Telangana Election Results 2023 : నిజామాబాద్‌లో క‌మ‌ల వికాసం - 3 స్థానాలు కైవ‌సం-bjp won three seats in the joint nizamabad district ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Election Results 2023 : నిజామాబాద్‌లో క‌మ‌ల వికాసం - 3 స్థానాలు కైవ‌సం

Telangana Election Results 2023 : నిజామాబాద్‌లో క‌మ‌ల వికాసం - 3 స్థానాలు కైవ‌సం

HT Telugu Desk HT Telugu
Dec 03, 2023 06:25 PM IST

Telangana Election Results 2023 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ సత్తా చాటించింది. ఏకంగా మూడు స్థానాల్లో గెలిచి.. ప్రధాన పార్టీలకు సవాల్ విసిరింది.

బీజేపీలో కమల వికాసం
బీజేపీలో కమల వికాసం

Telangana Election Results 2023 : శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో క‌మలం విక‌సించింది. అంద‌రి అంచ‌నాలను త‌ల‌కిందులు చేస్తూ కీల‌క‌మైన స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. హోరాహోరీగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల‌ను ఓడించి విజ‌యం సాధించుకుంది. నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి ఈ సంఖ్య‌లో స్థానాలు రావ‌డం కూడా ఇదే మొద‌టిసారి.

నిజామాబాద్ అర్బ‌న్‌తో పాటు ఆర్మూరు, కామారెడ్డి మూడు స్థానాల్లో ఆ పార్టీకి చెందిన అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. మైనార్టీలు అధికంగా ఉండే నిజామాబాద్ అర్బ‌న్‌లో బీజేపీ అభ్య‌ర్థి ధ‌న్‌పాల్ సూర్య‌నారాయ‌ణ గుప్త ఏకంగా 15,387 ఓట్ల‌తో గెలుపొందారు. అయితే ఈ స్థానంలో కొన్ని రౌండ్ల‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ష‌బ్బీర్ అలీ గ‌ట్టి పోటీ నిచ్చారు. కానీ చివ‌ర‌కు ఆయ‌న‌కే విజ‌యం వ‌రించింది. అయితే ఇది త‌న గెలుపు కాద‌ని, నిజామాబాద్ ప్ర‌జ‌ల గెలుప‌ని ధ‌న్‌పాల్ ఫ‌లితాల అనంత‌రం వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకునే అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌జ‌ల‌కు పాదాబివంద‌న చేస్తున్న‌ట్టు తెలిపారు.

ఇక నిజామాబాద్ అర్బ‌న్ త‌రువాత ఆర్మూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ బీజేపీ స‌త్తా చాటింది. మొద‌టిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన వ్యాపార‌వేత్త పైడి రాకేష్‌రెడ్డి ఈసారి ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డిపై విజ‌యం సాధించారు. 29,669 ఓట్ల‌తో కాంగ్రెస్ అభ్య‌ర్థి విన‌య్‌రెడ్డిపై గెలుపొందారు. ఈసారి హ్య‌ట్రిక్ విజ‌యం సాధిస్తానన్న జీవ‌న్‌రెడ్డి మూడోస్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు.

కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో బీజేపీ అభ్య‌ర్థి ర‌మ‌ణారెడ్డి సంచ‌ల‌నం విజ‌యం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో 6,741 ఓట్ల‌తో విజ‌య‌దుందిబి మోగించారు. దీంతో జిల్లాలో ఒక్క స్థానం కూడా లేని బీజేపీ ఏకంగా మూడుస్థానాల్లో విజ‌యం సాధించి కొత్త రికార్డు నమోదు చేసింది.

రిపోర్టింగ్: నిజామాబాద్ జిల్లా ప్రతినిధి

WhatsApp channel