SRH vs RR: దంచికొట్టిన నితీష్ కుమార్ రెడ్డి, హెడ్, క్లాసెన్.. సన్ రైజర్స్ భారీ స్కోరు..-srh vs rr ipl 2024 nitish kumar reddy head klaasen take sunrisers to 201 against rajasthan royals ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Rr: దంచికొట్టిన నితీష్ కుమార్ రెడ్డి, హెడ్, క్లాసెన్.. సన్ రైజర్స్ భారీ స్కోరు..

SRH vs RR: దంచికొట్టిన నితీష్ కుమార్ రెడ్డి, హెడ్, క్లాసెన్.. సన్ రైజర్స్ భారీ స్కోరు..

Hari Prasad S HT Telugu
May 02, 2024 09:27 PM IST

SRH vs RR: సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి 200కుపైగా స్కోరు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలు, క్లాసెన్ మెరుపులతో రాజస్థాన్ రాయల్స్ పై భారీ స్కోరు చేసింది.

దంచికొట్టిన నితీష్ కుమార్ రెడ్డి, హెడ్, క్లాసెన్.. సన్ రైజర్స్ భారీ స్కోరు..
దంచికొట్టిన నితీష్ కుమార్ రెడ్డి, హెడ్, క్లాసెన్.. సన్ రైజర్స్ భారీ స్కోరు.. (AP)

SRH vs RR: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు ఓటముల తర్వాత మరోసారి బ్యాట్ తో చెలరేగింది. పాయింట్ల టేబుల్లో టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ మెరుపు హాఫ్ సెంచరీలతో టీమ్ కు భారీ స్కోరు అందించారు.

నితీష్, హెడ్, క్లాసెన్ మెరుపులు

గత రెండు మ్యాచ్ లలో చేజింగ్ లో బోల్తా పడి ఓడిపోయిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ గత మ్యాచ్ లలోలాగా చెలరేగలేదు. 4.1 ఓవర్ల దగ్గర అభిషేక్ (12) ఔటయ్యాడు. అప్పటికి సన్ రైజర్స్ స్కోరు 25 మాత్రమే. ఆ తర్వాత అన్మోల్‌ప్రీత్ సింగ్ (5) మరోసారి విఫలమవడంతో 35 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి.

ఈ దశలో క్రీజులో ఉన్న హెడ్ కు నితీష్ కుమార్ రెడ్డి తోడయ్యాడు. ఇద్దరూ కలిసి రాయల్స్ బౌలర్లను ఆటాడుకున్నారు. మూడో వికెట్ కు 96 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. హెడ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న హెడ్.. ఈ మ్యాచ్ లో ఆ స్థాయిలో ఇరగదీయకపోయినా.. ఫర్వాలేదనిపించాడు.

అయితే మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం మరోసారి మెరుపులు మెరిపించాడు. అతడు సిక్సర్ల మోత మోగించాడు. 42 బంతుల్లోనే 8 సిక్స్ లు, 2 ఫోర్లతో 76 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అటు క్లాసెన్ కూడా చెలరేగాడు. అతడు 19 బంతుల్లోనే 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 42 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా 66 పరుగులు జోడించారు.

రాయల్స్ బౌలర్లలో చహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడు 4 ఓవర్లలో ఏకంగా 62 రన్స్ ఇచ్చాడు. అవేష్ ఖాన్ మాత్రం 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ కూడా 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన సన్ రైజర్స్ కు ఇది చాలా కీలకమైన మ్యాచ్. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకుంటుంది.

IPL_Entry_Point