Tata Group to merge Air India with Vistara: ఎయిర్ ఇండియాలో విస్టారా విలీనం
Tata Group to merge Air India with Vistara: టాటా గ్రూప్ ఇటీవల సొంతం చేసుకున్న ఎయిర్ ఇండియాలో విస్టారా ఎయిర్ లైన్స్ విలీనానికి మార్గం సుగమమైంది.
Tata Group to merge Air India with Vistara: సింగపూర్ ఎయిర్ లైన్స్(ఎస్ఐఏ) లిమిటెడ్ కు చెందిన విస్టారా, ఎయిర్ ఇండియాల విలీనం చర్చలు దాదాపు ముగిశాయి. ఈ విలీనంతో ఎయిర్ ఇండియాలో విస్తారాకు 25.1% వాటా లభిస్తుంది. ఇందుకు గానూ సింగపూర్ ఎయిర్ లైన్స్ 250 మిలియన్ డాలర్లు ఎయిర్ ఇండియాకు చెల్లిస్తుంది.
మరో సంవత్సరం..
ఈ డీల్ పూర్తి కావడానికి మరో సంవత్సరం పైగా పట్టనుంది. మార్చ్, 2024 నాటికి ఈ విలీన ప్రక్రియ ముగుస్తుందని సింగపూర్ ఎయిర్ లైన్స్ మంగళవారం ప్రకటించింది. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందడంలో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత 2024, మార్చి నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుందని అంచనాకు వచ్చారు.
మెరుగైన సర్వీసులతో..
దేశీయ విమాన సేవల్లో ఎయిర్ ఇండియా పున: ప్రవేశంతో కీలక మార్పులు తప్పవని భావిస్తున్నారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ల వల్ల డొమెస్టిక్ మార్కెట్లో మంచి పోటీ నెలకొంటుందని, విమాన ప్రయాణీకులకు మెరుగైన సేవలు, చవకగా లభించే అవకాశముందని భావిస్తున్నారు. అవసరమైతే, ఎయిర్ ఇండియాలోకి మరిన్ని నిధులను సమకూర్చి, దేశీయ మార్కెట్లో ప్రబల శక్తిగా నిలపాలని టాటా సన్స్ తో కలిసి నిర్ణయించుకున్నామని ఎస్ఐఏ వెల్లడించింది. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్ ఇండియాకు పున: వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని సింగపూర్ ఎయిర్ లైన్స్ సీఈఓ గో చూన్ ఫాంగ్ తెలిపారు.