RCB vs LSG | హేజిల్‌వుడ్‌ 'జోష్‌'.. ఆర్సీబీ ఖాతాలో మరో విజయం-josh hazlewood takes 4 wickets as rcb beat lsg in ipl 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Josh Hazlewood Takes 4 Wickets As Rcb Beat Lsg In Ipl 2022

RCB vs LSG | హేజిల్‌వుడ్‌ 'జోష్‌'.. ఆర్సీబీ ఖాతాలో మరో విజయం

Hari Prasad S HT Telugu
Apr 19, 2022 11:32 PM IST

జోష్‌ హేజిల్‌వుడ్‌ చెలరేగాడు. నాలుగు వికెట్లతో లక్నో పని పట్టాడు. దీంతో సూపర్‌ జెయింట్స్‌ను సులువుగా ఓడించింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.

జోష్ హేజిల్‌వుడ్‌
జోష్ హేజిల్‌వుడ్‌ (PTI)

ముంబై: బ్యాటింగ్‌లో కెప్టెన్‌ డుప్లెస్సి, బౌలింగ్‌లో హేజిల్‌వుడ్‌ చెలరేగడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ 18 పరుగులతో విజయం సాధించింది. జోష్‌ హేజిల్‌వుడ్‌ సూపర్‌ బౌలింగ్‌తో లక్నోను దెబ్బతీశాడు. అతడు 4 ఓవర్లలో కేవలం 25 రన్స్‌ ఇచ్చి కీలకమైన 4 వికెట్లు తీశాడు. క్వింటన్‌ డీకాక్‌, మనీష్‌ పాండే, ఆయుష్‌ బదోనీ, స్టాయినిస్‌లను హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. చివరి ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన జేసన్‌ హోల్డర్‌.. ఆర్సీబీ విక్టరీ మార్జిన్‌ను తక్కువ చేయగలిగాడు. ఈ విజయంతో పాయింట్ల టేబుల్లో బెంగళూరు రెండోస్థానంలోకి దూసుకెళ్లింది.

182 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ తడబడుతూనే ఇన్నింగ్స్‌ ప్రారంభించడంతోపాటు రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోతూనే ఉంది. స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డీకాక్‌ కేవలం 3 రన్స్‌ చేసి హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 17 రన్స్‌కే లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. మనీష్‌ పాండే (6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. టాప్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. కృనాల్‌ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్‌ నిలబెడుతున్న సమయంలో ఔటయ్యాడు. రాహుల్‌ 24 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 రన్స్‌ చేశాడు. కృనాల్‌ ఒక్కడే 28 బంతుల్లో 42 రన్స్‌ చేయగా.. దీపక్‌ హుడా (13), ఆయుష్‌ బదోనీ (13) కూడా విఫలమయ్యారు.

డుప్లెస్సి.. సెంచరీ మిస్సయినా..

అంతకుముందు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెస్సి కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌ ఆడటంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 రన్స్‌ చేసింది. డుప్లెస్సి 64 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96 రన్స్‌ చేశాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగా.. భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఐపీఎల్‌లో గతంలోనూ అతడు ఓసారి 96 రన్స్‌కే ఔటయ్యాడు. మరోవైపు దినేష్‌ కార్తీక్‌ 8 బంతుల్లో 13 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించడంతో ఆర్సీబీ మంచి స్కోరు సాధించగలిగింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి ఓవర్లోనే రెండు షాక్‌లు తగిలాయి. ఓపెనర్‌ అనూజ్‌ రావత్‌ (4), విరాట్ కోహ్లి వరుస బాల్స్‌లో ఔటయ్యారు. దుష్మంత చమీరా వేసిన తొలి ఓవర్లో మిడాఫ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు అనూజ్‌ రావత్‌. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ కావడం ఆర్సీబీ క్యాంప్‌కు షాక్‌కు గురి చేసింది. 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తనకు అలవాటైన రీతిలో కాసేపు మెరుపులు మెరిపించాడు. కేవలం 11 బాల్స్‌లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ ఔటయ్యే సమయానికి ఆర్సీబీ స్కోరు 44 పరుగులు. తర్వాత వచ్చిన ప్రభుదేశాయ్‌ కూడా 10 రన్సే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 62 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది బెంగళూరు.

అయితే ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. కెప్టెన్‌ డుప్లెస్సి మాత్రం అడపాదడపా బౌండరీలు బాదుతూ.. స్కోరుబోర్డును ముందుకు కదిలించాడు. షాబాజ్‌ అహ్మద్‌ అతనికి చక్కని సహకారం అందించాడు. అతడు ఓవైపు వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో మరోవైపు డుప్లెస్సి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో 40 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించిన తర్వాత షాబాజ్‌ (26) రనౌటయ్యాడు.

WhatsApp channel

టాపిక్