UPI Payments: రికార్డుస్థాయికి యూపీఐ పేమెంట్స్.. ఒక్క నెలలో ఎన్ని రూ.లక్షల కోట్లంటే!
UPI Payments Records High: యూపీఐ ట్రాన్సాక్షన్లు మరోసారి కొత్త రికార్డుకు చేరాయి. 2022లో ప్రజలు అత్యధికంగా యూపీఐ పేమెంట్స్ చేశారు. వివరాలివే..

UPI Payments Records High: యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (Unified Payments Interface - UPI) ద్వారా చెల్లింపులు చేసే వారి సంఖ్య దేశంలో నానాటికీ పెరిగిపోతోంది. యూపీఐ ఆధారంగా పేమెంట్స్ సులభంగా ఉండడం, దీని కోసం చాలా యాప్స్ ఉండడంతో ప్రజలు యూపీఐ వైపే మొగ్గుచూపుతన్నారు. గూగుల్ పే, ఫోన్‍పే, పేటీఎంతో పాటు చాలా యాప్‍ల్లో కూడా యూపీఐ పేమెంట్స్ సదుపాయం ఉంది. దీంతో ఈ చెల్లింపులకే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో యూపీఐ పేమెంట్లలో గణనీయమైన వృద్ధి కనపడుతోంది. తాజాగా డిసెంబర్‌లో యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరాయి. పూర్తి వివరాలివే..
ఒక్క నెలలోనే రూ.12.83 లక్షల కోట్లు
UPI Payments Records High: 2022 డిసెంబర్ నెలలో ఏకంగా రూ.12.83 లక్షల కోట్ల విలువైన యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి. 2016లో యూపీఐ లాంచ్ అవగా.. అప్పటి నుంచి అదే అత్యధికం. 2022 అక్టోబర్‌లో తొలిసారి రూ.12లక్షల కోట్ల మార్కును యూపీఐ ట్రాన్సాక్షన్లు దాటాయి. డిసెంబర్‌లో ఏకంగా రూ.12.38లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. “దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవంలో యూపీఐ ప్రధాన పాత్ర పోషిస్తోంది. 2022 డిసెంబర్‌లో 7.82 బిలియన్ల (782 కోట్లు)ను కంటే ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. ఈ నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ రూ.12.82లక్షల కోట్లుగా ఉంది” అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ట్వీట్ చేసింది.
2022 నవంబర్‌లో యూపీఐ ద్వారా 730.9 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఈ లావాదేవీల విలువ రూ.11.90లక్షల కోట్లుగా ఉంది. డిసెంబర్‌లో మరింత వృద్ధి చెంది ఇది రూ.12.83 లక్షల కోట్లకు చేరింది. ఇంటర్ బ్యాంక్ పీర్-టు-పీర్ (P2P) ట్రాన్సాక్షన్ల సదుపాయాన్ని యూపీఐ కల్పిస్తోంది. అంటే ఒకరి బ్యాంక్ అకౌంట్‍కు మరొకరు యూపీఐ ద్వారా సులభంగా డబ్బు బదిలీ చేయవచ్చు. పేమెంట్స్ కూడా చెల్లించవచ్చు. అందులోనూ యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఎలాంటి చార్జీలు లేవు. యూపీఐ ఆధారంగా పని చేసే యాప్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. దీంతో యూపీఐ చెల్లింపులు చేసేందుకు ప్రజలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు యూపీఐ ఆధారత చెల్లింపులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి.
సులభంగా, వేగంగా చెల్లింపులు చేసే మార్గంగా యూపీఐ ఉండటంతో ప్రజలు దీనిపై ఆసక్తి చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం యూపీఐ ద్వారా చాలా సులభతరంగా ఉంది. నెట్‍బ్యాంకింగ్‍తో పోలిస్తే ఇది చాలా సులువు. పేమెంట్లను కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్‍కు చేయవచ్చు.
టాపిక్