Curator Sacked: చెత్త పిచ్ తయారు చేసిన క్యూరేటర్‌పై వేటు.. ఇండియన్ టీమ్ అడిగితేనే ఆ పిచ్ చేశాడా?-lucknow pitch curator sacked after low scoring second t20 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Lucknow Pitch Curator Sacked After Low Scoring Second T20

Curator Sacked: చెత్త పిచ్ తయారు చేసిన క్యూరేటర్‌పై వేటు.. ఇండియన్ టీమ్ అడిగితేనే ఆ పిచ్ చేశాడా?

Hari Prasad S HT Telugu
Jan 31, 2023 10:41 AM IST

Curator Sacked: చెత్త పిచ్ తయారు చేసిన క్యూరేటర్‌పై వేటు పడింది. అయితే ఇండియన్ టీమ్ అడిగితేనే ఆ పిచ్ చేశాడన్న వార్తలు వస్తుండటం గమనార్హం. దీనిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఏం చెబుతుందో చూడాలి.

పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించిన లక్నో పిచ్
పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించిన లక్నో పిచ్ (AP)

Curator Sacked: న్యూజిలాండ్ తో లక్నో జరిగిన రెండో టీ20లో పిచ్ ఎంత దారుణంగా వ్యవహరించిందో మనం చూశాం. న్యూజిలాండ్ 99 పరుగులకే పరిమితం కాగా.. ఆ 100 టార్గెట్ చేజ్ చేయడానికి కూడా ఇండియన్ టీమ్ తంటాలు పడింది. చివరికి ఎలాగోలా 6 వికెట్లతో గెలిచి సిరీస్ సమం చేసింది. అయితే మ్యాచ్ తర్వాత చెత్త పిచ్ అంటూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేయడంతో ఈ విషయం కాస్తా సీరియస్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పుడు లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ క్యూరేటర్ పై వేటు వేసినట్లు ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. క్యూరేటర్ పై అయితే వేటు వేశారు కానీ.. ఈ విషయంలో అసలు నిందించాల్సింది మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్ నే అని తాజాగా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. నిజానికి ఈ మ్యాచ్ కోసం క్యూరేటర్ నల్ల మట్టితో చేసిన రెండు పిచ్ లను రూపొందించాడు.

అయితే మ్యాచ్ కు మూడు రోజుల ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ సూచన మేరకు ఎర్ర మట్టి పిచ్ తయారు చేయాల్సి వచ్చింది. సమయం తక్కువగా ఉండటంతో పిచ్ సరిగా కుదరలేదు. టీ20 మ్యాచ్ కు అసలు పనికి రాని పిచ్ తయారైంది. దీనిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యాతోపాటు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా అసహనం వ్యక్తం చేశారు. దీనికి క్యూరేటరే సమాధానం చెప్పాలని మాంబ్రే అన్నాడు.

ఈ పిచ్ పూర్తిగా స్పిన్ కు అనుకూలించింది. మ్యాచ్ లో మొత్తం 39.5 ఓవర్లు పడగా.. అందులో 30 స్పిన్నర్లే వేశారు. మొత్తంగా కేవలం 200 రన్స్ మాత్రమే వచ్చాయి. అసలు ఈ పిచ్ టీ20లకు పనికి రాదని మ్యాచ్ తర్వాత పాండ్యా స్పష్టం చేశాడు.

దీంతో ఇప్పటి వరకూ ఉన్న క్యూరేటర్ ను తీసేసి గ్వాలియర్ కుచెందిన సంజీవ్ అగర్వాల్ ను నియమించారు. మార్చి నుంచి ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో ఆ సమయానికి లక్నో పిచ్ ను మెరుగ్గా చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ ను 1-1తో సమం చేసిన టీమిండియా నిర్ణయాత్మక మూడో టీ20ని బుధవారం (ఫిబ్రవరి 1) అహ్మదాబాద్ లో ఆడనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం