Indore Pitch: ఇండోర్‌లో బౌన్సీ పిచ్.. మూడో టెస్ట్ ఫలితం ఎటువైపో?-indore pitch looks interesting with red and black soil ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Indore Pitch Looks Interesting With Red And Black Soil

Indore Pitch: ఇండోర్‌లో బౌన్సీ పిచ్.. మూడో టెస్ట్ ఫలితం ఎటువైపో?

Hari Prasad S HT Telugu
Feb 28, 2023 08:27 PM IST

Indore Pitch: ఇండోర్‌లో బౌన్సీ పిచ్ కనిపిస్తోంది. నల్ల, ఎర్రమట్టి కలయికతో చేసిన ఈ పిచ్.. మూడో టెస్ట్ ఫలితంపై ఆసక్తి రేపుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం నుంచీ చర్చంతా పిచ్ లపైనే నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం పిచ్ పరిశీలిస్తూ క్యూరేటర్లతో మాట్లాడుతున్న కోచ్ ద్రవిడ్
ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం పిచ్ పరిశీలిస్తూ క్యూరేటర్లతో మాట్లాడుతున్న కోచ్ ద్రవిడ్ (AP)

Indore Pitch: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు నుంచే పిచ్ ల చుట్టూ చర్చ జరుగుతోంది. ఈ సిరీస్ కు ఇండియా ఎలాగూ స్పిన్ పిచ్ లే తయారు చేస్తుందని అందరూ ఊహించారు. అందుకు తగినట్లే తొలి రెండు టెస్టుల్లో స్పిన్ పిచ్ లతోనే ఆస్ట్రేలియాను మూడు రోజుల్లోపే చుట్టేసింది టీమిండియా.

ఈ నేపథ్యంలో మూడో టెస్టు జరగబోయే ఇండోర్ పిచ్ పైనా చర్చ జరిగింది. అయితే ఇక్కడి పిచ్ పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడి హోల్కర్ స్టేడియంలోని పిచ్ ను ఎర్ర, నల్లమట్టి కలిపి తయారు చేయడం విశేషం. దీంతో గత రెండు టెస్టుల పిచ్ ల కంటే ఇందులో బౌన్స్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ పిచ్ పై సోమవారం (ఫిబ్రవరి 27) పచ్చిక ఎక్కువగా కనిపించగా.. మంగళవారం (ఫిబ్రవరి 28) అది కాస్తా తగ్గిపోయింది.

ఈ పిచ్ ను మంగళవారం కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ పరిశీలించారు. ఉదయం పిచ్ పై నీళ్లు చల్లి రోలింగ్ చేయగా.. మధ్యాహ్నం పిచ్ పై ఉన్న కవర్లను తొలగించారు. అయితే ఈ పిచ్ తయారీ కోసం ఎర్ర, నల్ల మట్టి మిశ్రమం ఉపయోగించడం ఆసక్తిగా మారింది. సాధారణంగా ఇండోర్ లో పిచ్ లు ఎర్రమట్టితోనే తయారు చేస్తారు. ఇక్కడి ప్రాక్టీస్ వికెట్లు కూడా అలాగే ఉన్నాయి.

అయితే మ్యాచ్ కోసం ఉపయోగించే పిచ్ మాత్రం రెండు రకాల మట్టి మిశ్రమాలతో భిన్నంగా కనిపిస్తోంది. ఈ పిచ్ పై బౌన్స్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం ఇది కూడా స్పిన్ పిచ్చే అని స్పష్టం చేస్తున్నాడు.

"గత రెండు టెస్టుల్లోని పిచ్ లలాగే ఇది కూడా ఉంది. రెండు వైపులా పూర్తి పొడిగా ఉంది. మ్యాచ్ నడుస్తున్న కొద్దీ స్పిన్ ఎక్కువగా ఉంటుంది. స్పిన్ అవడానికి ఎంత సమయం తీసుకుంటోందో మాత్రం వేచి చూడాలి" అని స్మిత్ అన్నాడు. అయితే ఈ పిచ్ లో ఉన్న ఎర్రమట్టి కారణంగా గత రెండు టెస్టుల పిచ్ ల కంటే దీనిపై ఎక్కువ బౌన్స్, క్యారీ ఉండే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం