India vs Bangladesh match highlights: ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ను ఓడించిన ఇండియా-india beat bangladesh in rain hit match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Beat Bangladesh In Rain Hit Match

India vs Bangladesh match highlights: ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ను ఓడించిన ఇండియా

Hari Prasad S HT Telugu
Nov 02, 2022 05:51 PM IST

India vs Bangladesh: ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి ఊపిరి పీల్చుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడి ఇండియాకు చుక్కలు చూపించింది బంగ్లాదేశ్‌.

అడిలైడ్ లో వర్షం తర్వాత అద్భుతంగా పుంజుకొని విజయం సాధించిన ఇండియా
అడిలైడ్ లో వర్షం తర్వాత అద్భుతంగా పుంజుకొని విజయం సాధించిన ఇండియా (AFP)

India vs Bangladesh: టీ20 వరల్డ్‌కప్‌లో కీలకమైన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో ఓడించింది టీమిండియా. ఈ విజయంతో గ్రూప్‌ 2లో ఇండియా మరోసారి టాప్‌లోకి దూసుకెళ్లింది. అయితే ఈ గెలుపు మాత్రం ఇండియాకు అంత సులువుగా దక్కలేదు.

ట్రెండింగ్ వార్తలు

చివరి బంతి వరకూ పోరాడి ఇండియాకు చుక్కలు చూపించారు బంగ్లాదేశ్‌ టెయిలెండర్లు. వర్షం కారణంగా 16 ఓవర్లలో 151 పరుగులకు లక్ష్యాన్ని కుదించగా.. చివరికి బంగ్లాదేశ్ 6 వికెట్లకు 146 రన్స్‌ చేసింది. ఆ టీమ్‌ టెయిలెండర్లు నురుల్‌ హసన్‌ (24), తస్కిన్‌ అహ్మద్‌ (12) చివర్లో ఇండియన్‌ టీమ్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఓ సిక్స్‌, ఫోర్‌ కొట్టాడు నురుల్‌ హసన్‌. చివరి బంతికి 7 పరుగులు అవసరం కాగా.. ఒక పరుగు మాత్రమే వచ్చింది. ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్, హార్దిక్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

185 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చాడు. ప్రతి ఇండియన్‌ బౌలర్‌ను చితకబాదుతూ బౌండరీల వర్షం కురిపించాడు. దాస్‌ కేవలం 21 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో బంగ్లాదేశ్‌ 7 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 66 రన్స్‌ చేసింది. ఈ సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో మ్యాచ్ చాలాసేపు ఆగిపోయింది. అయితే అప్పటికి బంగ్లాదేశ్‌ డీఎల్‌ఎస్‌ స్కోరు కంటే 17 పరుగులు ఎక్కువే చేసింది. దీంతో భారత అభిమానుల్లో ఆందోళన కలిగింది.

అయితే చాలాసేపటి తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌ టార్గెట్‌ను 16 ఓవర్లలో 151 రన్స్‌గా నిర్ణయించారు. అంటే అప్పటికి 54 బాల్స్‌లో 85 రన్స్ చేయాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే కేఎల్‌ రాహుల్‌ కళ్లు చెదిరే త్రోతో లిటన్ దాస్‌ను రనౌట్‌ చేశాడు. ఈ రనౌటే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. లిటన్‌ కేవలం 27 బాల్స్‌లోనే 60 రన్స్‌ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.

ఇక అక్కడి నుంచీ బంగ్లాదేశ్‌ మళ్లీ కోలుకోలేకపోయింది. భారీ షాట్లు ఆడబోయి ఒక్కో బ్యాటర్‌ పెవిలియన్‌కు చేరాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆ టీమ్‌ను మరింత దెబ్బతీశాడు. ఆ తర్వాతి ఓవర్లో హార్దిక్‌ పాండ్యా కూడా మరో రెండు వికెట్లు తీశాడు.

కోహ్లి, రాహుల్ హాఫ్ సెంచరీలు

అంతకుముందు విరాట్‌ కోహ్లి మరోసారి చెలరేగాడు. అతనికితోడు తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 రన్స్‌ చేసింది. విరాట్ కోహ్లి 44 బాల్స్‌లో 64 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు.

కోహ్లి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లికి ఇది మూడో హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగుల రికార్డు కూడా అతని పేరిటే ఉంది. రాహుల్‌ 32 బాల్స్‌లో 50 రన్స్‌ చేసి ఔటయ్యాడు. ఇక సూర్యకుమార్‌ తనదైన స్టైల్లో ఆడి 16 బాల్స్‌లోనే 30 రన్స్‌ చేసి ఔటయ్యాడు. పాండ్యా (5), దినేష్‌ కార్తీక్‌ (7) విఫలమయ్యారు. చివరి ఓవర్లో అశ్విన్ ఓ సిక్స్, ఫోర్ కొట్టడంతో ఇండియా స్కోరు 180 దాటింది. అతడు 6 బాల్స్ లో 13 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియన్‌ టీమ్‌ కాస్త కష్టంగానే ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ తడబడుతూ ఆడారు. రోహిత్‌ కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. పవర్‌ ప్లే ముగిసే సమయానికి ఇండియా వికెట్‌ నష్టానికి 37 రన్స్‌ మాత్రమే చేసింది. అయితే ఆ తర్వాత రాహుల్‌ చెలరేగిపోయాడు. తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్‌.. ఈ మ్యాచ్‌లో మునుపటి రాహుల్‌ను తలపించాడు.

తనదైన షాట్లు ఆడుతూ కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో రాహుల్‌కు బ్యాటింగ్‌ పాఠాలు చెబుతూ కనిపించిన కోహ్లి.. మ్యాచ్‌లో రాహుల్‌ షాట్లను అవతలి వైపు నుంచి ఎంజాయ్‌ చేస్తూ కనిపించాడు. రాహుల్‌ హాఫ్‌ సెంచరీ చేయగానే అతన్ని దగ్గరకు తీసుకొని అభినందించాడు. అయితే ఆ వెంటనే రాహుల్‌ ఔటయ్యాడు.

WhatsApp channel