CM Revanth Reddy : బీజేపీ టార్గెట్ 400 రిజర్వేషన్ల రద్దు కుట్రలో భాగమే, దిల్లీ సుల్తానులకు లొంగిపోను -సీఎం రేవంత్ రెడ్డి-hyderabad cm revanth reddy sensational comments on bjp rss trying to cancel reservation target 400 seats ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cm Revanth Reddy : బీజేపీ టార్గెట్ 400 రిజర్వేషన్ల రద్దు కుట్రలో భాగమే, దిల్లీ సుల్తానులకు లొంగిపోను -సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : బీజేపీ టార్గెట్ 400 రిజర్వేషన్ల రద్దు కుట్రలో భాగమే, దిల్లీ సుల్తానులకు లొంగిపోను -సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
May 01, 2024 08:05 PM IST

CM Revanth Reddy : రిజర్వేషన్ల రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతున్నాననే తనను దిల్లీ పోలీసులతో బెదిరించాలని చూస్తున్నారని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : రిజర్వేషన్లను రద్దు(Reservations Cancel) చేయడమే ఆరెస్సెస్ మూల సిద్ధాంతం... దీనిని అమలు చేయడమే బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth REddy) ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని(Constitution) మార్చడానికి బీజేపీ వేసుకున్న ప్రణాళికలను తాను ప్రస్తావించానన్నారు. ఆధారాలతో నేను చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాలి.. లేకపోతే సవరించుకోవాలన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగించినట్లు.. తనపై దిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. దిల్లీ పోలీసులను(Delhi Police) ప్రయోగించడం ద్వారా తెలంగాణ సమాజాన్ని భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా దళిత, గిరిజన, బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా లొంగిపోతానని దిల్లీ సుల్తానులు ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. ఈ బాధ్యత, ఈ హోదా దళితులు, గిరిజనులు, ఓబీసీ, మైనారిటీలు ఇచ్చినవే అన్నారు.

ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర

"రిజర్వేషన్లు కాపాడటానికి, బీజేపీ(BJP Plan) కుట్రలను తిప్పి కొట్టడానికే ఈ హోదాను ఉపయోగిస్తాను. ఫిబ్రవరి 22, 2000లో బీజేపీ ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగాన్ని మార్చడానికి 10 మంది సభ్యులతో కూడిన జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ నియమించారు. 2002లో ఈ కమిషన్ నివేదిక ఇచ్చింది. 2004లో కాంగ్రెస్(Congress) అధికారంలోకి రావడం వల్లే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం తప్పింది. ఆరెస్సెస్(RSS) కు చెందిన గోలవార్కర్, ఎన్జీ వైద్య కూడా రిజర్వేషన్లు ఉండకూడదని పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం బీసీ జనగణన చేపట్టాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్రతోనే బీజేపీ 400 సీట్లు కావాలని కోరుతోంది. 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను చీల్చి ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. బీజేపీ ఒక ప్రణాళికబద్దంగా రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తోంది"- సీఎం రేవంత్ రెడ్డి

ఒక సీఎంపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు

రిజర్వేషన్లు రద్దు అంశాన్ని ప్రస్తావించాననే నాపై కేసు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యున్ని చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఫిర్యాదు చేసింది హోంశాఖే అని, కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల(Non Bailable Sections) పెట్టి..... ఆగమేఘాల మీద దేశ భద్రతకు ముప్పు వచ్చినట్లు.. దేశ స్వాతంత్ర్యానికి ముప్పు ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ కేసుకు సంబంధం లేదని మా మహిళా అడ్వకేట్ పోలీస్ స్టేషన్ కు వెళితే దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు కాబట్టే... వాళ్లు దిల్లీ పోలీసులను(Delhi Police) ఎంచుకున్నారన్నారు. పోలీసులను ప్రయోగించి నాపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ప్రచారం చెయ్యకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడానికే తాము వచ్చామని 2017లో కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే స్టేట్మెంట్ ఇచ్చారన్నారు.

బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు

"రిజర్వేషన్లు(Reservations) అభివృద్ధిని తీసుకొస్తాయా అంటూ 2014-2019 మధ్య లోక్ సభ స్పీకర్ గా ఉన్న సుమిత్రా మహాజన్ మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలందరూ రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా ఒక ఎజెండాతో ముందుకెళుతున్నారు. దీనిపై మోదీ(Modi), అమిత్ షా(Amit Shah) దేశ ప్రజలకు ఏం చెబుతారు? దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. మీరు బీజేపీకి(BJP) వేసే ప్రతీ ఓటు... రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది. రిజర్వేషన్లు పెరగాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి. రాజ్యాంగం మార్చాలంటే ఎన్డీఏ... రాజ్యాంగం(Constitution) మార్చకూడదు అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలో దేశంలోని దళిత, గిరిజన, ఓబీసీ, మైనార్టీలు నిర్ణయించుకోండి. మోదీ, అమిత్ షా లకు ఒకటే చెబుతున్నా... పోలీసుల(Delhi Police)తో నన్ను బెదిరించాలనుకుంటే అది జరగని పని. అలా చేయాలనుకుంటే ఏం జరుగుతుందో మీ చీకటి మిత్రుడిని అడిగి తెలుసుకోండి. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి" -సీఎం రేవంత్ రెడ్డి

WhatsApp channel

సంబంధిత కథనం