Sourav Ganguly: ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ కంటే ఐపీఎల్‌లోనే డబ్బు ఎక్కువ: గంగూలీ-ipl generates more revenue than the english premier league says sourav ganguly ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl Generates More Revenue Than The English Premier League Says Sourav Ganguly

Sourav Ganguly: ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ కంటే ఐపీఎల్‌లోనే డబ్బు ఎక్కువ: గంగూలీ

Hari Prasad S HT Telugu
Jun 12, 2022 12:37 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) బ్రాండ్ వాల్యూ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. క్రికెట్‌ను పక్కా కమర్షియల్‌గా మార్చేసిన ఈ లీగ్‌ ఇప్పుడు యువ క్రికెటర్లపైనా కోట్ల వర్షం కురిపిస్తోంది.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (PTI)

న్యూఢిల్లీ: 14 ఏళ్ల కిందట ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద స్పోర్ట్స్‌ ఈవెంట్‌లలో ఒకటి. ఈ లీగ్‌ క్రేజ్‌ ఏటికేడు పెరుగుతోంది తప్ప తరగడం లేదు. తాజాగా ఇందులో మరో రెండు కొత్త టీమ్స్‌ వచ్చి చేరడంతో మరిన్ని మ్యాచ్‌లు, మరింత ఆదాయం వచ్చి చేరింది. ఒకప్పుడు వేలు, లక్షలు చూస్తేనే గొప్ప అనుకున్న క్రికెటర్లు ఇప్పుడు కోట్లలో ఆర్జించడానికి కారణం ఈ ఐపీఎల్‌.

దీనిపై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు. ఇండియా లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. క్రికెట్‌ ఈ స్థాయికి చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. "గేమ్‌ ఎంతలా మారిపోయిందో నేను చూశాను. ఒకప్పుడు నాలాంటి ప్లేయర్స్‌ వందల్లో సంపాదించాలని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. 

ఈ గేమ్‌ను అభిమానులు, ఈ దేశ ప్రజలు, బీసీసీఐ నడిపిస్తోంది. బీసీసీఐని కూడా క్రికెట్‌ అభిమానులే స్థాపించారు. ఈ స్పోర్ట్‌ చాలా స్ట్రాంగ్‌. ఇది ఇంకా మెరగవుతూనే ఉంటుంది. ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ కంటే కూడా ఐపీఎల్‌ ఎక్కువ ఆదాయం ఇస్తోంది. నేను ప్రేమించిన ఆట ఇప్పుడీ స్థాయిలో బలంగా మారడం చూస్తుంటే నాకు సంతోషంగానూ, గర్వంగానూ ఉంది" అని గంగూలీ అన్నారు.

లీడర్‌షిప్‌ స్టైల్‌ గురించి చెప్పమని అడిగితే.. దాదా తనదైన స్టైల్లో స్పందించారు. "కెప్టెన్సీ అంటే నా దృష్టిలో గ్రౌండ్‌లో టీమ్‌ను లీడ్‌ చేయడం. లీడర్‌షిప్‌ అంటే నా దృష్టిలో ఓ టీమ్‌ను నిర్మించడం. నేను సచిన్‌, అజర్, ద్రవిడ్‌లాంటి వాళ్లతో కలిసి ఆడినప్పుడు వాళ్లతో పోటీ పడలేదు. బదులుగా వాళ్లతో లీడర్లుగా కలిసి పని చేశాను.. బాధ్యతలు పంచుకున్నాను" అని గంగూలీ చెప్పారు.

కెప్టెన్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండటంలో కామన్‌గా ఉన్న పాయింట్‌ ఏంటి అని అడిగితే.. "రెండింట్లోనూ వ్యక్తులను మేనేజ్‌ చేయడమే కామన్‌ విషయం. ఈ దేశంలో అద్భుతమైన టాలెంట్‌ ఉంది. అది ప్లేయర్స్‌ అయినా కావచ్చు.. ఉద్యోగులైనా కావచ్చు. ఓ సక్సెస్‌ఫుల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండాలనుకుంటే నా సహచరులను గౌరవించాలని, అలా అయితే వాళ్లు మంచి ప్లేయర్స్‌గా ఎదుగుతారని నమ్మాను. అన్నీ మీ దగ్గరే పెట్టుకొని మంచి జరగాలంటే జరగదు" అని గంగూలీ అన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్