IND vs SA: విఫ‌ల‌మైన టీమ్ ఇండియా బ్యాట‌ర్లు - సౌతాఫ్రికా టార్గెట్ 134-t20 world cup team india set 134 runs target against south africa ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  T20 World Cup Team India Set 134 Runs Target Against South Africa

IND vs SA: విఫ‌ల‌మైన టీమ్ ఇండియా బ్యాట‌ర్లు - సౌతాఫ్రికా టార్గెట్ 134

Nelki Naresh Kumar HT Telugu
Oct 30, 2022 06:16 PM IST

IND vs SA: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రుగుతోన్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ త‌డ‌బ‌డ్డారు. సూర్య‌కుమార్ యాద‌వ్ మిన‌హా మిగిలిన బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో టీమ్ ఇండియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి 133 ప‌రుగులు చేసింది. సౌతాఫ్రికా ముందు మోస్త‌రు ల‌క్ష్యాన్ని విధించింది.

సూర్య‌కుమార్ యాద‌వ్
సూర్య‌కుమార్ యాద‌వ్

IND vs SA: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రుగుతోన్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా త‌డ‌బ‌డింది. బ్యాట్స్‌మెన్స్ విఫ‌లం కావ‌డంతో ఇర‌వై ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 133 ప‌రుగులు చేసింది. రోహిత్‌శ‌ర్మ‌, విరాట్ కోహ్లి స‌హా ప్ర‌ధాన బ్యాట్స్‌మెన్స్ మొత్తం విఫ‌ల‌మ‌య్యారు. సూర్య‌కుమార్ యాద‌వ్ 68 ర‌న్స్‌తో ఒంట‌రి పోరాటం చేయ‌డంలో టీమ్ ఇండియా ఈ మాత్ర‌మైనా స్కోరు చేయ‌గ‌లిగింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ‌రోసారి పేల‌వ ఫామ్‌ను కొన‌సాగించిన ఓపెన‌ర్ కె.ఎల్ రాహుల్ 14 బాల్స్‌లో కేవ‌లం 9 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. రోహిత్ శ‌ర్మ కూడా 14 బాల్స్‌లో 15 ర‌న్స్ చేసి ఎంగిడి బౌలింగ్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

గ‌త రెండు మ్యాచ్‌ల‌లో బ్యాట్ ఝులిపించిన విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో 12 ప‌రుగుల‌కే ఔట్ కావ‌డంతో టీమ్ ఇండియా క‌ష్టాల్లో ప‌డింది. దీప‌క్ హుడా ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేర‌గా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య కూడా 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు.

ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా సూర్య‌కుమార్ యాద‌వ్ మాత్రం ఫోర్లు, సిక్స‌ర్ల‌తో సౌతాఫ్రికా బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాడు. 31 బాల్స్‌లో హాఫ్ సెంచ‌రీ పూర్తిచేసుకున్నాడు. సూర్య‌కుమార్‌, కార్తిక్ క‌లిసి ఏడో వికెట్‌కు 52 ప‌రుగులు జోడించి టీమ్ ఇండియా స్కోరు వంద దాటించారు. కార్తిక్ నెమ్మ‌దిగా ఆడ‌టంతో టీమ్ ఇండియా స్కోరు వేగం త‌గ్గింది.

స్కోరు వేగం పెంచే క్ర‌మంలో 40 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, ఆరు ఫోర్ల‌తో 68 ర‌న్స్ చేసి సూర్య‌కుమార్ ఔట‌య్యాడు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో లుంగీ ఎంగిడి నాలుగు ఓవ‌ర్లు వేసి 29 ర‌న్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. పార్నెల్ మూడు, నోర్జ్‌కు ఒక్క వికెట్ ద‌క్కింది.

WhatsApp channel