Wales Hockey Team: డబ్బులిచ్చి మరీ నేషనల్ టీమ్‌కు ఆడుతున్నారు.. ఈ వేల్స్ టీమ్ గురించి మీకు తెలుసా?
Wales Hockey Team: డబ్బులిచ్చి మరీ నేషనల్ టీమ్‌కు ఆడుతున్నారు వేల్స్ హాకీ టీమ్ ప్లేయర్స్. ప్రస్తుతం జరుగుతున్న హాకీ వరల్డ్‌కప్‌లోనూ ఈ వేల్స్ టీమ్ పార్టిసిపేట్ చేస్తోంది.
Wales Hockey Team: ఎక్కడైనా సరే, ఏ ఆట అయినా సరే నేషనల్ టీమ్‌కు ఆడుతున్నందుకు ప్లేయర్స్‌కు ఎంతో కొంత డబ్బు చెల్లిస్తారు. ఇండియాలో అయితే క్రికెటర్లకు ఏ స్థాయిలో డబ్బులు అందుతాయో మనందరికీ తెలుసు. జాతీయ క్రీడగా చెప్పుకుంటున్న హాకీకి అంతగా ఆదరణ లేకపోయినా.. ఇండియాలో జాతీయ జట్టుకు ఆడే ప్లేయర్స్‌కు ఎంతో కొంత మ్యాచ్ ఫీజు ఇస్తారు.
ట్రెండింగ్ వార్తలు
కానీ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతున్న హాకీ వరల్డ్‌కప్‌లో ఆడుతున్న వేల్స్ హాకీ టీమ్ పరిస్థితి మాత్రం వేరు. వేల్స్ నేషనల్ టీమ్‌లో ఆడే ప్లేయర్స్‌కు మ్యాచ్ ఫీజు కాదు.. వాళ్లే ఎదురు డబ్బులు చెల్లిస్తారు. దేశంలో హాకీకి అంతగా ఆదరణ లేకపోవడంతో వరల్డ్‌కప్‌కు రావడానికి కూడా ప్లేయర్సే తమకు తాముగా డబ్బులు సమకూర్చుకున్నారు.
ఈ షాకింగ్ విషయాలను వేల్స్ హెడ్ కోచ్ డేనియల్ న్యూకాంబ్ వెల్లడించాడు. నేషనల్ టీమ్‌కు ఆడేందుకు ఒక్కో ప్లేయర్ 1000 పౌండ్లు తమ జేబుల్లో నుంచి ఇచ్చినట్లు అతడు తెలిపాడు. వేల్స్ హాకీ టీమ్ తొలిసారి వరల్డ్‌కప్‌లో ఆడుతోంది. అయితే ఇక్కడ మ్యాచ్‌లను చూసేందుకు రూర్కెలా, భువనేశ్వర్ స్టేడియాలకు వేల సంఖ్యలో అభిమానులు రావడం చూసి న్యూకాంబ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఇక ఈ వరల్డ్‌కప్‌కు రావడానికి విమాన ఛార్జీల కోసం కూడా వేల్స్ టీమ్ విరాళాలు సేకరించింది. 25 వేల పౌండ్లు రావడంతో వాటితోనే విమాన టికెట్లు, వసతి, భోజనం ఖర్చులు పెట్టుకుంటున్నారు. "ప్లేయర్స్‌పై భారాన్ని తగ్గించడానికి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం. ఏడాదికి ఒక్కో ప్లేయర్ 1000 పౌండ్లు చెల్లిస్తారు" అని పీటీఐతో న్యూకాంబ్ చెప్పాడు.
వేల్స్‌లో హాకీ చాలా చిన్న ఆట అని, అక్కడి నేషనల్ స్టేడియంలో కేవలం 200 మంది మాత్రమే కూర్చుని చూసే వీలుందని అతడు చెప్పడం విశేషం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో ప్లేయర్సే డబ్బు సమకూర్చుకొని నేషనల్ టీమ్‌కు ఆడుతున్నట్లు తెలిపాడు. అయితే ఈ మధ్య పెద్ద టోర్నీల్లో వేల్స్ సక్సెస్ సాధిస్తుండటంతో క్రమంగా స్పాన్సర్లు వస్తున్నారు.
ప్రభుత్వం కూడా మెల్లగా మద్దతిస్తోందని, షర్ట్ స్పాన్సర్ కూడా రావడంతో ప్లేయర్స్‌పై కాస్త భారం తగ్గినట్లు వెల్లడించాడు. యురోపియన్ క్వాలిఫయింగ్ ఈవెంట్ ద్వారా వరల్డ్‌కప్‌కు వేల్స్ టీమ్ అర్హత సాధించింది. ప్రపంచ హాకీలో దారుణ పతనం తర్వాత మూడేళ్లలోనే తమ టీమ్ మళ్లీ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం నిజంగా తనకు గర్వంగా ఉందని న్యూకాంబ్ చెప్పాడు.
సంబంధిత కథనం
టాపిక్