Pakistan Semis Qualification: బంగ్లాదేశ్‌పై ఇండియా గెలుపుతో పాకిస్థాన్‌ పనైపోయినట్లేనా?-pakistan semis qualification scenarios after india defeated bangladesh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pakistan Semis Qualification Scenarios After India Defeated Bangladesh

Pakistan Semis Qualification: బంగ్లాదేశ్‌పై ఇండియా గెలుపుతో పాకిస్థాన్‌ పనైపోయినట్లేనా?

Hari Prasad S HT Telugu
Nov 02, 2022 09:31 PM IST

Pakistan Semis Qualification: బంగ్లాదేశ్‌పై ఇండియా గెలుపుతో పాకిస్థాన్‌ పనైపోయినట్లేనా? టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌ రేసు నుంచి ఆ టీమ్‌ తప్పుకున్నట్లేనా? నిజానికి పాకిస్థాన్‌కు ఇంకా అవకాశం ఉంది. అదెలాగో చూద్దాం.

పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నా అది అంత సులువు కాదు
పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నా అది అంత సులువు కాదు (Pakistan Cricket Twitter)

Pakistan Semis Qualification: టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లోనే ఇండియా చేతుల్లో అనూహ్యంగా ఓడినప్పటి నుంచీ పాకిస్థాన్‌ సెమీఫైనల్‌ అవకాశాలు బలహీనమవుతూ వస్తున్నాయి. ఆ తర్వాత జింబాబ్వే చేతుల్లో ఓటమితో ఆ టీమ్‌కు పెద్ద దెబ్బే పడింది. అయినా సరే సౌతాఫ్రికాపై ఇండియా గెలిస్తే తమ అవకాశాలు మెరుగవుతాయని ఆశగా ఎదురు చూసినా అదీ జరగలేదు.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా బంగ్లాదేశ్‌ చేతుల్లో ఇండియా ఓడిపోవాలని కోరుకుంది. కానీ ఆ కోరికా తీరలేదు. దీంతో ఆ టీమ్‌ సెమీఫైనల్‌ అవకాశాలు దాదాపు కోల్పోయినట్లే. అయితే సాంకేతికంగా పాకిస్థాన్‌కు ఇంకా అవకాశం ఉంది. కానీ అది సాధ్యం కావాలంటే అద్భుతమే జరగాలి. పాక్‌ సెమీస్‌కు అర్హత సాధించడానికి రెండు దారులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికా ఓడిపోవాలి

ముందు పాకిస్థాన్‌ తన మిలిగిన రెండు మ్యాచ్‌లలోనూ కచ్చితంగా విజయాలు సాధించాలి. గురువారం (నవంబర్ 3) సౌతాఫ్రికాతో, ఆదివారం (నవంబర్‌ 6) బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్‌ ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లోనూ పాక్‌ గెలవడంతోపాటు తన చివరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌ చేతుల్లో ఓడిపోవాలి. లేదంటే కనీసం ఆ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా కావాలి.

ఇండియా దారుణంగా ఓడితేనే..

ఇక పాకిస్థాన్‌ సెమీస్‌ చేరాలంటే మరో దారి ఇండియా తన చివరి మ్యాచ్‌లో జింబాబ్వే చేతుల్లో దారుణంగా ఓడిపోవాలి. అది కూడా పాకిస్థాన్‌ నెట్‌ రన్‌రేట్‌ కంటే ఇండియా నెట్‌ రన్‌రేట్‌ తక్కువకు పడిపోయేలా ఓడితేనే. అదే సమయంలో పాకిస్థాన్‌ ఇటు సౌతాఫ్రికా, అటు బంగ్లాదేశ్‌లపై కచ్చితంగా గెలవాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి రెండూ సాధ్యమయ్యే పని కాదు. సౌతాఫ్రికాపై పాకిస్థాన్‌ గెలవడమే అతి పెద్ద సవాలు. ఒకవేళ గెలిచినా.. తమ చివరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌ చేతుల్లోనో లేదంటే ఇండియా.. జింబాబ్వే చేతిలోనో ఓడిపోవడం అంత సులువు కాదు. ఆ లెక్కన పాకిస్థాన్‌కు దాదాపు దారులు మూసుకుపోయినట్లే. అయితే క్రికెట్‌లో, అందులోనూ టీ20ల్లో జరిగే అద్భుతాలనే ఇక పాకిస్థాన్‌ నమ్ముకోవాలి.

WhatsApp channel