India's record in remittances:విదేశాల నుంచి భారతీయులకు అందే డబ్బులెన్నో తెలుసా?
Indians abroad to send 100 billion this year విదేశాల్లోని భారతీయులు ఇండియాలోని తమ మిత్రులు, కుటుంబ సభ్యులకు రికార్డు స్థాయిలో డబ్బులు పంపిస్తున్నారు.
Record number in remittances: విదేశాల్లో స్థిరపడిన, ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు ఇండియాలోని తమ వారికి సాధ్యమైనంత మొత్తంలో డబ్బులు పంపిస్తుంటారు. అయితే, ఈ విషయంలో కూడా ఇండియా రికార్డు సృష్టించింది. విదేశాల నుంచి భారత్ లోని కుటుంబ సభ్యులకు అందే మొత్తం భారతదేశ జీడీపీ(GDP)లో దాదాపు 3% ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
Record number in remittances: 100 బిలియన్ డాలర్లు
2022లో భారతీయులు విదేశాల నుంచి పొందే మొత్తం 100 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. వేరే ఏ ఇతర దేశస్తులు విదేశాల్లోని తమవారి నుంచి పొందే మొత్తం కన్నా ఇది ఎక్కువ అని వెల్లడించింది. 2021 సంవత్సరంలో భారతీయులు విదేశాల్లోని తమ వారి నుంచి 89.4 బిలియన్ డాలర్లు అందుకున్నారని, ఈ సంవత్సరం ఈ మొత్తంలో మరో 12% పెరుగుదల ఉంటుందని, అందువల్ల ఆ మొత్తం 100 బిలియన్ డాలర్ల కన్నాఎక్కువే ఉంటుందని భావిస్తున్నామని ఒక నివేదికలో వివరించింది. ఒక దేశం విదేశాల్లోని తమవారి నుంచి సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లు పొందడం ఇదే ప్రథమమవుతుందని వెల్లడించింది. వేతనాల పెంపు, అమెరికా, యూరోప్, గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన భారతీయుల సంఖ్య పెరగడం మొదలైనవి ఈ పెరుగుదలకు కారణమని విశ్లేషించింది.
Indians abroad to send 100 billion this year: తరువాతి స్థానాల్లో..
గత సంవత్సరం కూడా ఈ విషయంలో భారతదేశమే తొలి స్థానంలో నిలిచింది. 2021లో భారతీయులు తమ వారి నుంచి పొందిన డబ్బులు 89.4 బిలియన్ డాలర్లు. ఇది కూడా వేరే ఏ ఇతర దేశం అందుకున్న డబ్బుల కన్నా ఎక్కువే. భారత్ తరువాత స్వదేశస్తుల నుంచి అత్యధిక మొత్తంలో డబ్బులు పొందుతున్న దేశాల జాబితాలో మెక్సికో, చైనా, ఈజిప్ట్, ఫిలిప్పైన్స్ మొదలైనవి ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం.. ఇటీవల ఎక్కువ వేతనాలు లభించే ఉద్యోగాల్లో చేరుతున్న భారతీయల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Decreased share of Gulf countries: యూఎస్, యూకే నుంచి ఎక్కువ..
భారత్ కు వస్తున్న డబ్బుల్లో ఎక్కువగా అమెరికా, బ్రిటన్, సింగపూర్ ల నుంచి వస్తున్నాయని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ఈ మధ్య కాలంలో ఆ దేశాల్లోని భారతీయులు కుటుంబ సభ్యుల అవసరాల కోసమే కాకుండా, భారత్ లో రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తున్నారు. మరోవైపు, తక్కువ వేతనాలు, ఎక్కువ పని ఉండే గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గిందని ప్రపంచ బ్యాంక్ వివరించింది. గత ఐదేళ్లలో అధిక ఆదాయ దేశాల నుంచి భారత్ వస్తున్న మనీ 26% నుంచి 36 శాతానికి పెరిగింది. అదే సమయంలో, సౌదీ అరేబియా, యూఏఈ సహా ఐదు గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు వస్తున్న మొత్తం 54% నుంచి 28 శాతానికి తగ్గింది.