LSG vs MI: లక్నో చేతిలో ముంబై చిత్తు.. హార్దిక్ సేన ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతే!-lsg vs mi 2024 mumbai indians playoffs hopes grims after lose against lucknow super giants ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Lsg Vs Mi: లక్నో చేతిలో ముంబై చిత్తు.. హార్దిక్ సేన ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతే!

LSG vs MI: లక్నో చేతిలో ముంబై చిత్తు.. హార్దిక్ సేన ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతే!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 30, 2024 11:35 PM IST

LSG vs MI IPL 2024: ముంబై ఇండియన్స్ మరోసారి నిరాశపరిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో చేతిలో పరాజయం పాలైంది. ప్లేఆఫ్స్ ఆశలను మరింత నీరుగార్చుకుంది ముంబై.

LSG vs MI: లక్నో చేతిలో ముంబై చిత్తు.. ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతే!
LSG vs MI: లక్నో చేతిలో ముంబై చిత్తు.. ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతే!

LSG vs MI IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్ మరోసారి చతికిలపడింది. ఈ సీజన్‍లో ప్లేఆఫ్స్ ఆశలను ఐదుసార్లు చాంపియన్ ముంబై దాదాపు గల్లంతు చేసుకుంది. నేడు (ఏప్రిల్ 30) జరిగిన ఐపీఎల్ మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్‌ 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. ఎకానా స్టేడియం వేదికగా జరిగిన పోరులో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై నిరాశపరిచింది.

వధేరా, డేవిడ్ రాణించడంతో ఆ మాత్రం..

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. పుట్టిన రోజున రోహిత్ శర్మ (4) త్వరగా ఔటవగా.. సూర్య కుమార్ యాదవ్ (10), తిలక్ వర్మ (7), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (0) విఫలమయ్యారు. దీంతో 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓ దశలో పీకల్లోతు కష్టాల్లో పడింది ముంబై. లక్నో బౌలర్ల ధాటికి ముంబై విలవిల్లాడింది. అయితే, ఓపెనర్ ఇషాన్ కిషన్ (36 బంతుల్లో 32 పరుగులు) నిదానంగా ఆడి పరుగులు రాబట్టాడు. కాసేపు నిలిచాడు. నేహాల్ వదేరా (41 బంతుల్లో 46 పరుగులు) కూడా రాణించాడు. వీరిద్దరూ 53 పరుగుల భాగస్వామ్యం జోడించారు. చివర్లో టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 35 పరుగులు; నాటౌట్) మెరిపించడంతో ముంబైకు ఆ మాత్రం స్కోరు దక్కింది.

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మోహిసిన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అయితే, నవీనుల్ హక్ 3.5 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీసి రాణించాడు. మార్కస్ స్టొయినిస్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.

స్టొయినిస్ ధమాకా

ఈ లక్ష్యాన్ని చివరి ఓవర్ వరకు ఆడి లక్నో సూపర్ జెయింట్స్ ఛేదించింది. 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసి విజయం సాధించింది. లక్నో స్టార్ మార్కస్ స్టొయినిస్ 45 బంతుల్లో 62 పరుగులతో మెరిపించాడు. అర్ధ శకతంతో అదరగొట్టాడు. 7 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (28), దీపక్ హుడా (18), నికోలస్ పూరన్ (14 నాటౌట్) తలా కొన్ని రన్స్ చేశారు. ఓ దశలో వరుస వికెట్లు పడి ఉత్కంఠ రేగినా.. పూరన్ చివరి వరకు నిలిచి లక్నోను గెలుపునకు చేర్చాడు.

ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు, నువాన్ తుషారా, గెరాల్డ్ కొయిట్జీ, మహమ్మద్ నబీ చెరో వికెట్ తీశారు. స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా వికెట్ తీయకపోయినా.. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి లక్నోను కట్టడి చేశాడు. కాపాడుకోవాల్సిన స్కోరు తక్కువే ఉన్నా చివరి ఓవర్ వరకు మ్యాచ్‍ను తీసుకొచ్చారు ముంబై బౌలర్లు. అయితే, చివరికి లక్నో గెలిచింది.

ముంబై ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు ఆవిరే!

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‍ల్లో ఏడు ఓడి, 3 మ్యాచ్‍ల్లో ముంబై గెలిచింది. ఆరు పాయింట్లతో ఉంది. ప్రస్తుతం పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. లీగ్ దశలో మిగిలిన తన నాలుగు మ్యాచ్‍లు గెలిచినా ముంబై ఇండియన్స్ ఈసారి ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. ఒకవేళ మిగిలిన నాలుగు మ్యాచ్‍లు భారీగా గెలిచి.. ఇతర జట్ల సమీకరణాలు కలిసి వస్తే కాస్త అవకాశం ఉండొచ్చు. కానీ ఇది చాలా కష్టమే.

ఇప్పటి వరకు 10 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లను సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది.

IPL_Entry_Point