Pak vs Afg: ఓడిన ఆఫ్ఘనిస్థాన్.. పాకిస్థాన్‌ ఫైనల్‌కు.. ఇండియా ఇంటికి..-pakistan beat afghanistan to reach asia cup final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pakistan Beat Afghanistan To Reach Asia Cup Final

Pak vs Afg: ఓడిన ఆఫ్ఘనిస్థాన్.. పాకిస్థాన్‌ ఫైనల్‌కు.. ఇండియా ఇంటికి..

Hari Prasad S HT Telugu
Sep 07, 2022 11:07 PM IST

Pak vs Afg: పాకిస్థాన్‌ ఫైనల్‌ చేరింది. ఇండియాను ఇంటికి పంపించింది. పాక్‌ చేతిలో ఆఫ్ఘనిస్థాన్‌ పోరాడి ఓడటంతో ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరకుండానే టీమిండియా ఇంటిదారి పట్టింది.

ఇండియా ఆశలపై నీళ్లు చల్లిన పాకిస్థాన్
ఇండియా ఆశలపై నీళ్లు చల్లిన పాకిస్థాన్ (AP)

Pak vs Afg: ఆసియా కప్‌ 2022 ఫైనలిస్టులు ఎవరో తెలిసిపోయింది. ఎన్నో మలుపులు తిరుగుతూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య బుధవారం (సెప్టెంబర్‌ 7) ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్‌ 4 మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్‌ ఫైనల్‌ చేరింది. దీంతో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంక ఫైనల్‌ బెర్త్‌ కూడా ఖాయమైంది. ఈ రెండు టీమ్స్‌ ఆదివారం (సెప్టెంబర్‌ 11) జరగబోయే ఫైనల్లో తలపడనున్నాయి. అయితే అంతకుముందు శుక్రవారం (సెప్టెంబర్‌ 9) సూపర్ ఫోర్‌ స్టేజ్‌లో శ్రీలంక, పాకిస్థాన్‌ ఆడనున్నాయి.

పాకిస్థాన్‌ను ఆఫ్ఘనిస్థాన్‌ ఓడించాలని కోట్లాది మంది భారత అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఆఫ్ఘన్‌ టీమ్‌ చివరి వరకూ బాగానే పోరాడినా.. ఓటమి తప్పించుకోలేకపోయింది. ఈ ఓటమితో ఆ టీమ్‌ కూడా ఇంటిదారి పట్టింది. 130 రన్స్‌ టార్గెట్‌ను పాకిస్థాన్‌ 9 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్లో చేజ్‌ చేసింది. చివరి ఓవర్లో 11 రన్స్‌ అవసరం కాగా.. తొలి రెండు బాల్స్‌కు రెండు సిక్స్‌లు కొట్టి పాకిస్థాన్‌కు అనూహ్య విజయాన్ని అందించాడు నసీమ్‌ షా.

మూడు ఓవర్ల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై ఆశలు వదులుకున్న దశలో నసీమ్‌ షా అద్భుతమే చేశాడు. చివరికి అతడు 4 బాల్స్‌లో 14 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు పాక్‌ విజయంలో షాదాబ్‌ ఖాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌ కీలకపాత్ర పోషించారు. ఆఫ్ఘన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ 4 ఓవర్లలో 26 రన్స్‌ ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీసినా తన టీమ్‌ను గెలిపించలేకపోయాడు. అటు ఫరీద్‌ అహ్మద్‌, ఫజల్‌హక్‌ ఫరూకీ మూడేసి వికెట్లు తీసి ఆఫ్ఘన్‌కు విజయంపై ఆశలు కల్పించినా.. ఫలితం లేకపోయింది.

తడబడిన ఆఫ్ఘన్ బ్యాటర్లు

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 రన్స్‌ చేసింది. ఇబ్రహీం జద్రాన్‌ 35 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్‌ హజ్రతుల్లా జజాయ్‌ 21 రన్స్‌ చేశాడు. పాకిస్థాన్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు.

హరీస్‌ రవూఫ్‌ 2 వికెట్లు తీయగా.. నసీమ్‌ షా, హస్నైన్‌, నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ తలా ఒక వికెట్‌ తీసుకున్నారు. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆఫ్ఘన్‌ పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది.

WhatsApp channel