Kondagattu : హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టుకు(Kondagattu) భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. భక్తుల హడావిడితో అపశృతి చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు(TSRTC) కింద పడి భక్తుడు లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయారు. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునే తొందరలో వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన భక్తుడు లక్ష్మణ్.. కొండ కింద నుంచి పైకి ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సు ఎక్కే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. లక్ష్మణ్ రెండు కాళ్లపై నుంచి బస్సు టైర్ వెళ్లడంతో కాళ్ళు నుజ్జునుజ్జై తీవ్రరక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయగా ఆలస్యం కావడంతో పోలీసులు తమ వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అస్వస్థతకు గురైన లక్ష్మణ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
పౌర్ణమి రోజు మంగళవారం చిన్న హనుమాన్ జయంతి(Kondagattu Hanuman Jayanti) కావడంతో పవిత్రంగా భావిస్తూ కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో కొండంత కాషాయ వర్ణశోభితంగా మారింది. శ్రీరామ జయరామ జయజయ రామ నామ స్మరణతో మారుమోగింది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో నిరంతరాయంగా దర్శనాలు కల్పించారు అధికారులు. బారులు తీరు భక్తులు దర్శనం చేసుకోవడంతో దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. సుమారు లక్ష మంది హనుమాన్ దీక్ష (Hanuman Deeksha)స్వాములు కొండగట్టును సందర్శించినట్లు అధికారులు తెలిపారు. హనుమాన్ దీక్ష మాల విరమణ, పెద్దహనుమాన్ జయంతి వరకు దీక్ష మాలదారణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండే ఎండలతో భక్తులు ఇబ్బంది పడకుండా కొండపై బండ కాలకుండా మ్యాట్ ఏర్పాటు చేయడంతోపాటు చలువ పందిళ్లు వేశారు. దారి పొడవునా చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో భక్తులకు కాస్త ఉపశమనంగా మారింది. బుధవారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ ఉంటుందని... భక్తుల రద్దీతో అన్ని ఆర్జిత సేవలు(Arjita Seva) రద్దు చేసినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రకటించారు.
HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR