Pakistan Crisis: చీకట్లో పాకిస్థాన్.. ప్రధాన నగరాలకు నిలిచిన విద్యుత్.. ఎందుకిలా?-darkness in pakistan major cities in facing major power outage why ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan Crisis: చీకట్లో పాకిస్థాన్.. ప్రధాన నగరాలకు నిలిచిన విద్యుత్.. ఎందుకిలా?

Pakistan Crisis: చీకట్లో పాకిస్థాన్.. ప్రధాన నగరాలకు నిలిచిన విద్యుత్.. ఎందుకిలా?

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 23, 2023 03:36 PM IST

Pakistan Power Outage: పాకిస్థాన్‍లో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎందుకిలా జరిగింది.. ప్రధాన కారణాలేంటి?

Pakistan Power Outage:  విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో షాప్‍లో చీకట్లోనే కూర్చుకున్న దుకారణదారుడు
Pakistan Power Outage: విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో షాప్‍లో చీకట్లోనే కూర్చుకున్న దుకారణదారుడు (REUTERS)

Pakistan Power Outage: ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక (Pakistan Economic Crisis), రాజకీయ సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో విద్యుత్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దాదాపు దేశమంతా భారీగా విద్యుత్ కోతలు (Pakistan Power Crisis) కొనసాగుతున్నాయి. రాత్రివేళ్లలో పూర్తిగా విద్యుత్ సరఫరా బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో సోమవారం (జనవరి 23) పాకిస్థాన్‍లో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఏకంగా ప్రధాన నగరాలకు విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, క్వెటా సిటీలు ప్రస్తుతం విద్యుత్ లేకుండానే ఉన్నాయి. ఇలా పూర్తిస్థాయిలో విద్యుత్ నిలిచిపోవడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి. ఇక కోతలైతే నెలల నుంచి భారీగా కొనసాగుతున్నాయి. మరి పాకిస్థాన్‍లో విద్యుత్ సంక్షోభానికి కారణమేంటి.. తాజా పరిస్థితి ఎలా ఏర్పడిందంటే..

Pakistan Power Outage: అందుకే..!

ట్రాన్స్‌మిషన్ లైన్‍లలో లోపం కారణంగా సోమవారం కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‍ సహా మిగిలిన నగరాలకు విద్యుత్ పూర్తిగా నిలిచిపోయిందని పాకిస్థాన్ మీడియా పేర్కొంటోంది. ఇస్లామాబాద్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ (IESCO) పరిధిలోని 117 గ్రిడ్ స్లేషన్‍లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని వెల్లడిస్తున్నాయి.

నేషనల్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ డౌన్ అవటంతో సోమవారం ఉదయం 7.34 గంటలకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయిందని పాకిస్థాన్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. గ్రిడ్ స్టేషన్ల పునరుద్ధణ జరుగుతోందని వెల్లడించింది.

Pakistan Power Outage: కాగా, ఈ విద్యుత్ ఔటేజ్‍ను కప్పిపుచ్చేలా పాకిస్థాన్ ఎనర్జీ మినిస్టర్ ఖుర్రమ్ దస్తగిర్ మాట్లాడారు. శీతకాలం రాత్రి వేళల్లో డిమాండ్ తక్కువగా ఉండడం కారణంగా పవర్ జనరేషన్ సిస్టమ్‍లను తాత్కాలికంగా క్లోజ్ చేసినట్టు వెల్లడించారు. అయితే, ఉదయం సిస్టమ్‍లను టర్న్ఆన్ చేయగానే.. ఫ్రీక్వెన్సీ మార్పులు, వోల్టేజ్ ఒడిదొడుకులతో పవర్ జనరేటింగ్ యూనిట్లు ఒకటితర్వాత ఒకటి షట్‍డౌన్ అయ్యాయని ఆయన అన్నారు. 12 గంటల్లో దేశంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని పేర్కొన్నారు.

విద్యుత్ సంక్షోభానికి కారణాలు ఇవే..

Pakistan Power Crisis: ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో రాత్రివేళ్లలో చాలా చోట్ల పూర్తిగా విద్యుత్ కోతలు ఉంటున్నాయి. చాలా వరకు చమురు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‍లను వనరులు లేక పాకిస్థాన్ నడపలేకపోతోంది. సరైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు లేక చాలా ప్లాంట్‍లు మూతపడ్డాయి. దేశానికి సరిపడా విద్యుత్ జనరేట్ అవడం లేదు. ఉత్పత్తి చేసిన విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువవుతోంది. ఇక, చాలా ప్లాంట్‍ల మూసివేతతో నేషనల్ గ్రిడ్ తరచూ బ్రౌక్‍డౌన్ అయిపోతోంది. దీంతో ఆ దేశంలో అధిక ప్రాంతంలో అంధకారం అలముకుటోంది.

చీకటి, నిరాశావాదం

Pakistan Power Outage: దేశంలో విద్యుత్ కష్టాలపై పాకిస్థాన్ మాజీ ఎంపీ బుష్రా గోహర్ ట్వీట్ చేశారు. పఖ్తూంక్వాలో రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “చీకటి, నిరాశావాదం.. పాకిస్థాన్‍లో ఎక్కువ భాగానికి వ్యాపించాయి. కొన్ని రోజుల నుంచి పఖ్తూంక్వాలో అప్రకటిత విద్యుత్ కోతలు ఉన్నాయి. ఇంటర్నట్ కనెక్షన్ సరిగా లేదు” అని గోహర్ పోస్ట్ చేశారు. అణు సామర్థ్యమున్న అభద్రతా దేశం అని అర్థం వచ్చేలా చివరి వాక్యం రాసుకొచ్చారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం