Lucknow vs Kolkata: ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. వరుసగా ఆ జట్టు ప్లేయర్లు గాయాల పాలవుతున్నప్పటికీ సమష్టిగా రాణించి ప్లేఆఫ్స్‌కు చేరువలో ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఈ జట్టు లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం నాడు ఈ మ్యాచ్ జరగనుంది. లక్నో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే కోల్‌కతాతో జరగనున్న ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ కోసం సన్నాహామవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా లక్నో జెర్సీ మారింది. ప్రముఖ ఇండియన్ ఫుట్‌బాల్ క్లబ్ మోహన్ బగన్‌కు నివాళీగా ఈ జెర్సీని మార్చింది.
ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ట్విటర్ వేదికగా తెలియజేసింది. మెరూన్, పచ్చ రంగు కాంబినేషన్‌లో ఉన్న ఈ స్పెషల్ ఎడిషన్ జెర్సీలో లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్య సహా ఇతర ఆటగాళ్లు మెరిసిపోతున్నారు. మన దేశంలో పెద్ద సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న ఫుట్‌బాల్ క్లబ్‌ల్లో ఒకటి మోహన్ బగాన్. దీంతో ఆ క్లబ్‌కు నివాళీగా లక్నో ఆటగాళ్లు మెరూన్, ఆకుపచ్చ రంగు జెర్సీని ధరించనుంది. కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌లో లక్నో ప్లేయర్లు ఈ స్పెషల్ జెర్సీలో కనువిందు చేయనున్నారు.
ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. కేకేఆర్‌ను రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టిన గౌతమ్ గంభీర్.. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. గతేడాది నుంచి లక్నో తరఫున మెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు గంభీర్. ప్రస్తుతం కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. 6 విజయాలతో 12 పాయింట్లు సాధించిన ఈ జట్టుకు ప్లేఆఫ్స్ కష్టమే.
మరోపక్క లక్నో జట్టు 7 విజయాలతో 15 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో చెరో పాయింట్ లభించింది. ఫలితంగా లక్నోకు 15 పాయింట్లు వచ్చాయి. కేకేఆర్‌తో శనివారం నాడు జరగాల్సిన మ్యాచ్‌లో లక్నో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. లేకుంటే ఆ జట్టుకు ఫ్లేఆఫ్స్ అర్హత సంక్లిష్టమవుతుంది.