India auto market : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా అవతరించిన ఇండియా!
India becomes 3rd largest auto market : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఇండియా అవతరించింది! జపాన్ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది.
India becomes 3rd largest auto market : కొవిడ్ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన దేశీయ ఆటో మార్కెట్‌కు తిరిగి స్వర్ణయుగం మొదలైంది! 2022లో రికార్డు స్థాయి సేల్స్‌తో కళకళలాడిన ఇండియా ఆటో మార్కెట్.. తాజాగా ఓ ఘనతను సాధించింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా అవతరించింది ఇండియా. ఈ క్రమంలో ఆ స్థానంలో ఇంతకాలం ఉన్న జపాన్ను వెనక్కి నెట్టింది.
ఇండియా ఆటో పరిశ్రమ.. తగ్గేదే లే..!
2022 జనవరి- నవంబర్ మధ్యకాలంలో 4.13మిలియన్ వాహనాలు డెలివరీ అయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మేన్యుఫ్యాక్చర్స్ వెల్లడించింది. ఇక ఇటీవలే విడుదలైన మారుతీ సుజుకీ వాల్యూమ్ నెంబర్స్‌తో అది 4.25 మిలియన్ యూనిట్లకు చేరింది. టాటా మోటార్స్, హ్యుందాయ్, కియాతో పాటు ఇతర సంస్థలు.. తమ 2022 డెలివరీల నెంబర్లను ఇంకా ప్రకటించలేదు. అంటే.. ఈ నెంబర్ ఇంకా పెరగొచ్చు అని అర్థం. అదే సమయంలో.. 2022లో జపాన్ 4.2 మిలియన్ వాహనాలను మాత్రమే విక్రయించింది. ఫలితంగా.. జపాన్ను వెనక్కి నెట్టి.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఆవిర్భవించింది ఇండియా.
India auto market : చైనా.. 2009 నుంచి తొలి స్థానంలో కొనసాగుతోంది. 2021లో 26.27మిలియన్ వాహనాలను విక్రయించింది. 15.4మిలియన్ వాహనాల డెలివరీలతో అమెరికా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక జపాన్.. 4.44 మిలియన్ వెహికిల్స్‌ను అమ్మింది.
వాస్తవానికి.. 2018లోనే 4.4 మిలియన్ వాహనాలను విక్రయించింది ఇండియా. కానీ 2019లో ఆ నెంబర్ పడిపోయింది. నాడు 4మిలియన్ వాహనాలే అమ్ముడుపోయాయి. ఇక కొవిడ్ సంక్షోభం కారణంగా 2020లో 3మిలియన్ కన్నా తక్కువ యూనిట్లనే విక్రయించింది ఇండియా ఆటో మార్కెట్. ఆ తర్వాత.. సేల్స్‌లో వృద్ధి కనిపించినా.. సెమీకండక్టర్ల కొరత ఆటో రంగాన్ని వెంటాడింది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడుతుండటంతో.. ఆటో పరిశ్రమ రికార్డుస్థాయిలో దూసుకెళుతోంది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌తో పాటు దిగ్గజ ఆటో సంస్థలు.. రికార్డు స్థాయి సేల్స్‌ను చూశాయి.
India auto market size : నిక్కీ ఏషియా ప్రకారం.. గ్యాస్, హైబ్రీడ్ వెహికిల్స్ 2022లో ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఈవీ రంగం నిదానంగా పుంజుకుంటోంది.
ఇప్పుడే మొదలైంది.. ఇంకా చాలా ఉంది..!
ఇండియాలో 140కోట్లకుపైగా జనాభా నివాసముంటోంది. చైనా జనాభాను అతి తక్కువ సమయంలోనే ఇండియా అధిగమిస్తుందని, 2060 వరకు జనాభా వృద్ధి కనిపిస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే.. 2021లో యూరోమానిటర్ అనే బ్రిటీష్ రీసెర్చ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం.. ఇండియాలో కేవలం 8.5శాతం కుటుంబాల్లోనే కనీసం ఒక ప్యాసింజర్ వాహనమైనా ఉంది. అంటే.. ఇండియాలో ఆటో పరిశ్రమ వృద్ధి సాధించేందుకు ఇంకా చాలా స్కోప్ ఉన్నట్టు అర్థం. అదే సమయంలో.. ప్రభుత్వం కూడా ఈ రంగంపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా.. ఈవీలపై సబ్సీడీని కల్పిస్తూ.. ప్రజలను వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రోత్సహిస్తోంది.
India auto market growth : 2021తో పోల్చుకుంటే.. 2022లో జపాన్‌లో వాహనాల విక్రయాలు 5.6శాతం తగ్గాయి. కాగా.. 1990లో జపాన్‌లో అత్యధికంగా 7.77మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయాయి. నాటి నుంచి లెక్కేసుకుంటే.. 2022లో జపాన్ ఆటో సేల్స్ సగానికి పడిపోయాయి. జనాభా కూడా తగ్గిపోతుండటంతో, జపాన్‌లో ఆటో పరిశ్రమ రికవరీ అయ్యే సూచనలు తక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
India auto market share : నిక్కీ ఏషియా ప్రకారం.. 2006 వరకు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటో పరిశ్రమగా జపాన్ ఉండేది. 2006లో జపాన్ను చైనా వెనక్కి నెట్టింది. ఆ తర్వాత.. 2009లో అమెరికాను వెనక్కి నెట్టి.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో పరిశ్రమంగా ఎదిగింది చైనా.
సంబంధిత కథనం