WTC Final: అలా అయితే స్పిన్నర్‌గా జడేజా ఒక్కడినే తీసుకోవాలి.. కీపర్‌గా అతడే: హర్భజన్-harbhajan singh opts ks bharat over ishan kishan as wicket keeper for wtc final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final: అలా అయితే స్పిన్నర్‌గా జడేజా ఒక్కడినే తీసుకోవాలి.. కీపర్‌గా అతడే: హర్భజన్

WTC Final: అలా అయితే స్పిన్నర్‌గా జడేజా ఒక్కడినే తీసుకోవాలి.. కీపర్‌గా అతడే: హర్భజన్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 04, 2023 03:11 PM IST

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍లో టీమ్ఇండియా తుది జట్టు గురించి కొన్ని సూచనలు, తన అభిప్రాయాలను వెల్లడించాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అవేంటంటే..

WTC Final: అలా అయితే స్పిన్నర్‌గా జడేజా ఒక్కడినే తీసుకోవాలి.. కీపర్‌గా అతడే: హర్భజన్ (HT Photo)
WTC Final: అలా అయితే స్పిన్నర్‌గా జడేజా ఒక్కడినే తీసుకోవాలి.. కీపర్‌గా అతడే: హర్భజన్ (HT Photo)

WTC Final - Harbhajan Singh: ఐపీఎల్ ఫీవర్ అయిపోయాక.. ఇప్పుడు చర్చంతా ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) ఫైనల్ గురించే జరుగుతోంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7వ తేదీన లండన్‍లోని ఓవల్ మైదానంలో ఈ తుది సమరం జరగనుంది. ఈ తరుణంలో ఇండియా తుది జట్టులో ఎవరుంటారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా బౌలింగ్ కాంబినేషన్లు, కీపర్ గురించి ఎక్కువ చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ తన అభిప్రాయాలను చెప్పాడు.

ప్రపంచ టెస్టు చాంపియన్‍ ఫైనల్‍కు భారత బౌలింగ్ అటాక్ ఎలా ఉండాలో హర్భజన్ చెప్పాడు. మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌తో కలిసి ఓ టీవీ కార్యక్రమంలో ఈ విషయాలను పంచుకున్నాడు. వికెట్ కీపర్‌గా తుది జట్టులో కేఎస్ భరత్ ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఎందుకో వివరించాడు.

“తుది జట్టులో అతడు (ఇషాన్ కిషన్) ఉండాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కేఎస్ భరత్.. కొంతకాలంగా నిలకడగా ఆడుతున్నాడు. ఒకేవేళ వృద్ధిమాన్ సాహా ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు కేఎస్ భరత్.. ఫైనల్ ఎలెవెన్‍లో ఉండాలనిపిస్తుంది. ఒకవేళ కేఎల్ రాహుల్ ఉండి ఉన్నా ఇతర ఆప్షన్‍లను ఆలోచించే అవకాశం ఉండేది” అని హర్భజన్ సింగ్ చెప్పాడు.

ఒకవేళ ఓవల్ గ్రౌండ్ పిచ్‍పై గడ్డి ఎక్కువగా ఉండి, పేసర్లకు అనుకూలించేలా ఉంటే స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా ఒక్కడినే తుది జట్టులోకి తీసుకోవాలని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. అశ్విన్ ఉన్నా జడ్డూకే ఓటేశాడు. “పిచ్ ఎలా ఉందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళపై తక్కువ గడ్డి ఉండి సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటే ఇద్దరు స్పిన్నర్లు (అశ్విన్, జడేజా)తో ఆడవచ్చు. ఒకవేళ పరిస్థితి అలా లేకుండా ముగ్గురు సీమర్లు, రవీంద్ర జడేజాతో పాటు శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. బ్యాటింగ్‍లోనూ శార్దూల్ ఉపయోగకరంగా ఉంటాడు” అని హర్భజన్ సింగ్ అన్నాడు.

అయితే, మహమ్మద్ కైఫ్ మాత్రం వికెట్ కీపర్ విషయంలో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్‍ను తీసుకొని బ్యాటింగ్‍లో ఆరో స్థానంలో పంపి దూకుడుగా ఆడే రోల్ ఇవ్వాలని అన్నాడు. రిషబ్ ఒకప్పుడు దూకుడుగా ఆడేవాడని, అందుకే ఆరో స్థానంలో అటాకింగ్ షాట్లు రోల్‍కు భరత్ కంటే తాను కిషన్‍కే మొగ్గుచూపుతున్నానని అన్నాడు.

WhatsApp channel