పోస్ట్ చేశారు. డిసెంబర్ 19న ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో ఫ్లైట్ లో ఈ ఫైట్ జరిగింది. ఎయిర్ హోస్టెస్ ను సర్వెంట్ అనడంతో ఆమె తీవ్రంగా మండిపడింది. తాను సర్వెంట్ ను కాదని, ఉద్యోగిని అని స్పష్టం చేసింది. మరోవైపు, తన వైపు వేలు చూపిస్తూ, బెదిరిస్తున్నట్లుగా మాట్లాడవద్దని హెచ్చరించింది. దాంతో, ఆ ప్యాసెంజర్ షటప్ అని గట్టిగా అనడంతో, తను కూడా అంతకన్నా గట్టిగా షటప్ అంటూ మండిపడింది. ఫుడ్ సర్వింగ్ లో ఒక పద్దతి ఉంటుందని, ముందుగా చెప్పిన వివరాల ప్రకారమే ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది. చివరకు, ఆమెను సహ ఉద్యోగి పక్కకు తీసుకువెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, సంబంధిత ఉద్యోగిని నుంచి వివరణ తీసుకున్నామని వివరించింది. విమానంలో సప్లై చేసే ఆహారానికి సంబంధించి ప్యాసెంజర్ తో వాగ్వాదం జరిగిందని తెలిపింది. ఏదేమైనా, ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సదుపాయం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఈ గొడవపై నెటిజన్లు కూడా భారీగానే స్పందిస్తున్నారు. ఇండిగోనే కాకుండా, మిగతా ఎయిర్ లైన్స్ లో కూడా సిబ్బంది అసహనంతో వ్యవహరిస్తున్నారని కొందరు విమర్శించారు.
టాపిక్