SBV Crisis: పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్: కుప్పకూలిన గ్లోబల్ మార్కెట్లు: భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావమెంత!-silicon valley bank crisis how much effect on indian stock market investors need to focus on us fed interest rates decision ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sbv Crisis: పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్: కుప్పకూలిన గ్లోబల్ మార్కెట్లు: భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావమెంత!

SBV Crisis: పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్: కుప్పకూలిన గ్లోబల్ మార్కెట్లు: భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావమెంత!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 11, 2023 12:30 PM IST

Silicon Valley Bank Crisis: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా దిశగా పయనిస్తుండటం అమెరికా మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మరి వచ్చే వారంలో భారత మార్కెట్లపై ఈ ఎఫెక్ట్ ఎంత వరకు ఉండొచ్చు?

SBV Crisis: పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్: కుప్పకూలిన గ్లోబల్ మార్కెట్లు
SBV Crisis: పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్: కుప్పకూలిన గ్లోబల్ మార్కెట్లు

Silicon Valley Bank Crisis: అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank - SVB) సంక్షోభం ప్రభావం ప్రపంచ మార్కెట్‍‍లపై తీవ్రంగా కనిపిస్తోంది. నాస్‍డాక్‍లో ఎస్‍వీబీ బ్యాంక్ షేర్ ధర రెండు రోజుల్లోనే 60శాతానికిపైగా పడిపోయింది. దీంతో గ్లోబల్ మార్కెట్లలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. శుక్రవారం సెషన్‍లో అమెరికాలో నాస్‍డాక్, డౌ జోన్స్, ఎస్&పీ సూచీలు సూచీలు సుమారు 1.5 శాతానికిపైగా క్షీణించాయి. శుక్రవారం సెషన్‍లో భారత స్టాక్ మార్కెట్లపైనా ఈ ప్రభావం పడింది. సెన్సెక్స్, నిఫ్టీ సుమారు చెరో శాతం పడిపోయాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 771.30 పాయింట్లు పతనమై 40,485 పాయింట్ల వద్ద ముగిసింది. మరి వచ్చే వారంలో ఎస్‍వీబీ సంక్షోభం ప్రభావం భారత మార్కెట్లపై ఎలా ఉంటుందో విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Silicon Valley Bank Crisis: శుక్రవారం సెషన్‍లో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలను బ్యాంకింగ్ సెక్టార్ షేర్ల నష్టాలు కిందికి లాగాయని నిపుణులు చెబుతున్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా.. ప్రభావం భారత మార్కెట్లపై ఎక్కువ కాలం ఉండదని చెబుతున్నారు. ఫండమెంటల్స్ ప్రకారం చూస్తే ఇండియాలోని బ్యాంక్‍లు చాలా బలంగా ఉన్నాయని, ఇటీవలి త్రైమాసిక ఫలితాలు కూడా బాగున్నాయని వెల్లడిస్తున్నారు. అయితే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును దూకుడుగా పెంచుతుందన్న అంచనాలు మాత్రం భారత స్టాక్ మార్కెట్‍పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ యూఎస్ ఫెడ్ అంచనాల కంటే వడ్డీ రేటును ఎక్కువగా పెంచితే స్టాక్ మార్కెట్లలో నెగెటివ్ సెంటిమెంట్ ఏర్పడే అవకాశం ఉంది. మొత్తంగా SVB సంక్షోభం ప్రభావం భారత మార్కెట్లపై ఎక్కువగా ఉండదని అభిప్రాయపడుతున్నారు.

Silicon Valley Bank Crisis: ఫండమెంటల్స్ కోణంలో చూస్తే భారత్‍లోని బ్యాంకులకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభానికి ఎలాంటి సంబంధం లేదని ప్రాఫిట్‍మార్ట్ సెక్యూరిటీస్ హెడ్ రీసెర్చర్ అవినాశ్ గోకర్‌శంకర్ విశ్లేషించారు. భారతీయ కార్పొరేట్ రంగానికి కూడా సీవీబీతో పెద్దగా సంబంధం లేదని అన్నారు. ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్లలో నెగెటివ్ సెంటిమెంట్ ఉండటంతో.. శుక్రవారం సెషన్‍లో ఎస్‍వీబీ బ్యాంక్ దివాళా ప్రభావం కనిపించిందని అన్నారు. అయితే బ్యాంకింగ్ సెక్టార్‌ స్టాక్‍లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుండాలని వెల్లడించారు.

‘ఫెడ్ వడ్డీ రేటు’ కీలకం

US Fed Interest rates: అమెరికాలో జాబ్ డేటా అనుకున్న దాని కంటే మెరుగ్గా ఉండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్.. వడ్డీ రేటును దూకుడుగా పెంచుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఇప్పటికే అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో నెగెటివ్ సెంటిమెంట్ ఏర్పడింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు ప్రభావం భారత మార్కెట్లపై కూడా అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేటును ఇంకా పెంచుతామని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గత వారం చెప్పటంతో.. గురువారం నుంచే భారత మార్కెట్లు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. ఈనెల మూడో వారంలో ఫెడ్ వడ్డీ రేటు ఎంత పెంచుతుందో ప్రకటన వెలువడుతుంది. ఫెడ్ మరోసారి 50 బేసిస్ పాయింట్లు అంటే అర శాతం వడ్డీ రేటును పెంచుతుందని అంచనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు 5 శాతానికి చేరుతుంది.

(గమనిక: ఇవి నిపుణుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. పెట్టుబడి సలహాలు కాదు. స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులతో ఉంటాయి. ఇన్వెస్టర్లు.. ఏదైనా స్టాక్‍లో పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీ గురించి పూర్తిగా విశ్లేషణ చేయాలి. ఫైనాన్స్ అడ్వయిజర్ సూచనలు తీసుకోవడం కూడా శ్రేయస్కరం.)

WhatsApp channel