India vs South Africa: దంచికొట్టిన సఫారీలు.. సెంచరీతో కదం తొక్కిన రసో.. భారత్ ముందు భారీ లక్ష్యం
India vs South Africa 3rd T20I: టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. రిలీ రసో(100) శతకంతో విజృంభించడంతో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
India vs South Africa: టీమిండియాతో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో ధక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది సఫారీ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రసో(100) సెంచరీతో అదరగొట్టగా.. ఓపెనర్ క్వింటన్ డికాక్(68) అర్ధశతకంతో రాణించాడు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దీపక్ చాహర్ చెరో ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఓ మోస్తరు ఆరంభం దక్కింది. ఓపెనర్లు టెంబా బవుమా, డికాక్ తొలి వికెట్‌కు 30 పరుగులు జోడించారు. కెప్టెన్ బవుమా ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఔటై మరోసారి విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్ క్వింటన్ డికాక్.. అర్ధశతకంతో రెచ్చిపోయాడు. వన్డౌన్ బ్యాటర్ రిలీ రసోతో కలిసి 90 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ అదరగొట్టారు.
ముందుగా క్వింటన్ డికాక్ అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని తన సత్తా చాటాడు. అయితే అనవసర పరుగుకు ప్రయత్నించి శ్రేయాస్ అయ్యర్ చేతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. డికాక్ ఔటైన తర్వాత రసో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. బౌలర్ ఎవరైన తన తాకిడి ముందు నిలువలేకపోయారు. 48 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రసో జట్టుకు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్(19) సిక్సర్ల వర్షం కురిపించాడు. దీపక్ చాహర్ వేసిన ఆఖరు ఓవర్లో నోబాల్‌ను సిక్సర్‌గా మలిచిన మిల్లర్.. తదుపరి బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపాడు. తదుపరి బంతిని కూడా సిక్సర్‌గా మలచగా.. చివరి బంతికి సింగిల్ వచ్చింది. ఫలితంగా ఆ ఓవర్‌లో మొత్తంగా 3 సిక్సర్లు సహా 24 పరుగులు వచ్చాయి.
సంబంధిత కథనం