Vedanta 3rd interim dividend: షేర్ హోల్డర్లకు పెద్ద మొత్తంలో డివిడెంట్లను ప్రకటించే భారతీయ సంస్థల్లో వేదాంత గ్రూప్ ఒకటి. తాజాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో మధ్యంతర డివిడెండ్ పై అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత గ్రూప్ సంకేతాలిచ్చింది.
త్వరలో ప్రకటించనున్న మూడో డివిడెండ్ చెల్లింపునకు ఈ నవంబర్ 30వ తేదీని రికార్డ్ డేట్ గా సంస్థ ప్రకటించింది. 22నవంబర్ 2022 న జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ డివిడెండ్ విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపిక చేసిన వ్యక్తులు ఈ సంస్థ సెక్యూరిటీలపై ట్రేడింగ్ చేయడానికి వీల్లేకుండా నవంబర్ 18 నుంచి నవంబర్ 24 వరకు నిషేధం ఉంటుందని సంస్థ ప్రకటించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో వేదాంత గ్రూప్ తమ షేర్ హోల్డర్ లకు ఇప్పటివరకు రెండు సార్లు మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది. రూ. 1 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు తొలి సారి మే నెలలో రూ. 31. 50, రెండో సారి జులై నెలలో రూ. 19.50 డివిడెండ్ గా చెల్లించింది. ఈ సంస్థ షేరు గురువారం 1.6 శాతం నష్టపోయి రూ. 306.90 వద్ద స్థిరపడింది.