T20 World Cup Final: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ జరిగేనా.. మెల్‌బోర్న్‌లో భారీ వర్షాలు-t20 world cup final between pakistan and england facing the rain threat in melbourne ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  T20 World Cup Final Between Pakistan And England Facing The Rain Threat In Melbourne

T20 World Cup Final: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ జరిగేనా.. మెల్‌బోర్న్‌లో భారీ వర్షాలు

Hari Prasad S HT Telugu
Nov 11, 2022 01:30 PM IST

T20 World Cup Final: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ జరిగేది అనుమానంగా మారింది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్‌ జరిగే ఆదివారం (నవంబర్‌ 13), రిజర్వ్‌ డే అయిన సోమవారం (నవంబర్ 14) కూడా అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

ఫైనల్ మ్యాచ్ జరగాల్సిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌
ఫైనల్ మ్యాచ్ జరగాల్సిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (BCCI Twitter)

T20 World Cup Final: ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక స్టేడియం మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ). అందుకే ఇక్కడ ఇండియా, పాకిస్థాన్‌.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి మ్యాచ్‌లతోపాటు మరికొన్ని ముఖ్యమైన సూపర్‌ 12 మ్యాచ్‌లు, ఫైనల్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ కొన్ని రోజులుగా మెల్‌బోర్న్‌లో కురుస్తున్న వర్షాలు ఈ మ్యాచ్‌లకు అడ్డు పడుతున్నాయి. అదృష్టవశాత్తూ ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ పూర్తిగా జరిగినా.. ఎంతో ముఖ్యమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.

ట్రెండింగ్ వార్తలు

ఇక ఇప్పుడు పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మధ్య జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుపడే ప్రమాదం ఉంది. మ్యాచ్‌ జరిగే ఆదివారం (నవంబర్‌ 13) మెల్‌బోర్న్‌లో 95 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. "వర్షం పడే అవకాశం (దాదాపు 100 శాతం) చాలా ఉంది. భారీ వర్షం కూడా పడొచ్చు" అని శుక్రవారం ఉదయం అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.

ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉంది. అంటే సోమవారం (నవంబర్‌ 14) కూడా మ్యాచ్‌ నిర్వహించవచ్చు. కానీ ఆ రోజు కూడా 95 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. సోమవారం కూడా సుమారు 5 నుంచి 10 మిల్లీమీటర్ల వర్షం కురవచ్చు. టోర్నీ నిబంధనల ప్రకారం.. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒక్కో టీమ్‌ కనీసం 10 ఓవర్ల ఆట ఆడాల్సి ఉంటుంది. గ్రూప్‌ స్టేజ్‌లలో ఇది కేవలం 5 ఓవర్లు మాత్రమే.

ఆదివారం వర్షం అడ్డుపడినా కనీస ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. అది సాధ్యం కాకపోతే రిజర్వ్‌ డేకు వెళ్తారు. ఒకవేళ ఆదివారం మ్యాచ్‌ ప్రారంభమై పూర్తవకపోతే.. ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే సోమవారం తిరిగి ప్రారంభమవుతుంది. ఒకసారి టాస్‌ పడిందంటే చాలు మ్యాచ్ ప్రారంభమైనట్లే. ఒకవేళ ఆదివారం ఓవర్లు తగ్గించి ఆడాలని నిర్ణయించిన తర్వాత మ్యాచ్‌ కొనసాగకపోతే సోమవారం మళ్లీ 20 ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించడానికే ప్రయత్నిస్తారు.

ఫైనల్ మ్యాచ్‌ రద్దయితే..

ఒకవేళ రెండు రోజుల్లోనూ మ్యాచ్‌ను కనీస ఓవర్ల పాటు కూడా నిర్వహించే పరిస్థితి లేకపోతే ఎలా? ఈ సందేహం కూడా అభిమానుల్లో ఉంటుంది. అలాంటి సమయంలో వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఇద్దరికీ అందిస్తారు. అంటే పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ టీమ్స్‌ ట్రోఫీని పంచుకోవాల్సి వస్తుంది. 2002-03లో ఇండియా, శ్రీలంక మధ్య ఛాంపియన్స్‌ ట్రోఫీని ఇలాగే షేర్‌ చేశారు. ఇక 2019 వరల్డ్‌కప్‌లో ఇండియా, న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ రెండు రోజుల పాటు సాగింది.

ఈ టీ20 వరల్డ్‌కప్‌లో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరగాల్సిన మూడు మ్యాచ్‌లో కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌.. ఆఫ్ఘనిస్థాన్‌, ఐర్లాండ్‌.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. ఇక మరో మ్యాచ్‌లో డీఎల్‌ఎస్‌ పద్ధతిలో ఇంగ్లండ్‌కు ఐర్లాండ్‌ షాకిచ్చింది.

WhatsApp channel