Maruti Suzuki EVX Concept: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రముఖ సంస్థ మారుతీ సుజుకీ వచ్చేస్తోంది. గ్రేటర్ నొయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో బుధవారం (జనవరి 11) ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ‘ఈవీఎక్స్’ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కారును తీసుకురాని మారుతీ సుజుకీ.. అదిరిపోయే బ్యాటరీ పవర్డ్ ఆప్షన్‍తో ఫస్ట్ మోడల్‍ను అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ‘మారుతీ సుజుకీ ఈవీఎక్స్ కాన్సెప్ట్’ (Maruti Suzuki EVX Concept)ను ప్రదర్శించగా.. ఈ ఎలక్ట్రిక్ కారు 2025లో మార్కెట్‍లో లాంచ్ కానుంది. అంటే మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు మరో మూడేళ్లకు మార్కెట్‍ల్లోకి రానుంది. ఈ మారుతీ సుజుకీ ఈవీఎక్స్ కాన్సెప్ట్ బ్యాటరీ, రేంజ్, డిజైన్ వివరాలు ఇవే.
Maruti Suzuki eVX Concept: మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ 60kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు ప్రయాణించేలా డ్రైవింగ్ రేంజ్ ఉంటుంది. “దీన్ని 2025లో మార్కెట్‍లోకి తీసుకురావాలని మేం ప్లాన్ చేసుకున్నాం” అని సుజుకీ గ్రూప్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ చెప్పారు.
మారుతీ సుజుకీ ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ మారుతీ బలెనోను పోలి ఉంది. ఎక్స్‌టీరియర్ లుక్ కర్వీగా ఉంది. ఇది భారీగా కాకుండా కాంపాక్ట్‌గా 4x4 క్యాపబులిటీతో ఉంటుంది. సురక్షితమైన బ్యాటరీ టెక్నాలజీతో మారుతీ ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఉంది. విభిన్నమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉండే అనుకూలవంతమైన క్యాబిన్‍ను ఇది కలిగి ఉంది.
ఈవీఎక్స్ ఎస్‍యూవీ కాన్సెప్ట్ మాత్రమే కాకుండా, ఆటో ఎక్స్‌పోలోని మారుతీ సుజుకీ పెవిలియన్‍లో 16 వాహనాలు ఉన్నాయి. గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, సియజ్, ఎర్టిగా, బ్రెజా, వాగనార్ ఫ్యుయల్ ఫ్లెక్స్ ఫ్యుయల్, బలెనో, స్విఫ్ట్ తో పాటు మరిన్ని పెవిలియన్‍లో కనిపించాయి.
ఇథనాల్ బ్లెండింగ్ ఇంధనంతో నడిచే విధంగా వాగనార్ ఫ్లెక్స్ ఫ్లుయల్ (WagonR Flex Fuel) ను మారుతీ సుజుకీ రూపొందిస్తోంది. దీన్ని కూడా ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శిస్తోంది. ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఈ ఫ్యుయల్ ఫ్లెక్స్ మోడల్‍ను కూడా మరో రెండేళ్లలో మార్కెట్‍లోకి తీసుకురావాలని మారుతీ సుజుకీ భావిస్తోంది.
సంబంధిత కథనం