Pujara Felicitation: పుజారా 100వ టెస్ట్.. సన్మానించిన గవాస్కర్-pujara felicitated by sunil gavaskar ahead of his 100th test for india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pujara Felicitated By Sunil Gavaskar Ahead Of His 100th Test For India

Pujara Felicitation: పుజారా 100వ టెస్ట్.. సన్మానించిన గవాస్కర్

Hari Prasad S HT Telugu
Feb 17, 2023 09:51 PM IST

Pujara Felicitation: పుజారా 100వ టెస్ట్ ఆడుతున్న సందర్భంగా ఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్టు ప్రారంభానికి ముందు అతన్ని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సన్మానించాడు.

వందో టెస్టు ఆడుతున్న పుజారాకు క్యాప్ అందిస్తున్న గవాస్కర్
వందో టెస్టు ఆడుతున్న పుజారాకు క్యాప్ అందిస్తున్న గవాస్కర్ (AP)

Pujara Felicitation: టెస్ట్ క్రికెట్ ఓ క్రికెటర్ కు అసలైన పరీక్ష. వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఎంత బాదినా.. టెస్టుల్లో రాణిస్తేనే ఓ ప్లేయర్ పరిపూర్ణ ప్లేయర్ అవుతాడు. అలాంటిది ఓ ప్లేయర్ వంద టెస్టులు ఆడటమంటే మాటలు కాదు. నిలకడగా రాణించడంతోపాటు ఫిట్‌నెస్ కూడా చాలా ముఖ్యమే. తాజాగా అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు చెతేశ్వర్ పుజారా.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు పుజారాకు కెరీర్ లో 100వది కావడం విశేషం. ఈ సందర్భంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. పుజారాను ఘనంగా సన్మానించాడు. అతనికి 100వ టెస్టు క్యాప్ ను అందించాడు. పుజారా 100వ టెస్టు ఆడుతుంటే ప్రత్యక్షంగా చూడాలని వచ్చిన అతని తండ్రి, భార్య, ఇతర కుటుంబ సభ్యులంతా ఆ సమయంలో అక్కడే ఉన్నారు.

ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ.. 100వ టెస్టులో ఓ భారీ సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా పుజారా నిలవాలని, ఢిల్లీలో మరో విజయానికి బాటలు వేయాలని ఆకాంక్షించాడు. "చిన్నతనంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏదో ఒక రోజు ఇండియాకు ఆడాలని కలలు కనేవాళ్లం. చివరికి ఇండియాకు ఆడే అవకాశం రావడం నమ్మశక్యం కాని ఫీలింగ్.

అది మళ్లీ మళ్లీ చేయాలని మీరు భావిస్తారు. అది జరగాలంటే చాలా కఠోరమైన శ్రమ, అంకితభావం, ఆత్మవిశ్వాసం కావాలి. ఏకాగ్రతతో ఉండాలి. బ్యాటింగ్ కు దిగుతున్న సమయంలో చేతిలో బ్యాట్ కాదు.. భారతదేశ జెండా పట్టుకున్న భావన కలగాలి. ఇండియా కోసం నువ్వు నీ శరీరాన్నే అడ్డుగా పెట్టావు. ఎన్నో దెబ్బలు తిన్నావు.

నీ వికెట్ కోసం బౌలర్లు తీవ్రంగా శ్రమించేలా చేశావు. నువ్వు చేసిన ప్రతి పరుగు ఇండియాకు ఎంతో విలువైనదే. హార్డ్ వర్క్, ఆత్మవిశ్వాసానికి నువ్వు రోల్ మోడల్. శుభాకాంక్షలు. 100వ టెస్ట్ క్లబ్ లోకి నీకు స్వాగతం" అని సన్నీ అన్నాడు.

టీ20 క్రికెట్ బాగా పాపులర్ అయిన తర్వాతే ఇండియన్ టీమ్ లో అడుగుపెట్టిన పుజారా.. మిగతా ప్లేయర్స్ లాగా ఆ ఫార్మాట్ వైపు చూడలేదు. టెస్టు క్రికెట్ కే కట్టుబడి ఉన్నాడు. 99 టెస్టులలో 7021 రన్స్ చేశాడు. అతని సగటు 44.15 కాగా.. అందులో 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది టెస్టు టీమ్ లోనూ చోటు కోల్పోయినా.. కౌంటీ క్రికెట్ ఆడి టన్నుల కొద్దీ రన్స్ చేసిన అతడు మళ్లీ టీమ్ లోకి వచ్చాడు.

WhatsApp channel

సంబంధిత కథనం