Siddipet District : తండ్రిని చూసుకోని తనయుడు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి-son is not taking care properly father is ready to write the property to kondagattu anjanna temple ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet District : తండ్రిని చూసుకోని తనయుడు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

Siddipet District : తండ్రిని చూసుకోని తనయుడు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

HT Telugu Desk HT Telugu
May 02, 2024 09:23 PM IST

Siddipet District News : కన్న కొడుకు సరిగ్గా చూసుకోవటం లేదని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా కొండగట్టు అంజన్న ఆలయానికి మొత్తం ఆస్తిని రాసి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది.

కొండగట్టు ఆలయం (ఫైల్ ఫొటో)
కొండగట్టు ఆలయం (ఫైల్ ఫొటో) (Twitter)

Siddipet District News: పిల్లలను అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసి కష్టపడి చదివించి ప్రయోజకులను చేసిన తల్లితండ్రులను పెద్దవారయ్యాక పట్టించుకోవటం లేదు. అలాంటి కొడుకులకు గుణపాఠం చెప్పేందుకు ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కన్న కొడుకు సరిగ్గా చూసుకోవడం లేదని మనస్తాపంతో ఓ తండ్రి తన ఆస్తులను కొండగట్టు ఆంజనేయస్వామికి(Kondagattu Anjanna temple) రాసిచ్చేందుకు సిద్దమయ్యాడు.

ఈ సంఘటన సిద్ధిపేట జిల్లాలో(Siddipet District) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…. కోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కప్పెర బాపురెడ్డికి భార్య లక్ష్మి,ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు (ప్రవీణ్ రెడ్డి) ఉన్నారు. వీరందరికి వివాహాలు అయ్యాయి. కాగా తల్లితండ్రులు సొంతూరులో నివసిస్తుండగా… కుమారుడు ప్రవీణ్ రెడ్డి భార్య,పిల్లలతో కలిసి హైదరాబాద్ లో పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. దీంతో గత కొన్నేళ్ల నుంచి బాపురెడ్డి కూడా హైదరాబాద్ లో కూలీ పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. కాగా ఇటీవల గ్రామానికి వచ్చిన బాపురెడ్డి తనను ఎవరు సరిగా చూసుకోవడం లేదని భార్య లక్ష్మితో గొడవ పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో తనకు ఉన్న ఆస్తిని కొండగట్టు అంజన్నకు రాసిచ్చేందుకు సిద్దమయ్యాడు. తాను అనుకున్నట్టుగానే బుధవారం తన ఆస్తికి సంబంధించిన పత్రాలను తీసుకొని కొండగట్టు ఆలయానికి చేరుకున్నాడు. తనతో తీసుకొచ్చిన పత్రాలను అంజన్న హుండీలో వేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే చివరి నిమిషంలో పూజారి చూసి ఆస్తి పత్రాలు హుండీలో వేస్తే ఆ ఆస్తి అంజన్నకు చెల్లదని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నాడు. అయితే తన ఆస్తిని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం పేరిట పట్టా చేయిస్తానని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను కోరాడు. కాగా బుధవారం సెలవు దినం కావడంతో రిజిస్ట్రేషన్ కోసం బాపురెడ్డి అక్కడే ఆలయం వద్ద ఉన్నాడు.

మనస్థాపంతో విద్యార్థి అదృశ్యం .......

పదో తరగతి ఫలితాల్లో(TS SSC Results 2024) జీపీఏ పాయింట్లు తక్కువ వచ్చాయని మనస్థాపం చెందిన ఓ విద్యార్థి అదృశ్యమయిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జహీరాబాద్ లోని అర్జునాయక్ తండాకు చెందిన జటోత్ పృథ్వినాయక్ పెద్దవూర గురుకుల పాఠశాలలో పదోవ తరగతి పూర్తి చేశాడు. మంగళవారం విడుదల చేసిన ఫలితాలలో అతడికి 8.7 జిపిఏ వచ్చింది.

తన తోటి స్నేహితులు అందరూ 9 జిపిఏ కంటే ఎక్కువ గ్రేడ్ సాధించారు. దీంతో తనకు తక్కువ గ్రేడ్ వచ్చిందని మనస్థాపం చెందిన పృథ్వినాయక్ సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. మరల ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లితండ్రులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. విద్యార్థి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.

IPL_Entry_Point