India vs South Africa: చివరి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు.. వన్డే సిరీస్‌ గెలిచిన టీమిండియా-india beat south africa in final odi to win the series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs South Africa: చివరి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు.. వన్డే సిరీస్‌ గెలిచిన టీమిండియా

India vs South Africa: చివరి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు.. వన్డే సిరీస్‌ గెలిచిన టీమిండియా

Hari Prasad S HT Telugu
Oct 11, 2022 06:36 PM IST

India vs South Africa: చివరి వన్డేలో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. ఢిల్లీలో మంగళవారం (అక్టోబర్‌ 11) జరిగిన మూడో వన్డేలో ఇండియా 7 వికెట్లతో గెలిచింది.

49 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించిన శుభ్‌మన్‌ గిల్‌
49 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించిన శుభ్‌మన్‌ గిల్‌ (AP)

India vs South Africa: సౌతాఫ్రికాపై ఇప్పటికే వన్డే సిరీస్‌ గెలిచిన ఇండియన్‌ టీమ్‌ ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. చివరి వన్డేలో విజయం సాధించిన ధావన్‌ సేన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. 100 రన్స్‌ స్వల్ప లక్ష్యాన్ని ఇండియా 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేజ్‌ చేసింది.

ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 49 రన్స్‌ చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 28 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. అతడు సిక్స్ తో మ్యాచ్ ను ముగించడం విశేషం. చేజింగ్‌లో 58 రన్స్‌కు 2 వికెట్లు కోల్పోగా శుభ్‌మన్‌, శ్రేయస్‌ మూడో వికెట్‌కు 39 రన్స్‌ జోడించారు. కెప్టెన్‌ ధావన్‌ 8, ఇషాన్‌ కిషన్‌ 10 రన్స్‌ చేసి ఔటయ్యారు.

సమష్టిగా రాణించిన బౌలర్లు

అంతకుముందు సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్‌ 27.1 ఓవర్లలో కేవలం 99 రన్స్‌కు ఆలౌటైంది. వన్డేల్లో ఇండియాపై సౌతాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోరు కావడం విశేషం. టీమిండియా బౌలర్లంతా చెలరేగిపోయారు. కుల్దీప్‌ 4, సుందర్‌, సిరాజ్‌, షాబాజ్‌ తలా రెండు వికెట్లు తీశారు.

సౌతాఫ్రికా చివరి 6 వికెట్లను కేవలం 33 పరుగుల తేడాలో కోల్పోవడం విశేషం. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌ 34 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మలన్‌ 15, యాన్సెన్‌ 14 రన్స్‌ చేయగా.. మిగతా ఏ బ్యాటర్‌ కూడా రెండంకెల స్కోరు అందుకోలేకపోయాడు. మూడో ఓవర్లో ఓపెనర్‌ డికాక్‌ (6) వికెట్‌ కోల్పోయిన ఆ టీమ్‌.. తర్వాత కోలుకోలేకపోయింది.

వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. హెండ్రిక్స్‌ (3), మార్‌క్రమ్‌ (9), మిల్లర్‌ (7), విఫలమయ్యారు. మూడో ఓవర్లో డికాక్‌ను ఔట్‌ చేసి సుందర్‌ ఇండియన్‌ టీమ్‌కు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత సిరాజ్‌ రెండు వికెట్లు తీసి సఫారీలను దెబ్బ తీశాడు. ఇక టెయిలెండర్లను కుల్దీప్‌ ఔట్‌ చేశాడు. వన్డేల్లో సౌతాఫ్రికాకు ఇండియాపై ఇదే అత్యల్ప స్కోరు కాగా.. ఓవరాల్‌గా ఈ ఫార్మాట్‌లో నాలుగో అత్యల్ప స్కోరు.

ఆ టీమ్‌ 1993లో ఆస్ట్రేలియాపై 63 రన్స్‌కే ఆలౌట్‌ కాగా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 2008లో ఒకసారి, 2022లో మరోసారి 83 రన్స్‌కే ఆలౌటైంది. ఆ తర్వాత 100లోపు స్కోరుకు చాప చుట్టేయడం ఈసారే.