Repo rate Impact on homebuyers: ఇల్లు కొనుగోలుదారులపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం-how rbi repo rate hike affect the homebuyers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  How Rbi Repo Rate Hike Affect The Homebuyers

Repo rate Impact on homebuyers: ఇల్లు కొనుగోలుదారులపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం

HT Telugu Desk HT Telugu
Dec 06, 2022 12:53 PM IST

రెపో రేటు 190 బేసిస్ పాయింట్ల మేర పెరుగుదల కారణంగా ఇప్పటికే ఇళ్ల అమ్మకాలు నెమ్మదించాయి. రేపు మరోసారి రెపో రేటు పెరగనున్న నేపథ్యంలో దీనిపై రెసిడెన్షియల్ మార్కెట్ వర్గాల విశ్లేషణ ఇదీ.

దేశంలో తగ్గుముఖం పట్టిన ఫ్లాట్ల అమ్మకాలు
దేశంలో తగ్గుముఖం పట్టిన ఫ్లాట్ల అమ్మకాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి రెపో రేటును 25 నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర పెంచనుందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. మానిటరీ పాలసీ కమిటీ ఈ దిశగా సోమవారం నుంచి కసరత్తు మొదలుపెట్టింది. డిసెంబరు 7న మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇక దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ‘ఆర్‌బీఐ డిసెంబరులో స్వల్పంగా వడ్డీ రేట్టు పెంచే అవకాశం ఉంది. 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెరగొచ్చు. 6.25 శాతంగా రెపో రేటు ఉండొచ్చు..’ అని వివరించింది.

ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇతర నిపుణులు కూడా 25 నుంచి 35 బేసిస్ పాయింట్ల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

‘ఆర్‌బీఐ ఇక వడ్డీ రేట్ల పెంపు విషయంలో దూకుడును కాస్త తగ్గించే అవకాశం ఉంది. ద్రవ్యోల్భణం ఒకింత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కమోడిటీ ధరలు పీక్ స్థాయి నుంచి కాస్త మందగించడం, అలాగే దేశీయ టోకు ధరలు కూడా తగ్గుముఖం పట్టడం కనిపిస్తోంది. సేవా రంగం మినహా క్యూ2లో పరిశ్రమలు, తయారీ రంగంలో వృద్ధి మందగించింది. ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టినప్పుడు వృద్ధికి సంబంధించిన అంశాలపై ఫోకస్ ఉంటుంది. 30 నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు పెంపు ఉండొచ్చు..’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ విశ్లేషించారు.

‘రియల్ ఎస్టేట్ కోణంలోంచి చూస్తే ఇప్పటి వరకు 190 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు పెరిగింది. 105 బీపీఎస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ రేట్లు పెరిగాయి. ఎంసీఎల్ఆర్ రేట్లను అనుసరిస్తూ హోం లోన్ వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. గడిచిన 6 నెలలుగా ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఇల్లు కొనుగోలుదారుల్లో కూడా కొనుగోలు శక్తి 10 శాతం మేర పడిపోయింది. అందువల్ల వృద్ధికి విఘాతం లేకుండా మరో 30 నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు పెంపు పరిమితం అవ్వొచ్చు..’ అని బైజల్ వివరించారు. మేలో వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్‌బీఐ, తదుపరి మరో మూడుసార్లు 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. వీటికి అనుగుణంగా అన్ని బ్యాంకులు ఎక్స్‌టెర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఈబీఎల్ఆర్) 190 బేసిస్ పాయింట్ల మేర పెంచాయి.

WhatsApp channel