Stock Market: ఊగిసలాటతో స్టాక్ మార్కెట్ సూచీలు షురూ-stocks markets opens with gains nifty sensex today trading in green ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stocks Markets Opens With Gains Nifty Sensex Today Trading In Green

Stock Market: ఊగిసలాటతో స్టాక్ మార్కెట్ సూచీలు షురూ

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 14, 2023 09:17 AM IST

Stock Market News: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా ప్రతికూలంగానే మొదలయ్యాయి. సోమవారం తీవ్రంగా నష్టపోయి సూచీలు నేడు నష్టాలతో ఆరంభమయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు మాత్రం నేడు కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Stock Market: స్టాక్ మార్కెట్ ఓపెనింగ్
Stock Market: స్టాక్ మార్కెట్ ఓపెనింగ్

Stock Market News, 14 March 2023: కిందటి సెషన్‍లో భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు(మార్చి 14) కూడా ఊగిసలాటతో మొదలయ్యాయి. సెషన్ ఆరంభంలో లాభనష్టాల మధ్య సూచీలు కదలాడుతున్నాయి. సెషన్ ఓపెనింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 82.74 పాయింట్లు నష్టపోయి 58,155.11 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 20.70 పాయింట్లు పడిపోయి 17,133.60 వద్ద కొనసాగుతోంది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభానికి తోడు సిగ్నేచర్ బ్యాంక్ మూతపడడం అంతర్జాతీయ మార్కెట్‍లపై ఎఫెక్ట్ చూపిస్తోంది. వరుస సెషన్‍లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో స్టాక్‍ల్లో ఒత్తిడి కనిపించింది. మరోవైపు నేడు ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఓపెన్ అవుతున్నాయి. చాలా సూచీలు 2 శాతం కంటే ఎక్కువగా పడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

లాభాలు, నష్టాలు

అరబిందో ఫార్మా, లుపిన్, లార్సెన్, ఒరాకెల్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, జైడస్ లైఫ్, యునైటెడ్ స్పిరిట్, పీఐ ఇండస్ట్రీస్ స్టాక్స్ సెషన్ ఆరంభంలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బంధన్ బ్యాంక్, ఎం&ఎం, అంబుజా సిమెంట్స్ స్టాక్స్ టాప్ లూజర్లుగా ఓపెన్ అయ్యాయి.

మిశ్రమంగా అమెరికా మార్కెట్లు

ఇటీవల భారీగా పడిపోయిన అమెరికా మార్కెట్లు సోమవారం సెషన్‍లో కాస్త స్థిరత్వాన్ని కనబరిచాయి. మంగళవారం సెషన్‍లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ సూచీ 90.5 పాయింట్లు నష్టపోయి 31,819.14 వద్ద స్థిరపడింది. ఎస్&పీ 500 ఇండెక్స్ 5.83 పాయింట్ల స్వల్ప నష్టంతో 3,855.76 వద్ద ముగిసింది. నాస్‍డాక్ కంపోజైట్ 49.96 పాయింట్లు పెరిగి 11,188.84 వద్దకు చేరింది. బ్యాంకింగ్ రంగంలో నెలకొన్ని సంక్షోభంతో కొన్ని సెషన్లుగా ఆ దేశ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

భారీ నష్టాల్లో ఆసియా మార్కెట్లు

ఆసియా-పసిఫిక్ మార్కెట్ నేడు భారీ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. జపాన్‍లో టాపిక్స్, నిక్కీ సుమారు 2 శాతం వరకు పతనంలో ట్రేడ్ అవుతున్నాయి. దక్షిణకొరియాలో కోస్పీ సూచీ ఏకంగా 2.2 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా మార్కెట్లు ఒకటిన్నర శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి.

తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

CPI Inflation: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI) అయిన రిటైల్ ద్రవ్యోల్బణం (Inflation) ఫిబ్రవరి నెలలో 6.44 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 6.52 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం తగ్గినా.. ఆర్బీఐ నిర్దేశించుకున్న 6 శాతం టార్కెట్ కంటే కిందికి మాత్రం రాలేదు. దీంతో తదుపరి రెపోరేటును పెంచేందుకే ఆర్బీఐ మొగ్గుచూపుతుందని అంచనాలు వస్తున్నాయి.

పడిన క్రూడ్

అంతర్జాతీయ మార్కెట్‍లో క్రూడ్ ఆయిల్ ధరలు మరోసారి తగ్గుతున్నాయి. 24 గంటల వ్యవధిలో క్రూడ్ ఆయిల్ 2 శాతం పడిపోయింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80.77 డాలర్ల వద్ద ఉంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం క్రూడ్ పతనంపై ప్రభావం చూపిస్తోంది.

WhatsApp channel