Stock Market Today: నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్‍లు.. కారణమిదే..!-stock market news november 16 nifty sensex open in flat note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News November 16 Nifty Sensex Open In Flat Note

Stock Market Today: నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్‍లు.. కారణమిదే..!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 16, 2022 09:41 AM IST

Stock Market News Today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ఆరంభంలో నిఫ్టీ, సెన్సెక్ ఊగిసలాడుతున్నాయి.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు (REUTERS)

Stock Markets Opening Today: ఆసియా మార్కెట్‍లలో ప్రతికూల పవనాల నేపథ్యంలో నేడు (నవంబర్ 16) భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతోనే మొదలయ్యాయి. ఆరంభంలో సూచీలు ఊగిసలాడినా.. కాసేపటికే స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ (Nifty) 24.35 పాయింట్లు కోల్పోయి 18,379 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 56.63 పాయింట్లు దిగజారి 61,816 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ నిన్న కంటే కాస్త తగ్గి ప్రస్తుతం రూ.81.16 వద్ద ట్రేడవుతోంది.

Stock Market Today:అధిక లాభాలు, నష్టాలు

సెన్సెక్స్ సూచీలో అల్ట్రా టెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, టైటాన్ కంపెనీలు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. నెస్లే ఇండియా, హెచ్‍యూఎల్, ఆసియా పెయింట్స్, హెచ్‍డీఎఫ్‍సీ షేర్లు నష్టాలతో ఆరంభమయ్యాయి.

అమెరికా మార్కెట్‍లు మంగళవారం సానుకూలంగా ముగిశాయి. అయితే ఆసియాలో అధిక సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో భారత మార్కెట్‍లపై ప్రతికూల ప్రభావం పడింది. రష్యా, పోలండ్ మధ్య ఉద్రిక్తతలు మొదలవడం మైనస్‍గా మారింది.

Stock Market Today: అంతర్జాతీయ మార్కెట్‍లు

అమెరికా వాల్ స్ట్రీట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుండడంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతుందన్న అంచనాలతో సానుకూలంగానే స్పందించాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 56.22 పాయింట్లు పెరిగి, 33,592.92 వద్ద క్లోజ్ అయింది. ఎస్అండ్‍పీ 500.. 34.48 పాయింట్లు ఎగబాకి, 3,991.73 వద్ద స్థిరపడింది. నాస్‍డాక్ కంపోజైట్ 1.45 శాతం (162.19 పాయింట్లు) అధికమై, 11,358.41 వద్ద ముగిసింది.

ఇక, పోలండ్‍పై రష్యా మిసైల్ పడిందని వార్తలు రావడంతో ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. మళ్లీ యుద్ధం తీవ్రమవుతుందనే భయంతో జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్ మార్కెట్ కూడా 0.33 శాతం నష్టపోయింది.

ఎఫ్ఐఐలు, డీఐఐలు

విదేశీ మదుపరులు.. ఫారిన్ ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (FIIs) మంగళవారం (నవంబర్ 15) భారత మార్కెట్లలో రూ.221.32 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక దేశీయ ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (DIIs) కూడా అమ్మకం బాటే పట్టారు. రూ.549.28 విలువైన షేర్లను అమ్మేశారు.

WhatsApp channel