Varuthini ekadashi 2024: వరూథిని ఏకాదశి ఎప్పుడు? ఈ ఏకాదశి ప్రాముఖ్యత, ఆచరించాల్సిన నియమాలు ఏంటి?-varuthini ekadashi 2024 date and shubha muhurtham follow these rules on ekadashi for seeking lord vishnu blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Varuthini Ekadashi 2024: వరూథిని ఏకాదశి ఎప్పుడు? ఈ ఏకాదశి ప్రాముఖ్యత, ఆచరించాల్సిన నియమాలు ఏంటి?

Varuthini ekadashi 2024: వరూథిని ఏకాదశి ఎప్పుడు? ఈ ఏకాదశి ప్రాముఖ్యత, ఆచరించాల్సిన నియమాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Apr 29, 2024 06:19 PM IST

Varuthini ekadashi 2024: ఏకాదశి చాలా పవిత్రమైనది. నెలకు రెండు సార్లు ఏకాదశి వస్తుంది. మే 4వ తేదీన వరూథిని ఏకాదశి జరుపుకోనున్నారు. ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? ఆచరించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.

వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత
వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత

Varuthini ekadashi 2024: ఏకాదశి రోజు విష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు. ప్రతినెలా కృష్ణ పక్షం, శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది. ఈరోజు లోకానికి అధిపతి అయిన శ్రీహరి విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.

మే 4వ తేదీ వరూథిని ఏకాదశి వచ్చింది. సంతోషం, శ్రేయస్సు, ఆశీర్వాదాలు, విష్ణు అనుగ్రహం పొందేందుకు ఇది అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. వరూథిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, దానధర్మాలు చేయడం వల్ల ధన సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శుభ సమయం

ఏకాదశి తిథి మే 3వ తేదీ రాత్రి 11:24 గంటలకు ప్రారంభమై మే 4వ తేదీ రాత్రి 8.28 గంటలకు ముగుస్తుంది. అందువల్ల మే 4న వరూథిని ఏకాదశి ఉపవాసం జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏకాదశి రోజు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. త్రిపుష్కర యోగం, ఇంద్రయోగం, వైద్రి యోగంతో వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత రెట్టింపు అయ్యింది. వరూథిని ఏకాదశి రోజున విష్ణువు వామనావతారాన్ని పూజిస్తారు.

వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత

వరూథిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది. ఈ ఉపవాసం ఆచరించిన వ్యక్తి తన జీవితంలో శ్రేయస్సు, సమృద్ధి, అదృష్టాన్ని పొందుతాడు. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల మోక్షం కలుగుతుంది. వైకుంఠ ప్రవేశం లభిస్తుంది.

పురాణాల ప్రకారం శివుడు బ్రహ్మ ఐదవ తలని తొలగించినప్పుడు శాపానికి గురవుతాడు. ఈ శాపం నుంచి విముక్తి పొందేందుకు శివుడు వరూథిని ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించాడు. అప్పుడు శివుడు శాప, పాపాల నుంచి విముక్తి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. మత విశ్వాసాల ప్రకారం ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అనేక సంవత్సరాలు తపస్సు చేసిన దానితో సమానంగా భావిస్తారు.

ఏకాదశి నాడు తులసిని కూడా పూజిస్తారు. అయితే తులసి ఆకులు తెంపకూడదు. ఈరోజు తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసి మాల కూడా ధరించవచ్చు. తులసి మొక్క వేరులోని తడి మట్టిని కొద్దిగా తీసుకుని నుదుటిపై బొట్టుగా రాసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంటికి శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు.

ఆచరించాల్సిన నియమాలు

ఉదయాన్నే నిద్ర లేచి పవిత్ర నదీ స్నానం ఆచరించాలి. గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి పూలు, తులసి సమర్పించాలి. ఏకాదశి రోజు జంతువులు, పక్షులకు నీరు, ఆహారం ఏర్పాటు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీ శక్తి మేరకు ఆహారాన్ని దానం చేయాలి. బట్టలు దానం చేయడం చాలా శుభప్రదం.

వరూథిని ఏకాదశి నాడు పండ్లు దానం చేయడం వల్ల పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే పూజ సమయంలో విష్ణుమూర్తికి బంతి పూలు సమర్పించాలి.

ఏకాదశి నాడు చేయకూడని పనులు

ఏకాదశి నాడు పొరపాటున కూడా తామసిక ఆహారం తీసుకోకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం, నీరు తీసుకోకూడదు. సాయంత్రం పండ్లు తినొచ్చు. ఎక్కువగా ఈరోజు భగవంతుడిని ధ్యానించాలి.

WhatsApp channel