September 03 Telugu News Updates: మునుగోడులో విక్టరీ మనదే - కేసీఆర్
- September 3 Telugu News Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..
Sat, 03 Sep 202204:38 PM IST
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
cancellation of 34 mmts train services: భారీగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 4వ తేదీన అంటే ఆదివారం రోజున 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు కానున్నాయి.
Sat, 03 Sep 202203:56 PM IST
ముగిసిన సమావేశం
టీర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు, నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విషయంలో సర్వేలు అన్ని టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని… మునుగోడులో విజయం మనదే అంటూ చెప్పినట్లు సమాచారం..
Sat, 03 Sep 202203:57 PM IST
మరోసారి వాయిదా..
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా పడింది.
Sat, 03 Sep 202203:08 PM IST
సీఎం కేసీఆర్ తో సీపీయం నేతలు భేటీ
సీఎం కేసీఆర్ తో సీపీయం నేతలు భేటీ అయ్యారు. ఈమేరకు సీపీయం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు పలు రాజకీయ జాతీయ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...స్వార్థ రాజకీయాల కోసం, విచ్చిన్నకర శక్తులు పచ్చని తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. వీరి కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక వాదులు మేధావులు ప్రజా పక్షం వహించే రాజకీయవేత్తలు కదలిరావాలని తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి, మద్దతు ప్రకటించేందుకు ముందుకు వచ్చిన సీపీయం పార్టీకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కాగా, మతవిద్వేశ శక్తులకు ఎదుర్కునేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటంలో తాము సంపూర్ణ మద్దతునందిస్తామని సీపీయం నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పై నేతలు సీఎం కేసీఆర్ కు వినతిపత్రాన్ని అందించారు.
Sat, 03 Sep 202202:38 PM IST
కార్యక్రమాలు ఇవే
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల' ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది:
‣ సెప్టెంబర్ 16 వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలి.
‣ సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటి, పంచాయితీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలి.
‣ అదే రోజు (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం బంజారా ఆదివాసీ భవన్ ల ప్రారంభోత్సవం. నక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.
‣ సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు, కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా తెలంగాణ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి.
Sat, 03 Sep 202202:18 PM IST
పాతబస్తీలో తిరంగా యాత్ర…
ప్టెంబరు 17న హైదరాబాద్ పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్టు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజు అని తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన… హైదరాబాద్ సంస్థానం విమోచన కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారని గుర్తు చేశారు.
Sat, 03 Sep 202202:16 PM IST
సీఎం ఆరా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మంత్రి విశ్వరూప్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా విశ్వరూప్ ఆరోగ్య పరిస్థితిపై సిటీన్యూరో వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Sat, 03 Sep 202201:07 PM IST
కేంద్రమంత్రి ఫైర్
బీజేపీ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం వాటా ఉన్న పథకాలకు కేంద్రం పేరు పెట్టాల్సిందేని. 2021 వరకు తెలంగాణ ఆయుష్మాన్ భారత్‌లో ఎందుకు చేరలేదు? అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో నేనేం మాట్లాడానో మంత్రి హారీష్ రావు పూర్తిగా తెలుసుకోవాలని హితవు పలికారు.
Sat, 03 Sep 202212:49 PM IST
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
సెప్టెంబర్ 17వ తేదీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోజును తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది.సెప్టెంబర్ 16, 17, 18 18 తేదీలలో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పేర్కొంది.
Sat, 03 Sep 202212:49 PM IST
సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినం - కేబినెట్ నిర్ణయం
'రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్నది..ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటిస్తూ.. సెప్టెంబర్ 16, 17, 18 18 తేదీలలో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగా కేబినెట్ సమావేశం నిర్ణయించింది.
Sat, 03 Sep 202212:19 PM IST
శాసనసభాపక్ష సమావేశం
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ అధ్యక్షతన కేసీఆర్ ఆ పార్టీ శాసనసభాపక్షం భేటీ
అయింది. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Sat, 03 Sep 202211:17 AM IST
అలా గుర్తించండి…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. లేఖల్లో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
Sat, 03 Sep 202211:05 AM IST
పవన్ ఫైర్..
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ ఫైర్ అయ్యారు. విజయవాడ, జగ్గయ్యపేటలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకోవడం వారిలోని ఓటమి భయాన్ని చెబుతోందన్నారు.
Sat, 03 Sep 202210:45 AM IST
కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీకి మంత్రులతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
Sat, 03 Sep 202209:52 AM IST
బహిష్కరించాలని పిలుపు
ఏపీలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. సెప్టెంబర్ 5న ప్రభుత్వం (AP Government) చేసే సత్కారాలను , సన్మానాలను తిరస్కరించాలని ఏపీటీఎఫ్ పిలుపునిచ్చింది.
Sat, 03 Sep 202208:49 AM IST
కేంద్రమంత్రి మీడియా సమావేశం
ఇవాళ సాయంత్రం 04.15 నిమిషాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడనున్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి మాట్లాడనున్నారు.
Sat, 03 Sep 202208:47 AM IST
కాంగ్రెస్ ఛార్జీషీట్…
మునుగోడులో టీ కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై ఛార్జీషీట్ ను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి… టీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు.
Sat, 03 Sep 202208:41 AM IST
తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్ భేటీ అనంతరం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కూడా జరగనుంది. ఒకే రోజు రెండు కీలక సమావేశాలు జరుగనుండటంతో.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేబినెట్ భేటీ విషయానిక వస్తే.. ఈ ఏడాది సెప్టెంబరు 17తో భారత యూనియన్‌లో తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) విలీనమై 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో వజ్రోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
Sat, 03 Sep 202208:25 AM IST
రోడ్డు ప్రమాదంలో భార్యా భర్త మృతి
వరంగల్ లోని కాశీబుగ్గలో విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గకు చెందిన ఓ కుటుంబం దైవదర్శనం కోసం శనివారం ఉదయం కారులో వేములవాడకు బయలుదేరింది. మార్గమధ్యంలోని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న కాశీబుగ్గ వాసుల్లో ఇద్దరు మరణించారు. మృతులు కాశీబుగ్గకు చెందిన భార్యాభర్తలు మాధవి, సురేందర్ గా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న మరో ఇద్దరు మేఘన, అశోక్ గాయపడ్డారు. మృతి చెందిన దంపతుల్లో సురేందర్ ప్రమాద స్థలలోనే చనిపోగా మాధవి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు.
Sat, 03 Sep 202208:05 AM IST
రైతుల ఆందోళన
శ్రీకాకుళం జిల్లా టెక్కలి వంశధార కార్యాలయంలో రైతులు ఆందోళనకు దిగారు. వంశధార నీరు కాక పంటలు ఎండిపోతున్నాయంటూ నందిగాం రైతుల ఆవేదన చెందుతున్నారు. వంశధార ఈఈకి, నందిగాం మండల నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ వంశధార ఈఈ నిర్లక్ష్య సమాధానం ఇవ్వడంతో ఈఈ తీరును తప్పుపడుతూ నందిగాం నాయకులు నిరసనకు దిగారు.
Sat, 03 Sep 202208:01 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు త్వరితగతిన పునరావాసం కల్పించి, ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ముంపు మండలాల్లో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలతో ఇద్దరు మరణించడం విచారకరమని, పోలవరం నిర్వాసిత కుటుంబాలను తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎత్తిచూపిందని విమర్శించారు. ఇంకా 9,390 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని గుర్తు చేశారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
Sat, 03 Sep 202207:55 AM IST
పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పలు ప్యాసింజర్ రైళ్లను ఆదివారం రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07628 విజయవాడ-గుంటూరు మెమూ, ట్రైన్ నంబర్ 07786 గుంటూరు-రేపల్లె మెమూ, ట్రైన్ నంబర్ 07873 రేపల్లె-తెనాలి, 07282 తెనాలి-గుంటూరు, 07864 గుంటూరు-విజయవాడ, 07464 విజయవాడ-గుంటూరు, 07465 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను నిర్వహణ కారణాలతో రద్దు చేశారు.
Sat, 03 Sep 202207:28 AM IST
తెనాలిలో ఉద్రిక్తత
తెనాలి మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. అన్న క్యాంటీన్ తొలగించాలన్న నిర్ణయం సరికాదన్న టీడీపీ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. క్యాంటీన్ కు ఆహారం తెచ్చే వాహనాన్ని మధ్యలోనే ఆపేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వాహనంలోని పదార్థాలు తీసుకొచ్చిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. వాహనంలో వంట పాత్రలు పోలీసులు తీసుకెళ్లిపోయారు.
Sat, 03 Sep 202207:26 AM IST
ప్రకాశంలో సెబ్ అధికారుల దాడి
ప్రకాశం జిల్లా పెద్ద పీఆర్సీ తండాలో మహిళా వాలంటీర్ పై దాడి జరిగింది. నాటుసారా విక్రయిస్తున్నారంటూ వాలంటీర్ తోపాటు ఇద్దరు చెల్లెళ్లను జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ సెబ్ అధికారులు ఈడ్చుకెళ్లారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో సెబ్ అధికారులు, మహిళలకు మధ్య ఘర్షణ జరిగింది. తోపులాటలో గాయపడి స్పృహ కోల్పోయిన వాలంటీర్ నాగలక్ష్మిని ఆస్పత్రికి తరలించారు.
Sat, 03 Sep 202206:06 AM IST
షేక్ పేట్ మాజీ తహశీల్దార్ సుజాత అనుమానాస్పద మృతి
షేక్ పేట్ మాజీ తహశీల్దార్ సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుండెపోటుతో చనిపోయిందని సుజాత బంధువులు చెబుతున్నారు. గతంలో ఏసీబీ కేసులో పట్టుబడి సస్పెండ్ అయ్యారు. ముషీరాబాద్ తహశీల్దార్ గా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ముషీరాబాద్, షేక్ పేట, అంబర్ పేట్ ప్రాంతాల్లో తహశీల్దార్ గా పనిచేశారు. ఏసీబీ దాడుల అనంతరం సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. భర్త ఆత్మహత్యతో సుజాత మనస్తాపానికి గురయ్యారు. సస్పెన్షన్ అనంతరం విధుల్లో చేరే అవకాశం ఇచ్చినా సుజాత తిరస్కరించారు.
Sat, 03 Sep 202205:29 AM IST
తెనాలిలో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్ వద్ద పోలీసుల మోహరించారు. మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గతనెల 12న అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. క్యాంటీన్ తీసేయాలని 2 రోజులక్రితం మున్సిపల్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఈ ప్రాంతం - ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద 5 రోజుల క్రితం వైసీపీ క్యాంటీన్ ఏర్పాటు చేసింది. ఇవాళ ఉదయం వైసీపీ టెంట్ తొలగించిన మున్సిపల్ అధికారులు , టీడీపీ టెంట్ తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ కూడా ఆహారం పంపిణీకి టీడీపీ నేతలు సిద్ధమవ్వడంతో పోలీసులు మోహరించారు.
Sat, 03 Sep 202205:25 AM IST
గుండ్లకమ్మ సందర్శన
ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు రిజర్వాయర్ ను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. దెబ్బతిన్న గేట్లను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. వృథాగా పోతున్న నీటిపై అధికారులతో మంత్రి అంబటి సమీక్ష నిర్వహించారు.
Sat, 03 Sep 202205:24 AM IST
లీగల్ సర్వీసెస్ ఛైర్మన్‌గా చంద్రచూడ్
జాతీయ లీగల్ సర్వీసుల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ను నియమించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఈ పదవిలో నియమితులయ్యారు. రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ సిఫారసుతో జస్టిస్ చంద్రచూడ్ నియామకం జరిగింది.
Sat, 03 Sep 202205:23 AM IST
దోసపాడులో ఉద్రిక్తత
ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోసపాడులో ఉద్రిక్తత నెలకొంది. తమ భూముల్లో రాజకీయ నేతలు అక్రమ సాగు చేస్తున్నారని బాధితుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. తమ భూములు తమకు కావాలంటూ బాధితుల ఆందోళనకు దిగారు. గుణదలకు చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడితో పాటు బీహార్ వ్యక్తుల చేతుల్లో భూములున్నాయని ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, బాజీ సోదరులు కబ్జా చేశారంటూ రైతులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో భారీగా పోలీసుల మోహరించారు. దోసపాడులో 144 సెక్షన్ విధించారు.
Sat, 03 Sep 202204:12 AM IST
ఉపాధ్యాయుల ఆందోళన
ఫేషియల్ యాప్ సమస్యల పరిష్కారానికి అదనపు సమయం ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందని టీచర్లు ఆరోపిస్తున్నారు. అదనపు సమయం 15 రోజులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న టీచర్లు చెబుతున్నా, అలాంటి హామీ ఏమీ లేదంటున్న ఉన్నతాధికారులు స్పష్టం చేస్తుండటంతో, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే న్యాయపోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు.
Sat, 03 Sep 202203:40 AM IST
జనసేన జెండా దిమ్మ వివాదం
విజయవాడ పాతబస్తీలో జెండా దిమ్మ ఏర్పాటులో జనసేన, వైసీపీ వర్గాల మధ్య వివాదం నెలకొంది. జనసేన విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విడుదల చేశారు. జెండా దిమ్మె వివాదంలో పోతిన మహేశ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన సమయంలో 41-ఏ కింద నోటీసులు జారీ చేయాలని పోలీసులకు సూచించారు. రిమాండుకు పంపించే సెక్షన్లు లేనందున 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.
Sat, 03 Sep 202203:40 AM IST
ముగిసిన జగన్ కడప పర్యటన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన ముగిసింది. ఉదయం 10.40 గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు. రెండు రోజులపాటు కడపలో పర్యటించిన సీఎం జగన్ పలు ప్రారంభోత్సవాలు, సమీక్షా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Sat, 03 Sep 202203:40 AM IST
సాలూరులో ఉద్రిక్త వాతావరణం
విజయనగరం జిల్లా సాలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెంటాడ వీధి, రెల్లి వీధి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వినాయక మండపం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదంతో ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. మెంటాడవీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం, విగ్రహం ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాల దాడిలో పలు వాహనాలను ధ్వంసం అయ్యాయి.
Sat, 03 Sep 202203:40 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ భీమపాక తో పాటు తెలంగాణ ఎమ్మెల్యేలు వెంకటేశ్, మైనంపల్లి ఉన్నారు. శ్రీవారి సేవలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.